ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ఆంధ్రదేశ చరిత్రము - III
వెలమ రాజ్యము : ప్రస్తుతపు వేంకటగిరి రాజుల పూర్వు లయిన వెలమరాజులు రేచర్ల వంశ్యులు. ఆ వంశమునకు మూలపురుషుడు చెవ్వి రెడ్డి. నిక్షేపమొకటి దొరకుటవలన ఇతడు ధనికుడయ్యెనని వాడుక కలదు. వెలమరాజులు కాకతీయ సామంతులుగ నుండి, తదనంతరము కాపయనాయకుని కాలములో నల్లగొండ ప్రాంతములో స్వతంత్రులైరి. అశ్వపతి, నరపతి, గజపతుల తాకిడికి నిల్వలేక వారు కర్ణాటకమునకు వచ్చి రాయల సామంతులైరి.
వెలమ రాజులలో ఐదవతరమునకు చెందినవారు సింగమనాయడు I, వెన్నమనాయడు, ఏచమనాయడు అను మువ్వురు. 14వ శతాబ్ది రెండవపాదములో ఏచమనాయడు కొలచెలమ యుద్ధములో తురకల నోడించెనట సింగమనాయడు తక్కిన ఇర్వురితో కలిసి రాచకొండ రాజ్య మేర్పర్చుకొనెను. సింగమనాయడు కాపయనాయకుని నోడించెనట ! తర్వాత జల్లిపల్లి దుర్గము ముట్టడించి క్రీ. శ, 1360 లో శత్రువుల చేతులలో మృతుడయ్యెను.