ఆంధ్రదేశ చరిత్రము - III
1309 మాలికాఫరు యాదవులను రూపుమాపి ఓరుగల్లుపై దాడి వెడలెను. కాని ఓడిపోయెను. అయినను వెంటనే యింకొక దండయాత్రను సలిపి ఈసారి కోట బురుజులను స్వాధీనపరచుకొనెను. అంతట ప్రతాపరుద్రుడు సంధిచేసికొనెను. తనకున్న యావత్తుధనమును, ఏనుగులను, గుఱ్ఱములను మాలిక్ కాఫరుకు ఇచ్చెను. ప్రతిసంవత్సరము జాజియా కప్పముకట్టుటకు అంగీకరించెను. 1311-13 మధ్య గండికోటలోని కాయస్థులు, వీరికి సహాయము చేసిన కొందరు రెడ్లు ఓడింపబడిరి దక్షిణమున పాండ్యులు కంచిని పట్టుకొని కాకతీయ పరిపాలకులను పారదోలిరి. వారిని ఓడించి తిరిగి తమ బలమును స్థిరపరచుకొనుటకు కాకతీయ సేనానులు ప్రయత్నించి నెగ్గిరి. మహారాజు శ్రీశైల, త్రిపురాంతక, కంచి, జంబుకేశ్వరాది పుణ్యతీర్థములను సేవించి అనేక భూదానముల నొనర్చి 1318 నాటికి ఓరుగల్లు చేరెను. 1320 లో ఘాజీ తుగ్లకు కొడుకు ఆలుఫ్ ఖాన్ తిరిగి ఓరుగల్లుకోటను ముట్టడించెను. కాని నాడు ఢిల్లీకి పోవలసి వచ్చెను. 1322 లో తిరిగి యెక్కువ సైన్యముతో వచ్చి ఆలుఫ్ ఖాను కోటను ముట్టడింపగా చేయునది లేక ప్రతాపరుద్రుడు సకుటుంబముగా లొంగిపోయెను. ఆతనిని ఢిల్లీ పంపగా దారిలో మృతినొందెను (1323). ప్రతాపరుద్రుడు తన సైన్యమును, ఉత్తర దిశయందలి కోటలను వృద్ధి పరచక యుండుటయు, ప్రోలయ వేమారెడ్లు తమ స్వాతంత్య్రమును వెల్లడి చేయుటయు, యుద్ధరంగమున పద్మనాయకులపై భారమంతయు మోపి రెడ్లు తాము పోరుసల్పక యుండుటయు ఈ అపజయమునకు ముఖ్య కారణములు.
కాకతీయ రాజులు విద్యాపోషణము చేసిరి. అనేక అగ్రహారముల నిచ్చిరి. విశేషముగా దేవాలయములను కట్టించిరి. సర్వకళలనుపోషించిరి. మల్లికార్జునుని నిరోష్ఠ్య రామాయణము, ఉదారరాఘవము, విద్యానాథుని ప్రతాపరుద్ర యశోభూషణములను అలంకారశాస్త్రము, అగస్త్యుని బాలభారతము, గంగాధర కవియొక్క భారత నాటకము, నరసింహ కవియొక్క కాదంబరీ నాటకము, విశ్వనాథుని సౌగంధి కాపహరణము, అప్పయార్యుని జినేంద్ర కళ్యాణాభ్యుదయము, త్రిపురాంతకుని ప్రేమాభి రామము, మాదన మార్కండేయ పురాణము, భాస్కర కవి రామాయణము, ఏకామ్రనాథుని ప్రతాప చరిత్రము, ఆ కాలవు వాఙ్మయాభివృద్ధిని తెలియజేయుచున్నవి. రాజ్య విస్తీర్ణము, పరిపాలనా విషయములు అప్పటి శాసనములను బట్టియు, వాఙ్మయమును బట్టియు తెలియుచున్నవి. రాజ్యమున ఇప్పటి తెలంగాణము, రాయలసీమ, కోస్తా జిల్లాలు, తొండమండలము, కంచి మండలము ఇమిడి యుండెను. చక్రవర్తి ఓరుగల్లున అష్టప్రధానులతో రాజ్యము చేయుచుండెను. అతడే సర్వసేనాని. న్యాయ స్థానమున కధ్యక్షుడు. ఆ కాలమున 77 రాజ్యాంగ నియోగము లుండెననియు, ఒక్కొక్కదానికి ఒక్కొక్క అధ్యక్షుడుండెననియు, ఈ నియోగములన్నియు పద్మనాయకుల యాజమాన్యమున పనిచేయుచుండెననియు తెలియును. రాష్ట్రము లేక మండలము, సీమ, నాడు, గ్రామము విభాగములు. రాజప్రతినిధులు, వారిక్రింది సామంతులు. తగు రక్షక సైన్యముతో పాలించుచుండిరి. గ్రామపరిపాలనము రెడ్డి, కరణము, తలారి వశమున నుండెను. వ్యవసాయమునకై పెద్ద తటాకములు త్రవ్వబడెను. పన్నులు ధాన్యరూపమున వసూలు చేయుచుండిరి. అనేక విధముల సుంకములు, భూమి, నీటిపన్నులు, సామంతు లిచ్చెడి కప్పములు, న్యాయస్థానములందు వసూలగు రుసుములు, వర్తకము వల్లను, వస్తువులు అమ్మకముమీదను వసూలుచేయబడు పన్నులవల్లను, సముద్రమునుండియు, ఖనిజవస్తు సామగ్రి నుండియు, ఆటవిక సంపదవల్లను వచ్చు ధనమంతయు ధనాగారమును నింపుచుండెను. ఆకాలమున నాణేములను ముద్రించుచుండిరి. ఈ రాజులు శైవమతస్థు లగుట చేత నంది విగ్రహముగల బంగారు, వెండి మాడలు విశేషముగా ముద్రింపబడు చుండెను. కృషీవలులకై అరణ్యములను నరకి భూములను వ్యవసాయమున కనుకూలముగ జేసిరి. పెక్కు గ్రామములను నిర్మించిరి. విశాలాంధ్రదేశము, కళింగము, దక్షిణ భాగము, ఉత్తరచోళ మండలము, కాకతీయసామ్రాజ్య భాగములే.
రా. సు.
ఆంధ్రదేశ చరిత్రము III క్రీ. శ. 1324-1875: -రాజకీయస్థితి క్రీ.శ. 1324 - 14 వ శతాబ్ది ప్రథమ పాదమున ఆంధ్రదేశము ఉత్తర హిందూస్థానమునుండి