Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/585

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్రదేశపు ఖనిజసంపద - II


ఆంధ్రదేశపు ఖనిజసంపద II : తెలంగాణము : కృష్ణా గోదావరీ తీరములు తప్ప తెలంగాణ మంతయు స్ఫటమయ విభాజీయ శిలలతో నిండియున్నది. గోదావరీ వర్ధానదుల పొడుగునను గోండ్వన శిలలు, వీటి ప్రక్కన, కృష్ణాతీరమున, కడప, కర్నూలు శిలలును కలవు. గోండ్వన శిలలనుండి బొగ్గు, ఇనుప గంధకిదము, కట్టడవురాళ్ళు. కొలిమిసుద్ధ- కర్నూలు శిలలనుండి సీమెంటుకు సున్నపురాళ్ళు, షాహాబాదు బండలు, కట్టడపురాళ్లు, తెల్లసుద్ద, పలక – స్ఫటమయ విభాజీయ శిలలనుండి కట్టడపురాళ్ళు, ఇనుపరాళ్ళు, పలుగురాయి, ఫెల్స్ఫార్, రాచిప్పరాయి, సర్పేన్ టీన్, క్రోమైట్, గ్రాఫైట్, అభ్రకము, మెరుగుడు ఖనిజములు, సీసము, రాగి - లేట రైట్లనుండి ఖనిజపు రంగులు లభించుచున్నవి. 1954 లో తెలంగాణమునందు ఉత్పత్తియైన ఖనిజముల విలువ సుమారు 3.34 కోట్ల రూపాయలు. దీనిలో బొగ్గు విలువయే రు. 3.16 కోట్లు. ఇచ్చటి ఖనిజసంపద దిగువన సూచింపబడినది.

బొగ్గు (Coal) : వర్ధ గోదావరీనదుల వెంబడి తెలంగాణములో 3,600 చదరపు మైళ్ళు వ్యాపించిన గోండ్వన శిలలయందు బొగ్గుపొర లనేక ప్రదేశములందు కనుగొనబడినవి. కాని ఈ రాళ్ళలో బొగ్గు ఎంతయున్నది సంపూర్ణముగ పరీక్షింపబడలేదు. ఖమ్మము మెట్టుజిల్లా పాలవంచ తాలూకాలో కొత్తగూడెం, ఇల్లిందలు తాలూకాలో సింగరేణి, ఆదిలాబాదు జిల్లా ఆసిఫాబాదు తాలూకాలో తాండూరు గనులనుండి బొగ్గు విరివిగా (14½ లక్షల టన్నులు) ఉత్పత్తి యగుచున్నది. ఈగనులయందు 15 వేలమంది కార్మికులు పనిచేయుచున్నారు. ఈ ప్రాంతమున సుమారు 100 కోట్ల టన్నులు బొగ్గు గలదని లెక్క వేసిరి. ఈ బొగ్గు ఉక్కు పరిశ్రమలో ప్రస్తుతము వాడబడు 'కొకింగ్' (coking) రకము కాదు. ఇది ముఖ్యముగ రైలు ఇంజన్లలోను, విద్యుత్ నీమెంటు, జాడీ, పింగాణీ, బట్టల పరిశ్రమలు మున్నగువాటిలోను దక్షిణ భారత దేశమునం దెల్ల వాడబడుచున్నది. హైదరాబాదు లోని కేంద్ర పరిశోధనాలయ కృషివలన, దీనినుండి పొగ లేకుండా ఎక్కువ వేడితోనుండు “కోలైసైట్(coalsite) తదితర పదార్థములు తయారగుచున్నవి. ఈ బొగ్గు యొక్క ఇతర ఉపయోగములుకూడ పరిశోధింపబడు చున్నవి.

సీమెంటుకు సున్నపురాళ్లు (Limestones for Cement) : సీమెంటు కుపయోగించు సున్నపురాళ్లు కర్నూలు శిలలలో విరివిగా కలవు. గుల్బర్గా జిల్లాలోని అసోసియేటెడ్ సీమెంటు కంపెనీల వారి షాహబాద్ సీమెంటు వర్క్సులో వాడు సున్నపురాళ్ళు హైదరాబాదు జిల్లా తాండూరు, వికారాబాద్ తాలూకాలనుండియు, మహబూబ్ నగరు జిల్లా కొడంగల్లు తాలూకా నుండియు కూడ లభించు చున్నవి. ఇట్టి రాళ్ళు మహబూబ్ నగరుజిల్లా అలంపూరు, కొల్హాపూరు తాలూకాలలోను, నల్లగొండజిల్లా మిరియాలగూడ, హుజూర్ నగరు తాలూకాల యందును, కరీంనగరు జిల్లాలో సుల్తానాబాదు తాలూకాయందును, ఆదిలాబాదు జిల్లాలో ఆదిలాబాదు, ఆసీఫాబాదు తాలూకాలయందును ఎక్కువగా నున్నవి.

కట్టడపురాళ్ళు (Building stones) : తెలంగాణములో విలువయైన కట్టడపురాళ్ళగు గ్రానైట్లకు కొరతలేదు. హైదరాబాదులోని లింగంపల్లి గనుల గ్రానైట్లతోనే బొంబాయి హార్బరును, ఉస్మానియా విశ్వవిద్యాలయ భవనములను నిర్మించిరి. కర్నూలు సంహతికిచెందిన చక్కని సున్నపురాళ్ళు, షాహబాదు బండలు (చపటలు) తీయు గనులు పైన పేర్కొనిన ప్రాంతములలో ననేక చోట్ల గలవు. కర్నూలు, గోండ్వన శిలలలో కట్టడములకు ఉపయు క్తమగు క్వార్ట్ జైట్లు, ఇసుక రాళ్ళు చాలయున్నవి. మేలువన్నెలుగల పాలరాళ్ళు ఖమ్మము మెట్టుజిల్లా మధిర, ఖమ్మము మెట్టు, ఇల్లిందల తాలూకాలలో స్ఫటమయ శిలలయం దచ్చటచ్చట లభ్యమగును. గ్రానైట్లలో గోడలవలె (Dykes) ఏర్పడిన నల్లటి స్ఫటమయ శిలలుకూడ వరంగల్లు కోటలోను, నల్ల గొండజిల్లాలో సూర్యాపేట సమీపమున నున్న పిల్లలమర్రిలోను చెక్కడములకు వాడబడినవి.

సున్నపుకంకర ముఖ్యముగ హైదరాబాదు జిల్లాలో తూర్పు పశ్చిమ తాలూకాలు, షహాబాదు, ఖమ్మము మెట్టు తాలూకా లలోను, ఇసుక, నదులనుండి, పెద్ద వాగులనుండి లభించుచున్నవి.

ఇనుపరాళ్ళు (Iron ore) : ధార్వాడ శిలలనుండి విడివడిన ఇనుప రాతిగుండ్లను (float ore) ఇనుము