Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/539

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్రదేశ చరిత్రము . III


మలరాయల కోరికపై బీజపూరు సుల్తాను పెనుగొండను ముట్టడించెను. తిరుమలరాయల ఆస్థిపై అహమదునగరు నిజాముషాహ బీజపూరుపై దండెత్తగా, బీజపూరు సుల్తాను వెనుదిరిగెను. (క్రీ.శ.1567). మువ్వురు సుల్తానులు కలిసి ఆదవానిని గెలిచిరి. తిరుమల రాయలు తన పుత్రులలో ఒకడగు శ్రీరంగరాయలను తెలుగుదేశముపై పెనుగొండలోను, రామరాయలను కన్నడదేశముపై శ్రీరంగపట్టణమందును, వేంకటపతి రాయలను తమిళదేశముపై చంద్రగిరి యందును రాజప్రతినిధులుగ నిలిపెను. తాను క్రీ. శ. 1570 లో పట్టాభిషేకము చేసికొనెను. రెండేండ్ల తదుపరి కుమారుడు శ్రీరంగరాయలు (కీ. శ. 1572-1585) రాజయ్యెను. క్రీ.శ. 1585 లో అతడు మరణింపగా, వేంకటరాయలు II (క్రీ. శ. 1586-1614) రాజపదవినందెను.

వేంకటరాయలు 28 సంవత్సరములు సమర్థతతో పరిపాలించెను. తురకల నదల్చి రాజ్యములోని తిరుగుబాటుల నణచి గోలకొండ నవాబుతో యుద్ధము చేసి జయించెను. ఉదయగిరిని గెలిచెను. ఇతని కాలమున డచ్చివారు, పోర్చుగీసువారు తూర్పు తీరమున ఫాక్టరీలను కట్టిరి. డచ్చివారి ఫ్యాక్టరీలు మచిలీపట్టణము (క్రీ.శ. 1605), నిజాముపట్టణము, చెన్న పట్టణము (క్రీ.శ. 1608) పులికాటు అను తావులలో నుండెను. ఇంగ్లీషువారి ఫ్యాక్టరీలు మచిలీ పట్టణము, నిజాం పట్టణము (క్రీ. శ 1612) పులికాటు (క్రీ. శ. 1621). మద్రాసు (క్రీ.శ.1640) అను తావులలోను ఏర్పడెను. క్రీ. శ. 1614 లో వేంకటరాయలు మృతిచెందగా, అతని అన్న కుమారుడు శ్రీరంగరాయలు II రాజయ్యెను.

శ్రీరంగరాయలు II అవివేకి. సామంతులు ఇరుపక్షములుగ సిద్దమయిరి. ఎదురు పక్షమువారు వేంకటరాయల కృత్రిమ సంతానమయిన కుమారుని బలపరచిరి. ఈ పక్ష నాయకుడు గొబ్బూరి జగ్గరాయలు; రాజపక్ష నాయకుడు యాచమ నాయడు. జగ్గరాయలు రాజును కారాగారమందుంచి వేంకటరాయల కృత్రిమ కుమారుని రాజుచేసెను. యాచమనాయడు జగ్గరాయని గెలిచి శ్రీరంగరాయల పుత్రుడయిన రామరాయలను (క్రీ.శ. 1618-1630) గద్దెపై నిలిపెను. తోపూరు (తిరుచునాపల్లి జిల్లా) యుద్ధములో (క్రీ.శ. 1616) జగ్గరాయలు ఓడిపోయెను, రామరాయలు గెలిచెను.

రామరాయల రాజ్యకాలమంతయు (క్రీ.శ.1618-1630) యుద్ధములతో గడచెను. క్రీ.శ. 1630 లో ఈ రాజు మరణించెను. తరువాత వెంకటరాయలు III (క్రీ. శ. 1630 - 1642) రాజపదవినం దెను. రామరాయల పినతండ్రి తిమ్మరాయలు వెంకటరాయలను బాధించెను. తిమ్మరాయలు క్రీ. శ. 1635 లో హత్యగావింపబడెను. వేంకటరాయల పక్షము వాడయ్యు శ్రీరంగరాయలు III ఏలొకోబీజపూరుసుల్తాను క్రీ.శ. 1638, 1641లలో దండెత్తి వచ్చునట్లు చేసెను. మొదటితూరి తురకల నోడించుటకు దక్షిణ దేళపు సామంత ప్రభువులు తోడ్పడిరి. రెండవసారి రండోలాఖాను దండయాత్ర చేసి నెల్లూరును సమీపించెను. గోలకొండనవాబు తూర్పుతీరముపై దండెత్తెను. వేంకటరాయలు III నారాయణవనం (చిత్తూరుజిల్లా) అడవులకు పారిపోయి క్రీ. శ. 1642 లో దివంగతు డయ్యెను.

వేంకటరాయల తమ్ముని కుమారుడు శ్రీరంగరాయలు III (క్రీ. శ. 1642-49-75) రాజ్యభారము వహించెను. ఇతడు తాను పన్నిన కుట్రలకు తానే గురి యయ్యెను. బీజపూరు, గోలకొండ సుల్తానులు పరస్పరము సంధిచేసికొనిరి. దక్షిణమున సామంతుల తిరుగుబాటు, వారి ప్రోద్బలముపై బీజపూరు, గోలకొండ నవాబుల దండయాత్రలు, ఒక్క పెట్టున విజృంభించెను. మొగలు చక్రవర్తి కర్ణాటక రాజ్యమును గెలిచి పంచుకొనుటకు గోలకొండ, బీజపూరుల కానతిచ్చెను. క్రీ. శ. 1645 లో దక్షిణమునందలి సామంతులకోడి శ్రీరంగరాయలు వేలూరు చేరెను. అచట మరు సంవత్సరము యుద్ధములో బీజపూరు సేనలచే నోడింపబడెను. శ్రీరంగరాయలు తంజావూరు, తరువాత మైసూరు చేరుకొనెను. క్రీ. శ. 1652 లో బీజపూరును కర్ణాటకమును అతడు గెలిచెను. అతడు మైసూరులో కొలువు దీర్చుచు వేలూరును జయింప కలలు గాంచుచుండెను. కట్టకడపట క్రీ.శ. 1675 లో. శ్రీరంగరాయలు III స్వర్గస్థుడయ్యెను. మూడు శతాబ్దములు హైందవ సంస్కృతిని సంరక్షించిన విద్యా (విజయ) నగర సామ్రాజ్యము ఈ విధముగా అంతరించెను.