ఆంధ్ర లక్షణగ్రంథములు
సంస్కృత ప్రతాపరుద్రీయమున కిది అనువాదమే అనదగియున్నను కొన్ని యంశములు ఇతర అలంకార గ్రంథముల నుండి సంగ్రహింపబడి యున్నవి. నాటక ప్రకరణము మాత్ర మనూదితము కాలేదు. మధురమైన శైలిలో కావ్య లక్షణములుగల ఉత్తమ గ్రంథమని దీనిని పేర్కొనవచ్చును. పరంపరాయాతమగు పాఠప్రవచనాదులచే ఈ గ్రంథ మాంధ్రదేశమునం దంతటను ప్రచారములో నున్నది.
ఈ గ్రంథమునకు ప్రాచీనమైన వ్యాఖ్యానములేదు. సుమారు ముప్పది సంవత్సరములకు పూర్వము కీర్తి శేషులయిన వెల్లాల సదాశివశాస్త్రిగారు (వీరు హైదరాబాదు రాష్ట్రమునందలి జటప్రోలు సంస్థానమున నుండిన గొప్ప వైయాకరణులు) నరసభూపాలీయమునందలి నాయక రసప్రకరణములకు మాత్రము వ్యాఖ్యను రచించిరి. అందు వారు విశేషించి మూలమును విమర్శించిరి. ఇంచుమించుగా వారికి సమకాలికు లనదగిన వింజమూరి కృష్ణమాచార్యులవారును, ప్రౌఢ వ్యాకరణకర్తయగు బహుజనపల్లి సీతారామాచార్యుల వారును కలసి యొక లఘు టీకను రచించిరి. ఇవి తప్ప ప్రాచీన వ్యాఖ్యలు లేవు. ఇటీవల శిరోమణి శ్రీ సన్నిధానము సూర్యనారాయణ శాస్త్రిగారు ఈ గ్రంథమునకు విపులమై, సకల సాహిత్య లక్షణ సమ్మిళితమైన వ్యాఖ్యానమును రచించినారు. ఇందు వీరు మూలమునందలి గుణదోషములను చర్చించు టయే కాక సల్లక్షణములను, ఉచితోదాహరణములను చేర్చిరి. ప్రతిఘట్టమునందును ప్రాచీనార్వాచీన ఆలంకారిక సిద్ధాంతములను సవిమర్శగా పొందుపరచిరి. రసాలంకార ధ్వనులలో అవసరమైన విషయముల నన్నిటిని వివరించిరి.
ఆంధ్ర కావ్యాదర్శము :- ఆచార్య దండి కృతమైన సంస్కృత కావ్యాదర్శమునకు ఇది అవ్వారి సుబ్రహ్మణ్య శాస్త్రిగారి పద్యానువాదము. సరళమైన రచన, చక్కని అన్వయ సౌలభ్యము గల ఈ గ్రంథము పఠితలకు అత్యం తోపకారియై యున్నది.
ఆంధ్రకావ్య మీమాంస : ఇది రాజశేఖరకవి సంస్కృతమున బహుళాంళములతో కావ్య జిజ్ఞాసువుల ఉపయో గార్థమై రచించిన "కావ్య మీమాంస"కు పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రిగారు ఒనర్చిన అనువాదము. సరళ రచనా ధురీణులగు శాస్త్రిగారి గ్రంథమును చక్కగా ననువదించి యున్నారు.
లక్షణ దీపిక :- క్రీ. శ. 15 వ శతాబ్దివాడైన గౌరన ఈ గ్రంథమును రచించెను. దీనికి ప్రబంధ దీపిక యనియు నామాంతరము గలదు. ఇందు కొన్ని అలంకారములు తదితర కావ్య లక్షణములు నున్నవి.
అలంకార మంజరి :- ఇది మమ్మటభట్టు రచించిన కావ్య ప్రకాశమునకు వివరణముతో రచింపబడిన అనువాదము. దీనిని శ్రీ శేట్టులూరి వేంకట రాఘవ అయ్యంగారు రచించిరి.
ఔచిత్య విచారచర్చ :- ఇది క్షేమేంద్రుని సంస్కృత రచనకు శ్రీ తిరుపతి వేంకట కవులు శిష్యులయిన వేంకట రామకృష్ణ కవులు అనువాదము. ఈ గ్రంథమున వీరు లక్ష్యముల నన్నిటిని తెలుగు ప్రబంధములనుండి చూపి చదువరులకు ఆంధ్రలక్ష్య జ్ఞానము కలుగుటకై మిక్కిలి కృషి చేసిరి. ప్రాచీనాలంకారికులు తత్తద్విషయములు (గుణాలంకార రీతి ధ్వనులు) కావ్య జీవితమని చెప్పిరి. ఔచిత్య మొక్కటియే కావ్య జీవితమని సిద్ధాంతీకరించిన క్షేమేంద్రుని మత మిందు చక్కగా తెలుపబడినది. క్షేమేంద్రుని మరియొక గ్రంథమగు కవి కంఠాభరణమును సైతము వీరు ఆంధ్రోదాహరణములతో అనువదించిరి.
రసమంజరి : సంస్కృతమున భానుదత్తకృతమయిన ఈ గ్రంథమును గణపవరపు వేంకటకవియు, 'గుడిపాటి కోదండపతియు అనువదించిరి. కాని అవి లుప్తము లయినవి. తాడూరు లక్ష్మీనరసింహారావుగారు అర్వాచీనముగా దీని నాంధ్రీకరించిరి. ప్రాచీను డని చెప్పదగిన మంచెళ్ళ వాసుదేవకవియు “గంధవహము" అను పేరుతో దీని ననువదించెను. చింతలపల్లి రామకృష్ణమూర్తి శాస్త్రిగారు అచ్చ తెలుగున దీనిని వ్రాసిరి. వేదము వేంకటరాయశాస్త్రి గారు సంస్కృత మూలమునకు ఆంధ్రవ్యాఖ్యానమును రచించియున్నారు. ఇది ముప్పదియారు భేదములతో నాయికా లక్షణములను, నాయక లక్షణములను వివరించి యున్నది. నాయికా లక్షణములను ఇంత విపులముగా చర్చించిన గ్రంథము మరియొకటి లేదు.