Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/550

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్రదేశ చరిత్రము- IV


నకు మరలివచ్చి హైదరాబాదు సుబేదారీని స్వతంత్ర రాజ్యముగ పరిపాలింపసాగెను. ఇతడు మహారాష్ట్రులకు చౌతు, సర్దేశము పన్నులు చెల్లించి వారి స్నేహముతో బలవంతుడయ్యెను. చక్రవర్తి ఇతనిని ఏమనలేకపోయెను.క్రీ. శ. 1739 లో పారశీక దళవరియైన నాదిర్షా, ఢిల్లీని కొల్లగొనగా, చక్రవర్తి మరింత దుర్బలుడై పోయెను. నిజాము, పేరునకు చక్రవర్తి యొక్క సుబేదారుడుగ నుండెనేకాని నిజమునకు స్వతంత్ర ప్రభు వయ్యెను.

గోలకొండ రాష్ట్రమున ఆర్కాటు, కర్నూలు, రాజమహేంద్రవరము, శ్రీకాకుళము నవాబులకు చెందిన నాలుగు రాజ్యభాగములుండెను. నిజాము రాజమహేంద్రవరము, శ్రీకాకుళము (చికాకోలు) పరగణాలకు అన్వరుద్దీను అను నతని నవాబుగ జేసెను. అతనిక్రింద రుస్తుంఖాను డను జిల్లాదారుడు క్రీ. శ. 1732 మొదలు ఏడు సింవత్సరములు రాజమహేంద్రవరమును, దానికి దక్షిణమనగల నాలుగు జిల్లాలను నిరంకుశముగ పాలించెను. ప్రజలను పీడించియు, భూమి శిస్తులను, మోతర్ఫాను వసూలు చేసి సర్కారుకు క్రమముగా చెల్లించని జమీందారులను పట్టి వధించియు, వారి పుట్టెలను సున్నపు రాళ్ళ స్తంభములలో పొదిగియు అతడు లోక భీకరుడ య్యెను.ఇట్టి స్తంభములను "కుల్లా మినారు" అనిరి. అట్టివాటిని ఏలూరులోను ఇతర ముఖ్య పట్టణము లందును అతడు కట్టించినాడు. అతనినిచూచి జమీందారులు గడగడలాడిరి.

నిజాముఉల్ ముల్కు ఆసఫ్ జా క్రీ. శ. 1748 జూను 1 వ తేదీన చనిపోయెను. అప్పు డతని పెద్దకుమారుడు ఢిల్లీలో నుండెను. రెండవకుమారు డయిన నాజరుజంగు తనను దక్కను సుబేదారునిగా ప్రకటించుకొని, పోటీగ నిలుచున్న మేనల్లుడు ముజఫరు జంగును ఆర్కాటులో ఖైదుచేసి యుంచెను. అంతట నిజాము సింహాసనమును గూర్చిన తగవులు బయలుదేరెను.

ఆ సమయమున ఈ దేశములో వర్తకము చేసికొనుటకు వచ్చిన పాశ్చాత్యులలో ఫ్రెంచి కంపెనీవారికి మచిలీబందరులో నొక వర్తకస్థాన ముండెను. ఇది పుదుచ్చేరిలోని ఫ్రెంచికంపెనీవారి గవర్నరుజనరలుకు లోబడిన వర్తకస్థానము. అప్పుడు ఫ్రెంచి గవర్నరు జనరలుగా నుండిన డూప్లె మిక్కిలి తెలివిగలవాడు. దక్షిణభారతదేశము నందలి రాజులు, నవాబులు, ఒండొరులతో పోరాడుకొనుచుండుటయు, వారి సైన్యములు సుక్షితములైనవి కాక అల్లరి మూకలుగనుండి సుక్షితము లయిన పాశ్చాత్య సైనికుల తుపాకి దెబ్బలకు నిలువలేనివై యుండుటయు గ్రహించిన డూ ప్లేకు వీటి నుపయోగించు నవాబుల వలనను, రాజుల వలనను రాజ్యలాభమును పొందవచ్చునని తోచెను. అతడు రాజ్యతంత్రము ప్రయోగించి చరిత్ర ప్రసిద్ధుడైనాడు.

దక్కను సువేదారికొరకు ఆసఫ్ జా రెండవ కుమారుడగు నాజరుజంగు, ఆసఫ్ జా దౌహిత్రుడయిన ముజఫరు జంగు తగవు లాడసాగిరి. నాజరుజంగు ఇంగ్లీషువారి సహాయమును పొంది ముజఫరుజంగును కారాగారమున బంధించెను. నాజరుజంగు చంపబడెను. అంత ముజఫరు జంగు ఫ్రెంచివారి సాయముతో విముక్తి చెంది సుబేదారు డయ్యెను. తనను చెరలోనుంచిన నాజరుజంగును ప్రతిఘటించి తనకు చేసిన ఉపకారమునకు ప్రతిఫలముగా ముజఫరుజంగు ఫ్రెంచివారికి మచిలీపట్టణమును, దివి సీమలను అర్పించి, వారి నాణెములు తన రాజ్యమున చెలామణి యగునట్లు శాసించి. కృష్ణానదికి దక్షిణమునగల రాజ్యమునకు డూప్లే గారిని గవర్నరునుగా నియమించెను. ముజఫరుజంగు అనంతరము ఫ్రెంచివారి సహాయముతో నిజాముల్ ముల్కు మూడవకుమారు డయిన సలాబత్ జంగు దక్కను సుబేదారు డయ్యెను. ఇతడును ఫ్రెంచి వారిపట్ల కృతజ్ఞుడై క్రీ. శ. 1752 లో మచిలీపట్టణ సర్కారున కంటియున్న కొండవీడు రాష్ట్రమును వారి కిచ్చెను. ఇట్లు కృష్ణానదికి రెండువైపులగల దేశమును, మచిలీబందరు, నిజాము పట్టణము, మోటుపల్లి రేవులును ఫ్రెంచివారి వశములైయుండెను. నిజాము దర్బారులో ఆయన దివానుకు కల గౌరవముకన్న ఫ్రెంచి సేనాధిపతియైన బుస్సీ దొరగారికే హెచ్చు గౌరవము జరుగసాగెను. ఫ్రెంచివారి సైన్యములను పోషించుటకై సలబతుజంగు వారికి కొండపల్లి, ఏలూరు, రాజమహేంద్రవరము, శ్రీకాకుళము పరగణాలను ఇచ్చెను. ఇట్లు ఫ్రెంచి వారికి సముద్రతీరమున గల 600 మైళ్ళ దేశమంతయు చేజిక్కెను. అప్పటికి భారతదేశమున వ్యాపారము చేయవచ్చిన ఏ పాశ్చాత్యులకును ఇంతరాజ్యము లేకుండెను.