Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/593

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్రప్రదేశము _ II

రాజకీయ పరిస్థితులు: ఆంధ్రదేశములో రాజకీయ వాతావరణము ఎక్కువ, కాంగ్రెసు, కమ్యూనిస్టు, ప్రజాపార్టీలకు ఆదరణము ఉన్నది. విశాఖపట్టణము, తిరుపతులలో విశ్వవిద్యాలయాలు ఏర్పడ్డవి.

డి. వి. కె.

ఆంధ్రప్రదేశము II (తెలంగాణము): తెలంగాణములో 9 జిల్లా లున్నవి. అవి ఆదిలాబాదు (9,02,522 మంది), నిజామాబాదు (7,73,158 మంది), మెదక్ (10,27,293 మంది), కరీంనగరు (14,28,168 మంది), వరంగల్లు (13,25,984 మంది), నల్లగొండ (12,52,810 మంది), ఖమ్మం (7,00,006 మంది), హైదరాబాదు (15,11,336 మంది), మహబూబునగరు (11,86,496 మంది). తెలంగాణ వైశాల్యము 43,282 చ.మై.

తెలంగాణ ప్రాంతము దక్కను పీఠభూమిలో వ్యాపించియున్నది. సరాసరిని 1500 అ. ఎత్తు కలిగి తూర్పునకు వాలియున్న పీఠభూమి ప్రాంతము, పశ్చిమమున నున్న పర్వతములు తెలంగాణములోనికి చొచ్చుకొని వచ్చినవి. ఇవి 3000 అ. కంటే తక్కువ ఎత్తుగల చిన్న పంక్తులు. ఆదిలాబాదు జిల్లాలో సాత్మలా, నిర్మలా పంక్తులు, నిజామాబాదులో సిర్నపల్లి పంక్తులు, మహబూబునగరు జిల్లాలో షహబాదు, అమరాబాదు కొండలు, నల్లగొండ జిల్లాలో దేవరకొండ, భువనగిరి కొండలు కలవు. హైదరాబాదు జిల్లానుండి పాకాల కొండల వరకు, అక్కడినుండి ఆగ్నేయదిశగా ఖమ్మం జిల్లా మధ్యగా వ్యాపించిన గోలకొండ జలగ్రహ క్షేత్రము (Water shed) అని పిలువబడు ఎత్తైన ప్రదేశము గోదావరీ కృష్ణా జలములను వేరుచేయుచున్నది. దీని కుత్తరముననున్న భూతలము తూర్పు ఈశాన్యములకు వంగి యున్నది. దక్షిణమున నున్న భూతలము ఆగ్నేయముగా వంగియున్నది. తూర్పుననున్న గోదావరితీరము ఎత్తు 200 అ. కంటే తక్కువ. ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగరు, మెదకు జిల్లాలు గోదావరి పరీవాహక ప్రదేశములోను, మిగిలిన అయిదు జిల్లాలు కృష్ణా పరీవాహక ప్రదేశములో నున్నవి. మంజీర, మానేరు, కడం, పెనుగంగ, ప్రాణహితనదులు గోదావరికిని; దిండి, పెద్ద వాగు, మూసి, పాలేరు, మునేరు, వైరా నదులు కృష్ణకును ముఖ్యమయిన ఉపనదులు.

శీతోష్ణస్థితి : వర్షపాతము  : తెలంగాణప్రాంతము ఉత్తరార్ధగోళపు ఉష్ణమండలములో ఉండుటచే ఎక్కువ వేడిగా ఉండును. కాని ఈభూభాగము 1200 అడుగులు పైన ఎత్తుగా నుండుటచే దీని ఉష్ణోగ్రతలు కోస్తా ఆంధ్రప్రాంతముకంటె భిన్నముగా నుండును. తక్కిన ఆంధ్రదేశములో వలెనే ఇక్కడకూడ నాలుగు ఋతువులు కన్పట్టును. (1) మార్చినుండి మే నెలవరకు మిక్కిలి వేడిగా నుండు వేసవి, (2) జూను నుండి సెప్టెంబరు నెలవరకు వర్ష కాలము, (3) అక్టోబరు నవంబరు నెలలు శరదృతువు, (4) డిశంబరునుండి ఫిబ్రవరివరకు శీతకాలము,

మార్చి, ఏప్రిలు నెలలలో ఉష్ణము 100° ఫా.ప్రాంతమువరకు పెరుగును. ఏప్రిలు నెలలో, ఈశాన్యమున ముఖ్యముగా రామగుండమువద్ద, సరాసరి అధికోష్ణము 105° ఫా. ప్రాంతమున నుండును. అదేకాలములో హైద్రాబాదులో సరాసరి అల్పోష్ణోగ్రత 75° ఫా. మే నెలలో సూర్యుడు నెత్తిమీద నుండుటచే మిక్కిలి వేడిగా నుండును. ఈ నెలలో రామగుండమువద్ద సరాసరి అధికోష్ణము 111° ఫా. వరకు పెరుగును. ఖమ్మము మెట్టువద్ద వేడి 120° ఫా. వరకు కూడ ఉండును. వేసవిలో మొ త్తముమీద, దక్షిణ జిల్లాలలో 83° ఫా. ఉత్తర జిల్లాలలో 99° ఫా. కు తక్కువ ఎప్పుడును ఉండదు.

జూను నెలలో అన్ని జిల్లాలలోను ఉష్ణము తగ్గును. ఈ నెలలోనే ఋతుపవనములు ప్రారంభమగును, కాని వర్షములేక ఆకాశము నిర్మలముగానున్న రోజులలో ఉష్ణము, ఖమ్మము మెట్టువంటి పల్లపు ప్రాంతములలో 102° ఫా. వరకుకూడ ఉండును. జూలై, ఆగస్టు నెలలలో వేడి క్రమేపి తగ్గును. కాని సెప్టెంబరులో తిరిగి కొద్దిగా పెరుగును.

అక్టోబరు, నవంబరు నెలలు శరదృతువు. ఈ కాలములో ఆగ్నేయ ఋతుపవనములు వీచుట మానివేయును. అక్కడక్కడ కొద్దిగా వర్షములు పడును. ఉష్ణోగ్రత పశ్చిమప్రాంతములందు కంటే తూర్పు ప్రాంతములందు కొద్దిగా ఎక్కువగా నుండును,

డిశెంబరునుండి ఫిబ్రవరివరకు శీతకాలము. ఈ కాలములో తెలంగాణమంతయు చలిగాను, పొడిగాను ఉండును. డిశెంబరు ఆఖరిరోజులు మిక్కిలి చలిగానుండు