Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/609

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్ర లక్షణగ్రంథములు


తత్సమ పదములు తెలుగున పొందు రూపభేదములను,దిజ్మాత్రముగా సూచించినవి. తత్సమపదముల రూప నిష్పత్తి ఈ గ్రంధమునందు విపులముగా ప్రదర్శింపబడినది. మరియు ప్రక్రియావిధానము సులభము చేయబడినది.ఇందలి కృదంత ప్రకరణము ధాతువివేకమును కరతలా మలకము గావించును. ఇందు సంధి, కృదంత, ఉపసర్గ,తద్ధిత, స్త్రీ - ప్రత్యయ అవ్యయ, సమాన ప్రకరణములును, రూపభేద, లౌకిక న్యాయ ప్రకరణములును గలవు. ఆంధ్ర వాఙ్మయమునందలి సంస్కృతపద, సమాసాది జ్ఞానమును కూలంకషముగా ఇది కలిగించును.

ఇతరములు  :- గత శతాబ్ది - అంతము మొదలుకొని నేటివరకును విద్యార్థిజన సౌకర్యార్థమై చిన్న చిన్న వ్యాకరణము లెన్ని యో బయలు దేరినవి. పురాతనకాలమున రచింపబడిన వాటిలో పెక్కు గ్రంథములు మనకు లభింపలేదు. కొన్ని ముద్రితములుగాక తాళపత్రముల యందే విశ్రాంతిని చెందుచున్నవి. కనుక ఈ వ్యాకరణ శాస్త్రము కావ్యరచన ఆరంభమైన నాటినుండి నేటి వరకును సాగుచున్నదనియే మనము గ్రహింపవలయును. వెంకయ్య వ్యాకరణము, కందుకూరి వీరేశలింగము పంతులుగారి సంగ్రహ వ్యాకరణము, వావిలికొలను సుబ్బారావుగారి సులభ వ్యాకరణము మొదలుకొని పాఠశాలల ఉపయోగార్థమై ఆధునిక ఆంగ్ల సంప్రదాయానుసారముగా రచింపబడిన వ్యాకరణము లెన్ని యో కలవు. ప్రతిదానియందును గుణ విశేషము జిజ్ఞాను జనోపయోగకరమై యున్నది.

పైన పేర్కొనబడిన వేకాక ఆంగ్లభాషయందు రచింపబడిన ఆంధ్ర వ్యాకరణములు కూడ కలవు. ఆంధ్రభాషను నేర్చు కొనెడి ఆంగ్లేయుల సదుపాయముకొరకు వ్రాసిన గ్రంథము లివి. ప్రప్రథమముగా సివిలు సర్వీసు ఉద్యోగి యగు ఎ. డి. కాంబెలుదొర 1816 వ సంవత్సరమువ ఒక వ్యాకరణమును; తరువాత మామిడి వెంకయ్యగారి సాయమున విలియం బ్రౌనుదొర 1817 వ సంవత్సరమున ఇంకొక వ్యాకరణమును; సి. పి. బ్రౌనుదొర1840 లో ఒక వ్యాకరణమును, ఆర్డెనుదొర 1873 వ సంవత్సరమున మరియొక వ్యాకరణమును రచించిరి. కాంబెలు వ్యాకరణము తెలుగు వ్యాకరణముల పద్ధతిని కొంత పోలియున్నది. కాని సి. పి. బ్రౌను వ్యాకరణము క్రొత్తమార్గమును త్రొక్కినది. తెలుగు వ్యాకరణముల పద్ధతి క్రొత్తగా భాషను నేర్చుకొను పాశ్చాత్య విద్యార్థికి భయమును కలిగించుచున్న దనియు, అట్టివానికి మొదట వ్యావహారిక భాషను గూర్చిన వ్యాకరణమే ఉపయుక్త మగు ననెడి తలంపుతో బ్రౌను దీనిని రచించెను. పండితులతో కంటే సామాన్యులతో కలిసిమెలసి నివసించుట వలననే భాషా హృదయము పట్టుబడునని అతని విశ్వాసము. (ఇందు 12 భాగములు కలవు.) ఆర్డెన్ దృష్టికూడ ఇట్టిదే. తెలుగు నేర్చుకొనెడి పాశ్చాత్య విద్యార్థి ప్రారంభించుటకు, క్రమముగా వ్యావహారిక భాషను స్వాధీనము చేసికొనుటకు పిమ్మట గ్రాంధిక భాషను పరిచయము చేసికొనుటకు వీలుగా ఇతడి వ్యాకరణమును మూడు భాగములుగా రచించెను. ఈ వ్యాకరణ రచనలో ఇతనికి పై రెండు వ్యాకరణములేకాక కొన్ని ఇతర ఆంధ్ర వ్యాకరణములు కూడ సాయపడినవి.

II అలంకార శాస్త్రము  :- కావ్య లక్షణములను నిర్దేశించెడి శాస్త్రమునకు అలంకార శాస్త్రమని పేరు. సంస్కృతము నందు దీనివిషయమై అపారమైన కృషి జరిగి ఎన్నియో ఉద్గ్రంథములు వెలువడినవి. ఆంధ్రభాష యందు కూడ అలంకార శాస్త్రవిషయముపై కొన్ని గ్రంథములను ప్రాచీనులును, అర్వాచీనులునుగూడ రచించిరి. అవి వరుసగా సమీక్షింపబడుచున్నవి.

కావ్యాలంకార చూడామణి : విద్యానాథ కృతమయిన ప్రతాపరుద్రీయమును, ఆచార్య దండికృతమైన కావ్యా దర్శమును ఆధారముగా గొని స్వీయ కల్పనలతో విన్నకోట పెద్దయకవి ఈ గ్రంథమును రచించి, చాళుక్య వంశీయుడగు విశ్వేశ చక్రవర్తికి అంకిత మిచ్చెను. విశ్వేశ చక్రవర్తి క్రీ.శ.1407 ప్రాంతమువాడు. విన్నకోట పెద్దయకవి శాలివాహన శకవర్షము 1324 తరువాతనే ఈ గ్రంథమును రచించినట్లు చారిత్రికుల అభిప్రాయము. విన్నకోట పెద్దయ నియోగి బ్రాహ్మణుడు, తండ్రి గోవిందామాత్యుడు. నివాసము రాజమహేంద్రవర ప్రాంతము. విద్యానాథుడు ప్రతాపరుద్రునకు అంకితముగా ప్రతిలక్ష్యమును రచించినట్లే ఇతడు చాళుక్య విశ్వనాథునికి అంకిత మగునట్లుగా ప్రతిలక్ష్యమును రచిం