Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/542

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్రదేశ చరిత్రము - III


అనపోతనాయడు, I, మాదానాయడు I (క్రీ.శ. 1360-84)—వీరు ఆరవతరమువారు; వీరు సింగమనాయని పుత్రులు. వీరు -మొగులూరు, ఇనుకుర్తి, జల్లిపల్లి, యుద్ధములలో (క్రీ. శ. 1361) తమ తండ్రిని చంపిన క్షత్రియరాజులను వధించి వారి రక్తముతో తండ్రికి తర్పణములు విడిచిరట ! కాపయనాయకుడు వీరి నణచుటకు ప్రయత్నించి 1369 ప్రాంతమున భీమవరమునొద్ద వెలమరాజులచే జయింపబడెను. తర్వాత అనపోత నాయడు,ఓరుగల్లు, భువనగిరులతో సహ కాపయ రాజ్యమును తన రాజ్యముతో కలుపుకొని ఆంధ్ర సురత్రాణ, అనుమన గంటి పురవరాధీశ్వర అను కాపయ బిరుదములను ధరించి స్వతంత్రుడయ్యెను. అతడు కొండవీటి రాజ్యములోని ధరణికోటపై దండెత్తి ఓడిపోయెను. ఈ అదను చూచుకొని మహమ్మదుషా I బహమని తెలంగాణముపై దండెత్తెను. కాని అనపోతనాయనిచే తరుమబడెను. మరి యొకమారు ముస్లిము సైన్యములు దండెత్తి రాగా అనపోతనాయడు గోలకొండనిచ్చి సంధిచేసికొనెను.

అనపోతనాయడు, మాదానాయడు తాము దిట్టపరచిన రాజ్యమును రెండు భాగములుగ విభజించి రాచకొండ రాజధానిగ ఉత్తరభాగమును అనపోతనాయడును, దేవరకొండ రాజధానిగ దక్షిణభాగమును మాదానాయడును పంచుకొనిరి. ఇతర రాజ్యసంబంధ విషయములలో రెండు రాజ్యములు ఐకమత్యము కలిగియుండెను.

ఏడవతరము వారు సింగమనాయడు II, వేదగిరి నాయడు I తెలుగు చోడ అన్నమదేవుని పక్షమున వీరు అనవేమా రెడ్డితో పోరు సల్పిరి. కాని వీరు జయించిరని చెప్పజాలము. క్రీ. శ. 1386 లో కాటయ వేమారెడ్డి వెలమ రాజ్యములోని రామగిరిని గెల్చెను. అంత సింగమనాయడు. రెడ్డిరాజ్యముపై దండెత్తెను (1387).1390 లో వెలమలకు కుమారగిరి రెడ్డికి సంధి పొసగెను, ఇదే సమయమున గజపతి వెలమరాజ్యముపై దండెత్తి ఓడి, కూతును సింగమనాయని కిచ్చి పెండ్లి చేసెనట. కుమారగిరి మరణానంతరము అన్న దేవచోడుడు దేవరకొండ కేగి వేదగిరినాయని సాయముతో రాజమహేంద్ర వరమునకు బయలు దేరెను. త్రోవలో వేములకొండకడ ఐదుగురు రాజులను ఓడించెను. రెడ్లనుండి బెండపూడి గెల్చెను. అన్నదేవుని సింహాసనముపై నిల్పి, తన మంత్రి మాదానేనిని అతనికి రక్షకునిగా రాజమహేంద్రవరములో నిల్పెను.

వెలమరాజులకును బహమనీ సుల్తానులకునుగల సుహృద్భావము చెడగొట్టుటకై విజయనగర హరిహర రాయలు II 1384 లో తెలంగాణము పై దండెత్తి ఓరుగల్లును సమీపించెను. అతనిని కొత్తకొండకడ ముస్లిము సైన్యములు అడ్డగించెను. విజయనగర సైన్యములు తిరుగుబాట పట్టెను. మరల 1397 లో హరిహరరాయలు II సైన్యములను పంపెను. యువరాజు బుక్క రాయలు సుల్తానును, ఆంధ్రరాజులను ఓడించెను.

వెలమ వంశమునందు ఎనిమిదవ తరమువారు- అనపోత నాయడు II, రామచంద్ర, మాదానాయడు II. రెడ్లకును తెలుగుచోడులకును జరిగిన యుద్ధములలో అన్న దేవుని పక్షమున ముస్లిము సైన్యములతోపాటు వెలమనాయకులు పోరి విజయములను గొనిరి. గుండుగొలను యుద్ధములో గజరావు తిప్ప కాటయవేముని చంపెను. కాటయ వేమునికిగల 'తలగొండుగండ' అను బిరుదము వహించెను. విజయనగర సైన్యములు ఓడిపోయెను. కాని, సుల్తాను, అన్న దేవచోడుడు, నదిని దాటి రాజమహేంద్రవరము చేరలేక పోయిరి. రెడ్ల సేనాధిపతి దొడ్డయ అల్లాడ రెడ్డి విజయనగర సాయముతో శత్రుసైన్యములను చెండాడెను (1417). రెడ్లకు సాయము నరికట్టుటకై సుల్తాను పానుగల్లును, నల్లగొండను, పట్టుకొనేను, రెడ్ల హస్తములలో అన్న దేవుడు హతుడయ్యెను. బహమనీ సుల్తాను వెలమలు కలిసి విజయనగర సైన్యములను బాధించిరి. కాని తూర్పుతీర నాయకత్వ మాశించి బహమనీ సుల్తాను. కొండవీటి పెదకోమటి వేమారెడ్డితో స్నేహము చేసికొనెను. ఇది సహింపక వెలమలు ధరణికోటపై దండెత్తి గెల్చిరి. పెదకోమటి వేముడు వెలమలపై దండెత్తి రామచంద్రనాయని, మాదానాయని, వేదగిరినాయని చంపెను.

అనపోతనాయడు II, దేవరాయలు I తో మైత్రి చేసికొనెను, అంత దేవరాయలు పానుగల్లు, నల్లగొండలపై దండెత్తి తురకల నోడించెను. అనపోతనాయడు తెలంగాణములోని బహమనీ రాజ్యపు స్థలములను పట్టు