ఆంధ్రదేశ చరిత్రము - III
ముస్లిం దండయాత్రలకు తరచుగ గురియగుచుండెను. ఆంధ్రభూమినంతయు దాదాపు ఏకచ్ఛత్రాధిపత్యముగ నేలిన
కాకతీయ సామ్రాజ్యము తురుష్క జైత్రయాత్రా దావానలమున కాహుతి యయ్యెను. క్రీ.శ.1323 తరువాత దేశమున శాంతి భద్రతలు కొరతపడెను.
తురుష్కుల బారినుండి హైందవ ధర్మమును రక్షించుటకై ఆంధ్రావనిలో అచట నచట ప్రయత్నములు సాగుచుండెను. తత్ఫలితముగ క్రీ. శ. 1331 తూర్పుతీరమంతయు తురకల పాలనమునుండి విడివడి స్వతంత్రమయ్యెను. పశ్చిమ భాగమున చాళుక్య సోమదేవుడును, మూడవ బల్లాలదేవుడును ఢిల్లీ ముస్లిం బానిసత్వమును తొలగద్రోసి, కంపిలి ముస్లిం రాజప్రతినిధి పై తిరుగబడి యోడించిరి. ఈ కార్యమున వీరికి హరిహర రాయలు, బుక్కరాయలు సహాయపడిరి. తుంగభద్రానదీ దక్షిణ తటమున విజయనగర సామ్రాజ్యము (క్రీ.శ. 1336) ను, పూర్వపు కాకతీయ రాజ్యభాగమున వెలమ రాజ్యమును, కృష్ణా గోదావరీ పరిసరములందు రెడ్డి రాజ్యమును (క్రీ. శ. 1330) నెలకొనెను. కళింగాంధ్ర మున తూర్పు గాంగులును, కోరుకొండలో రెడ్లును, పిఠాపురమున కొప్పుల నాయకులును, ఓరుగల్లు పరిసరములందు ప్రోలయ, కాపయనాయకులును, పరిపాలించుచుండిరి. హిందూరాజ్యము లన్నిటికి ప్రక్కలోని బల్లెమువలె బహమని రాజ్యము (క్రీ.శ. 1347) విజయనగర రాజ్యమునకు ఉత్తరమున స్థాపితమయ్యెను. దీనికి రాజధాని గుల్బర్గా నగరము.
విజయనగర సామ్రాజ్యము, క్రీ.శ. (1336-1675) :- I. సంగమ వంశము క్రీ. శ. 1336-1486) : దక్షిణభారత దేశము నంతయు ఏకచ్ఛత్రము క్రిందికి తెచ్చినవారు విజయనగర సామ్రాజ్య స్థాపకులగు హరిహరరాయలు, కంప రాయలు, బుక్కరాయలు, మారప, ముద్దప అను పంచ సహోదరులు. వీరిలో హరిహరరాయలు, బుక్క రాయలు కాకతీయులకును, కంపిలి రాజునకును సేవకులై యుండిరి. వీరు క్రీ. శ. 1327 లో ఢిల్లీకి బందీలుగా గొంపోబడిరి. మరల కంపిలి రాజప్రతినిధియగు మాలిక్ మహమ్మదు అనువానికి సహాయులుగ వీరు ఢిల్లీ సుల్తానుచే దక్షిణము నకు పంపబడిరి. అప్పుడు విద్యారణ్యస్వామి ప్రోద్బలముతో వీరు విద్యానగరమును నిర్మించిరి. అదియే విజయనగరము (హంపి). హరిహరరాయాదులు సంగమ రాజపుత్రులగుటచే వీరిది సంగమవంశ మయ్యెను.
హరిహరరాయలు I (క్రీ. శ. 1336-1357) బుక్కరాయలు I ను (క్రీ. శ. 1344-77), కొన్ని యేండ్లు కలిసి రాజ్యము చేసిరి. క్రీ. శ. 1344 లో బుక్క రాయలు యాదవరాజ్యమును, పశ్చిమతీరమునందలి తులునాడును జయించెను. “పూర్వ పశ్చిమ సముద్రాధీశ్వర" అను బిరుదు వహించి, హరిహరరాయలు, బుక్క రాయలు క్రీ. శ. 1346 లో తక్కిన సోదరులతోకూడి శృంగేరిలో గురుసమక్షమున విజయోత్సవము జరుపుకొనిరి. ఈ మహాసామ్రాజ్య నిర్మాతలగు వీరులు హోయసల సామంతులుగాక ఆంధ్రు లనుట నిక్కు వము.
బహమనీరాజ్యము (క్రీ. శ. 1347-1525) నకును తద్విచ్ఛిన్నానంతరము ఏర్పడిన గోలకొండ, బీదరు, అహమదునగరు, బిజాపూరు, బరారు అను అయిదు తురక రాజ్యములకును, విజయనగర రాజ్యమునకును మధ్య సతతము సమరములు సాగుచునే యుండెను. రాయచూరు లోయ, తూర్పుతీరమున కృష్ణానది యుత్తర భాగము, తరచుగ చేతులు మారినను తుంగభద్రానది దక్షిణతీరము మాత్రమే ఎల్లప్పుడును విద్యానగరాధీశుల అధీనమందే యుండెను. అల్లాయుద్దీను బహమన్ షా క్రీ.శ.1349, 1354 లలో విజయనగరముపై దండెత్తెను. కాని రెండవతూరి బుక్క రాయలచే పరాజితు డయ్యెను. బుక్కరాయలు I బహమనీ సుల్తానులు-మహమ్మదు I ముజాహిదులతో యుద్ధము చేసి గెలిచెను. ఇతని పుత్రుడు కుమార కంపన II మధుర ముస్లిం రాజ్యమును అంత మొందించెను. క్రీ. శ. 1374 లో బుక్క రాయలు చైనా చక్రవర్తికి రాయబార మంపెను,
ఇతని తరువాత హరిహరరాయలు II (క్రీ.శ. 1377- 1404) రాజ్యమునకు వచ్చెను. ఈ మహారాజు తురకల నుండి చౌల్, దబూల్ రేవులను జయించెను. క్రీ. శ. 1382-85 సంవత్సరముల మధ్య కొండవీటి రెడ్లనుండి కర్నూలు, నెల్లూరు, గుంటూరు మండలములలో కొన్ని రాజ్యభాగములను ఇతడు వశపరచుకొనెను. క్రీ.శ. 1388-89 లో ఫిరోజిషా బహమనీతో యుద్ధముచేసెను.