Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/538

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తులు ప్రబలు లగుట చేతను తిరుగుబాటులు జరిగెను. తిరుగుబాటుల నణచుటకై రామరాయలు దక్షిణమునకు వెళ్ళగనే అచ్యుతరాయలు స్వతంత్రించెను. రామరాయలు తిరిగి వచ్చుసరికి ఇబ్రహీము ఆదిల్ ఖాను రాజధానిని ' ముట్టడించియుండెను. ఈ సుల్తాను రామరాయలకు,అచ్యుతరాయలకు సంధి కుదిర్చెను. సంధి ననుసరించి అచ్యుతరాయలు రాజుగను, రామరాయలు రాజ్యరక్షకుడుగను ఉండుటకు అంగీకరింపబడెను. అచ్యుత రాయల మరణమువరకు ఈ షరతులు అమలులో నుండెను.

అచ్యుత రాయల తరువాత కొడుకు వేంకటరాయలు I (క్రీ. శ. 1542) రాజయ్యెను. రామరాయలు సదాశివరాయలను ఖైదునుండి విడిపించెను. బీజాపూరుసుల్తాను సాయ మాశించెను. తిరుమలరాయలు ప్రజలచే రాజుగ ప్రకటింపబడి బీజాపూరు ఆదిల్ షాను ఓడించి వేంకటరాయలు I, అతని వంశ్యులను చంపించెను. రామరాయలు తిరుమలరాయలను ఓడించి చంపి, క్రీ.శ.1543 లో సదాశివరాయలను రాజుగ ప్రకటించెను. సదాశివరాయలు (క్రీ. శ.1543-76) రాజ్యము చేయుచుండగా, రామరాయలు క్రీ. శ. 1550 ప్రాంతమున తానే రాజ బిరుదమును వహించెను. రామరాయలు రాజ్యాంగమున అతి ముఖ్యమైన కార్యములకు తురుషులను నియోగించెను. పంచ ముస్లిము రాజ్యముల అంతర్గత విషయములలో తాను సంబంధము కల్పించుకొనుచుండెను. రామరాయల అట్టి నడవడికయే కడకు విజయనగర సామ్రాజ్యమునకు మొప్పము తెచ్చెను. రక్షసి - తంగిడి (తళ్ళికోట) యుద్ధమునకు కీలకమయ్యెను. దక్షిణమున దేవాలయములను పాడుచేసి చర్చీలుగా మార్చి, ప్రజలను క్రైస్తవమతమునకు మార్చుచున్న పోర్చుగీసు వారి దుండగముల నాపుటకై రామరాయలు చినతిమ్మరాయలను, విఠల రాయలను పంపెను. క్రీ. శ. 1547 లో పోర్చుగీసు వారితో సంధిచేసికొనెను. క్రీ. శ. 1558 లో శాంథోమ్, గోవాలపై దండెత్తి కప్పము గొనెను. క్రీ.శ. 1560 లో అహమ్మదు నగరు సుల్తాను బీజపూరుపై దండెత్తగా రామరాయలు బీజపూరు సుల్తానుకు తోడ్పడి జయమును గాంచెను. అంతియ కాక బీదరునుకూడ గెలిచెను. మరల బీజపూరు సుల్తాను రామరాయలు కలిసి, అహమ్మద్ నగర్, గోల్కొండలతో పోరు సల్పిరి. క్రీ.శ. 1563లో జరిగిన సంధివలన గోల్కొండ సుల్తాను, పానుగల్లును కోవిల కొండను, వదలుకొనెను. కాని అతనికి రామరాయలపై కసి పెరిగేను,

సుల్తాను లొండొరులమధ్య రామరాయలు, ఎంత భేధ తంత్రమును ప్రయోగించినను, ఐదుగురు సుల్తానులు తమతమ వైషమ్యములను అడ్డుకొని, సంధులు చేసికొని. విజయనగరముపై యుద్దమున కాయత్తము కాదొడగిరి. క్రీ.శ. 1564 లో ఐక్య ముస్లిము సైన్యములు బీజపూరు నుండి యుద్ధమునకు బయలుదేరెను. రామరాయలు తనకు జయము నిశ్చయ మను అతి ధైర్యమున నుండెను. శత్రుసైన్యములు తల్లికోట యొద్ద విడిసెను. హైందవ సైన్యములు అచటికి 30 మైళ్ళదూరమున నున్న రక్షసి. తంగడి యను గ్రామముల సమీపమున జేరెను. వీరి బలము 5 లక్షలు, ముస్లిముల సైన్యము 24 లక్షలు, కపటోపాయమున తురుష్క సైన్యములు హైందవ సైన్యములపై బడెను. ఐనను రామరాయలు సైన్యములను నేర్పుగ నడిపించెను. రామరాయలు విజేతయగునట్లే తోచెను. కాని విధిప్రాబల్యముచే రామరాయల సైన్యములోని ఇరువురు ముస్లిము సేనానులు తమ 70,000, 80,000 సైన్యముతో విడిపోయి శత్రుపక్షమున జేరిరి. రామరాయలకు ఓటమి తప్పలేదు. అంతియ కాక రామరాయలు శత్రువుల చేజిక్కి చంపబడెను.

అపజయవా ర్త విజయనగరము చేరగనే రామరాయల తమ్ముడు తిరుమలరాయలు 1550 ఏనుగులమీద విలువగల వస్తువులను, ఖైదీ చక్రవర్తి సదాశివరాయలనురాణివాసమును తీసికొని పెనుగొండకు పలాయన మయ్యెను. తురకలు రాజధానియందు ప్రవేశించి విచ్చలవిడిగ చరించి, నాశనముచేసి కొల్ల గొట్టిరి. సకలసంపదలతో తులదూగుచున్న విజయనగర మహాపట్టణము అకస్మాత్తుగ నేలమట్టము గావింపబడెను.

IV. ఆరవీటి వంశము  : ఆరవీటివంశమునకు నరపతి వంశమనియు "పేరు గలదు. ఆరేండ్ల అరాజకము పిమ్మట పెనుగొండలో నున్న తిరుమలరాయలు (క్రీ. శ. 1570-1571) రాజయ్యెను. మధుర, తంజావూరు. జింజీ ప్రభువులు స్వతంత్రులైరి. రామరాయల పుత్రుడు పెద తిరు