Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/579

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్రదేశపు ఖనిజసంపద -1


జిల్లాలో చుండి, ఛత్రం, సైదాపురంవద్ద విభాజీయ శిలలలో కలవు. చుండి, ఛత్రము నిధులలో ప్రతి 10 అడుగులకు 2 వేల టన్నుల కయనైట్ దొరకునని లెక్క వేసిరి. సిల్లిమనైట్, ఖోండలైట్లలో నొక ముఖ్య ఖనిజము గనుక, వాటిలో దాని నిధులను కనుగొను అవకాశము కలదు. సిల్లిమనైట్ రేణువులు సముద్ర తీరపు ఇసుకలలో గూడ నున్నవి.

అణుశక్తిని జనింపజేయు ఖనిజమగు మోనజైట్. తెల్లరంగుచేయు ఇల్ మనైట్ 2300° సెం. వేడినిపట్టు జర్కాన్ రేణువులు కూడ శ్రీకాకుళం, విశాఖపట్టణము, గోదావరిజిల్లాల సముద్రతీరపు ఇసుకలలో అచ్చటచ్చట నున్నవి. మోనజైట్ విశాఖపట్టణము, భీమునిపట్టణము మధ్య ఇసుకలలో 3 నుంచి 8 పాళ్ళవరకు కలదు. వీటిని ఇసుకనుండి లాభకరముగ విడదీయ వీలగు పద్ధతులు పరిశోధింపబడుచున్నవి.

అల్యూమినము యొక్క ముడిపదార్థమగు బాక్సైట్ (Bauxite) నిధులు విశాఖపట్టణము, గోదావరి జిల్లాలలో ఖోండలైట్ కొండల పై భాగమున చదునుగనుండు ఇష్టి కాళిల (Laterites) లెచ్చటైనా కనబడు అవకాశమున్నది.

ఎరువుల కుపయోగపడు అపటైట్ (Apatite) అను ఫాస్ఫేట్ (Phosphate) శ్రీకాకుళం జిల్లాలో దేవాడ, గర్భం, రామభద్రపురం మున్నగుచోట్ల మాంగనీసు గనులనుండి లభ్యమగును. ఇది కోడూరైట్ రాళ్ళకు చెందిన ఖనిజము. సీతారామపురపు నిధిలో 30 అడుగుల లోతులోనే 5 వేల టన్నుల ఖనిజము కలదు. అపటైట్ నెల్లూరుజిల్లా పెగ్మటైట్లలో సూక్ష్మముగ నుండుటచే, అభ్రక గనులనుండి కొద్దిగ లభించును.

స్ఫటికములు (Quartz crystals) : అన్నిజిల్లాలలోను శిలలలో చొచ్చిన పలుగురాతి నాళములలో అచ్చటచ్చట దొరకును. శుద్ధమగు పెద్ద స్ఫటికములు రేడియో, టెలిఫోను పరికరములలోను, చిన్నవి ఆభరణములలో రాళ్ళు గను వినియోగపడును.

చవుడు (Saline Efflorescence) : కొన్ని స్థలములలో ఎక్కువ ఉప్పుగను (Sodium chloride), మరికొన్ని చోట్ల ఎక్కువ బట్టల సోడాగను పొంగుచుండును. చవిటి ఉప్పు (Earth salt) అనంతపురము జిల్లాలో అనంతపురము, పెనుకొండ తాలూకాలయందు, కడపజిల్లాలో జమ్మల మడుగు తాలూకాయందు, కర్నూలుజిల్లాలో ముఖ్యముగ కంభం, కోయిలకుంట్ల తాలూకాలయందు, గుంటూరుజిల్లాలో నరసారావుపేట, వినుకొండ, సత్తెనపల్లి తాలూకాలయందు అచ్చటచ్చట పొంగుచున్నది. దీనిని మాడలలో కరిగించి, వడబోసి, కయ్య (మళ్ళ)లలో నెండనిచ్చి, శుభ్రపరచుదురు. ఈ ప్రాంతాలలో ఏటా ఎంత ఉప్పు లభించునది తెలిసికొనుట అవసరము.

గంధకము (Sulphur) :- ఇది కృష్ణాజిల్లాలో కోనవద్ద కొద్దిగ లభించును. ఇక్కడ 30 ఎకరాల మేర వర్షాకాలములో సముద్రపు నీటితో నిండు పల్లపుభూములలోని ఒండ్రులో, సూక్ష్మజీవులచే నేర్పడు గంధక కణములు 2 అడుగుల లోతువరకు కలవు. గంధక మేర్పడు పరిస్థితులు ఇతరచోట్ల కలుగ జేయగలిగినచో గంధకోత్పత్తి అధికమగును.

మిక్కిలి వేడిని, విద్యుత్తును నిరోధించు మాగ్నెసైట్(Magnesite) ను, కొలుములకు లోవైపు పేర్చు నిటుకలకు, విద్యు న్నిరోధక వస్తువులకు, సీమెంట్లలోను వాడుదురు. ఇది కర్నూలుజిల్లాలో ముద్దవరము, ముసలయ్య చెరువువద్ద రాచిప్ప రాతితో కూడి, వేంపల్లి సున్నపు రాళ్ళలో నాళములుగ దొరకును. కాని ఇది సున్నపు రాళ్ళతో నెక్కువగ కలిసిపోయి, లాభకరముగా విడదీయ వీలుకాకున్నది.

బెరిల్ (Beryl) :- ఇది శ్రీకాకుళం జిల్లాలో జీరికి వలసవద్ద ఒక పెగ్మటైట్ లో కనుగొనబడినది. ఇక్కడ సుమారు 10 టన్నుల బెరిల్ దొరకగలదు. బెరిల్ నుంచి తీయు అతి విలువైన బెరిల్లియం (Beryllium) లోహము అల్యూమినయము కన్న చాల తేలికై, మిక్కిలి వేడి పట్టు శక్తి, దృఢత్వము గలిగి శిథిలము కానందున, దీనిని లోహ మిశ్రమములు, విద్యుత్పింగాణి మున్నగువాటిలో నుపయోగింతురు.

ఈ ఖనిజసంపదను బట్టి, ఆంధ్రలో సీమెంట్లు, రంగులు,డిస్టెంపర్లు. 'మైకనైట్, గ్లాసు, జాడీ, పింగాణి, విద్యున్నిరోధక పరికరములు, బేరియం, కాల్షియం, సోడియం రసాయనములు, మెరుగు సామానులు తప్పక