Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/592

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్రప్రదేశము - I


ఖనిజసంపద  : ఆంధ్రదేశములోని ఖనిజసంపద కొన్నిటిలో ఉత్తమముగా ఉన్నది. మాంగనీసు 3276 టన్నులు బంగారము 361 ఔన్సులు, క్రోమైట్ 500 టన్నులు, మైకా 11,670 హండ్రడుపై టులు; స్టీయప్ టైట్ 209 టన్నులు, లై మురాయి 3740 టన్నులు, రాయి 18,822 టన్నులు, ఆస్ బెస్టాస్ 1150 టన్నులు, బారైట్సు 1800 టన్నులు 1944 సం. లో ఉత్పత్తి అయినవి. ఖనిజాలలో మాంగనీసు, మైకా ఆంధ్రదేశములో ముఖ్యస్థానమును ఆక్రమించినవి. రాయలసీమలో ఖనిజములు ఎక్కువ. మాంగనీసు, విశాఖపట్నం, కర్నూలు, బళ్ళారి జిల్లాలలోను, మైకా నెల్లూరు జిల్లాలోను, బారైట్స్ కడపజిల్లాలోను ఉన్నవి. సమగ్ర పరిశోధనలు జరిగినయెడల ఆంధ్రదేశములోను, ఖనిజములు చాల ఉన్నవని తేలగలదు. ఇనుము ఇంకను దొరకవలసియున్నది.

పరిశ్రమలు  : ఆంధ్రదేశము పరిశ్రమల విషయములో వెనుకబడి ఉన్నది. తూర్పు ఆంధ్రములో కొన్ని పరిశ్రమ లకు ప్రారంభము జరిగినదిగాని, పశ్చిమాంధ్రములో పరిశ్రమలు ప్రారంభముకూడ కాలేదు. అయితే, విశాఖపట్నమువద్ద నౌకానిర్మాణశాఖ స్థాపింపబడుట గొప్ప విశేషము, మాచ్ ఖండ్ విద్యుచ్ఛక్తి నిర్మాణము పూర్తి అయిన తరువాత, దేశములో పరిశ్రమ అవకాశాలు లభింపగలవు. మద్రాసులో నుండిన ఆంధ్రుల పరిశ్రమలు కొన్ని పరిశిష్ట మద్రాసు రాష్ట్రమునకు చెందిపోయినవి. పెద్ద పరిశ్రమలలో బెజవాడలో సిమెంటు పరిశ్రమ, గూడూరులో మైకా పరిశ్రమ, గుంటూరులో పొగాకు పరిశ్రమ ఎన్నదగినవి. చిన్నపరిశ్రమలలో బియ్యపుమరలు ఇంజనీరింగ్ వర్కుషాపులు, డాల్డా ఫ్యాక్టరీలు, గూడూరులోని పింగాణీ పరిశ్రమ, బెజవాడలో రైల్వేపని, చెప్పదగినవి. ఇవిగాక కుటీర పరిశ్రమలని చెప్పదగినవి నరసాపురములో, కుట్టుపని, పెద్దాపురములో, పాలకొల్లులో పట్టుపరిశ్రమ; నెల్లూరు, గుంటూరు, గోదావరి, విశాఖ జిల్లాలలోని చేనేత పరిశ్రమ, నర్సారావు పేటలోని కుర్చీలపరిశ్రమ, విశాఖలోని చందనపు బొమ్మల పరిశ్రమ, కొండపల్లి బొమ్మలపరిశ్రమ, పెదవలసలోని వేముపనులు బెజవాడలో తోళ్ళపరిశ్రమ, పలకల పరిశ్రమ మొదలయినవి ఎన్నో ఉన్నవి.

రాకపోకల సౌకర్యాలు  : ప్రయాణసౌకర్యాల రీత్యా గూడ ఆంధ్రదేశము వెనుకబడియున్నది. రోడ్లు తక్కువ. రైలుమార్గాలు కూడ ఇప్పుడిప్పుడే ఆలోచింపబడుచున్నవి. ఆంధ్రదేశములో హుబ్లీ- మచిలీపట్నానికి మీటరు గేజి మార్గమును, మదరాసు - కలకత్తా, మదరాసు-ఢిల్లీ, మదరాసు.బొంబాయి మార్గాలు బ్రాడ్ గేజి లయిను ఆంధ్రదేశము గుండా వెళ్ళుచున్నవి. రోడ్లుకూడ ఇదే మార్గాలను అనుసరించి ఉన్నవి. ఇతర రాష్ట్రాలతో పోల్చిన యెడల, ఆంధ్రలో రైలుమార్గములు తక్కువ. కాలువలు, నదులు చెప్పదగినంతగా ప్రయాణాలకు ఉపకరించవు.

వర్తక వ్యాపారాలు  : అంతరంగికముగు వ్యాపారము ఎగుమతులు, దిగుమతులు ఆంధ్రదేశములో నలుమూలలకు వ్యాపించుట గాక, ఇతర రాష్ట్రాలతో కూడ వ్యాపారమున్నది. పప్పులు, ధాన్యము, బొగ్గు, వేరుసెనగ, నూనెగింజలు, మాంగనీసు, ఉప్పు, పంచదార రైల్వే రవాణా సౌకర్యాలమీద ఆధారపడి ఉన్నవి. ముడి ప్రత్తి, గుడ్డలు, దినుసులు మొదలైనవాటితో కూడ వ్యాపారము సాగింపబడుచున్నది. కొబ్బరి, కొయ్య సామాను, మందులు, కాగితము కూడ చెప్పదగిన వ్యాపారము కలవే. ఇవికాక బొంబాయి, మదరాసు రేవుల నుండి వచ్చు దిగుమతులకు ఆంధ్రదేశములో తగిన స్థాన మున్నది. 1939-40 లో 10 కోట్ల 40 లక్షల మణుగుల వ్యాపారము ఆంధ్ర జిల్లాల. ద్వార జరిగినదని అంచనా వేయబడినది.

రేవు పట్టణములు  : ఆంధ్రదేశమునకు తీర భూమి ఉండుటవల్ల రేవుల అభివృద్ధి ముఖ్యముగా జరుగవలసి యున్నది. 1946 లో ఆర్మ్ స్ట్రాంగు కమిటీవారి నివేదిక ననుసరించి విశాఖపట్నము యొక్క అభివృద్ధి జరిగినది. కాకినాడ, బందరు, కొత్తపట్టణము మొదలైన చిన్న రేవులు కూడ ముఖ్యమైన వ్యాపారము చేయుచున్నవి.

జనసంఖ్య  : ఆంధ్రదేశములో తూర్పు జిల్లాలలో జన సంఖ్య ఎక్కువగానున్నది. కాలువలున్న జిల్లాలలో 900 మొదలు 1200 వరకును చదరపు మైలుకు జనాభా ఒత్తిడి ఉన్నది. విజయవాడ, గుంటూరు, విశాఖపట్టణము, చీరాల, కాకినాడ, రాజమండ్రి, కర్నూలు ఆంధ్రదేశములో ముఖ్యమైన పట్టణములు.