Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/625

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్రలిపి పరిణామము

జ్రాలు సరస్వతీ విమల
       చారు కుచాగ్ర సరాలుఁ జూడఁ జి
త్రాలు మిటారి మోహన క
      రాలు నుతింపఁ దరంబె యేరికిన్. చాటువు.

సీ. ఆణిముత్తెముల సోయగము మించినవ్రాలు
       వరుసతో నిరుగేల వ్రాయనేర్చె.

జక్కన - విక్రమార్క చరిత్ర (సిద్దనమంత్రిఁ గూర్చి చెప్పినది.)

సీ. ఆణిము త్తెంబులై యపరంజి మువ్వలై
       కనుపట్టు వ్రాల చొక్కపుమెఱుంగు

(మించుపల్లి - తెలుఁగు పొలుపు.)

సీ. పట్టె వట్రువయును. ......
       వృద్ధి ప్రియంబును విశదగతియు.

గీ. గీలు కొన వ్రాయనంబులు వ్రాయ వ్రాయఁ
గొంకు కొసరులు చేతప్పు గొనకయుండు
లలిత ముక్తా ఫలాకార విలసనమున॥

పాండు 1.72.

అని రామకృష్ణకవి వేదాద్రిమంత్రి లేఖన నైపుణ్యమును ప్రస్తావించినాడు.

ఇట్టి గుండ్రమైన స్వరూపమును దాల్చిన తెలుగులిపి చరిత్రను పరిశీలించినచో నది తొలుత చతురస్రముగా అనగా నేటి దేవనాగర లిపివలె నలుచదరముగా నుండిన వ్రాతనుండి పరిణామము చెందినదని తెలియును. కాని ఈ సందర్భమున మొదట 'లిపి' 'వర్ణము' 'అక్షరము' అనువాటి రూప నిష్పత్తులను గూర్చి తెలిసికొనుట అప్రస్తుతము కాదు.

లిపి  :- “లిఖితాక్షర సంస్థానే లిపిర్లిఖి రుభేస్త్రియౌ" అని యమరము. (ద్వి. కాం. క్షత్రవర్గము 16.) దీని తెలుగు వ్యాఖ్యలో నిట్లున్నది:- ఇచ్చట లిఖితం అక్షర సంస్థానం అని విభాగించి ఈ నాలుగు శబ్దములు లిపికే పేళ్ళని కొందరు, లిఖితాక్షర విన్యాసే అనుపాఠమునందు, లిఖితా, లిపిః, లిఖిః - ఈ మూడును వ్రాత పేళ్లు. లివ్యతే౽న యాపత్రం లిపిః. లిఖిశ్చ - ఇ. సీ. లిపి, ఉపదేహే. దీని చేత పత్రము పూయబడునది గనుక లిపి, పా. లిపీ. లిబీ. ఈ.సీ. 1. 2. వ్రాయబడిన అక్షరముల యాకారము పేళ్లు (వ్రాఁత).

వర్ణము  :- వర్లో ద్విజాదౌ శుక్లాదౌ స్తుతా వర్ణంతు వాక్షరే. (తృ. కా. నా. వ. 49) వర్ణ్యతే వర్ణయతి చ వర్ణం వర్ణస్తుతౌ; కొనియాడ బడునది : ‘కొనియాడునది గనుక వర్ణము'.

“వర్ణస్తాల విశేషేస్యాద్ బ్రహ్మచర్యే విశేషణే ; విలేపనే కుథాయాంచ" ఇతి శేషః.

అక్షరము  :- “అక్షరంతు మోక్షే౽పి" (తృ. కా, నా. వ. 4183.) మోక్షమునకును, అపిశబ్దమువలన కకా రాది వర్ణములకును పరబ్రహ్మమునకును పేరు, “నక్షర తీత్యక్షరం" క్షర సంరక్షణే చెడనిది గనుక అక్షరము. “వర్ణే బ్రహ్మణ్యక్షరం స్యాత్." ఇతి శేషః.

పై వాటి వివరణము నీ క్రింద పొందుపరచుచున్నాను: ధ్వని 'క్షరము' నశించునది. లిపి అక్షరము స్థిరముగ నుండునది. ధ్వని అవర్ణము, లిపి వర్ణము, ఇట్లు లిపిని బట్టియే, లిపి వచ్చినతరువాతనే 'అక్షర' 'లిపి' శబ్దములు భాషలోనికి వచ్చినవి. ఇట్లని మొదట లిపిసూచకములు తరువాత సాహచర్యముచే ధ్వనిసూచకములు కూడనయ్యెను మొదట అవర్ణమనగా అకారపువన్నె (రంగుతో వ్రాయబడిన ప్రతిమ) యని యర్థము, తరువాత నది అకార ధ్వనిని కూడ సూచింపదొడగెను. వర్ణపదము సంస్కృత భాషయందు 'రంగు' అను నర్థముగలది. అది క్రమముగా జాతివాచకము, అక్షరవాచకము నయ్యెను. కొందరు ఎర్రగను, కొందరు నల్లగను ఉండగా వారిని వేరువేరు జాతులుగా నేర్పరచినందున 'వర్ణ' పదమునకు జాత్యర్థము సంప్రాప్తమయ్యేను. అక్షరములు నల్ల రంగుతో వ్రాయుట వలన వానికి వర్ణనామము వచ్చెను. లిపివాచకమైన వర్ణపదమునకు వేరు వ్యుత్పత్తిలేదు. మొదట వ్రాసెడు వాటికి వర్ణములనియు, చెక్కెడు వాటికి అక్షరములనియు పేర్లు ఏర్పడియుండును. క్రమముగా నవి సమానార్థకములై లిపితోపాటు ధ్వనినిగూడ బోధింపదొడగెను. లిపి పుట్టుటకు పూర్వము భాషయందు ధ్వని సూచక వర్ణము లెట్లు వ్యవహృతము లగుచుండె ననిన, స్వరములు అన్న పద మీయర్ధమున వాడబడుచుండె ననుట సమంజసము, తరువాతికాలమున నీపదము అచ్ పర్యాయమైనది. కాని సంగీతశాస్త్రమున స్వరము అను పదము కేవలము