Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/544

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్రదేశ చరిత్రము . III


గెలిచెను. అతడు కొండవీటి తురుష్క ప్రతినిధియగు అఫ్జల్ ఖానును ఓడించెను. గోల్కొండ యుద్ధములలో వెలుగోటి చెన్నా నాయడు విజయనగర రాధీశులకు జయమును సంపాదించెను. చెన్నానాయడు, యాచమ నాయడు నంజర్ భానును తరిమి గండికోటనుపట్టుకొనిరి. 20 వ తరమువారు వేంకటపతి నాయడు, యాచమ నాయడు. వీరిలో యాచమనాయడు, శ్రీరంగరాయలు II తరఫున వేలూరిలో 1616 లో శ్రీరంగరాయల పుత్రుడు రామదేవరాయల పట్టాభిషేకమును నడిపించెను.

21, 24 తరముల వారైన కుమార యాచమనాయడు, సింగమనాయడు, శ్రీరంగరాయలు III సామంతులు, వీరు అతని యుద్ధములలో పాల్గొనిరి. 1643 లో గోల్కొండ నవాబు దండెత్తినపుడు వేముగల్లు సమీపమున జరిగిన యుద్ధములలో సింగమనాయడు తురకలను చెండాడెను. 1659 లో పెనుగొండను పట్టుకొనుటకైశ్రీరంగరాయలు ప్రయత్నము చేసినపుడు కుమార యాచమనాయడు గోల్కొండ సేనలో నుండెను. అతడు పెనుగొండకు పోయి శత్రుసంహారము చేసెను.