Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/525

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్రదేశ చరిత్రము . II


కరికాల వంశమున మధురాంతక పొత్తపిచోళు డుదయించెను. అతని వంశమున తెలుగు బిజ్జ డుదయించి కావేరిదాటి మధురను జయించెను. ఆ తరువాత మనుమసిద్ధి 1175 నుండి 1192 వరకు నెల్లూరు రాజధానిగా రాజ్య మేలెను. ఈతని శాసనములు శ్రీకాళహస్తి, కొవ్వూరు, నెల్లూరు, పొత్తపి గ్రామములలో దొరకినవి. నెల్లూరి శాసనమున రాజు ఎర్రంపల్లి గ్రామమును పూంగినాడులోని నెల్లూరి నాగూరీశ్వరునకు దానమిచ్చెను. ఈతడు చోళ మహారాజునకు సామంతుడు. ఈతని సమకాలికులు చోళ రాజాధిరాజకులోత్తుంగ, కాకతిరుద్ర దేవ, వెలనాటిచోడ, గోంక, పృథ్వీశ్వర కోట వంశపు భీమకోట రాజు, యాదవవంశపు సారంగధర, తెలుగు పల్లవ వంశపు విజయాదిత్య, అల్లు తిక్క, నాగవంశపు సత్తిరాజు, కొణిదెన నన్నిచోడుడు, పొత్తపిచోడకామ, మల్లిదేవ. ఈతని తరువాత ఈతని తమ్ముడగు బెట్టదేవుని కొడుకులు దాయభీమ, నల్లసిద్ధి ఉమ్మడిగా 1187 నుండి 1214 వరకు రాజ్యమేలిరి. వీరు కులోత్తుంగుని సామంతులు.అనేక దేవబ్రాహ్మణ మాన్యముల నొసంగిరి. వీరు రేనాడు,పూంగినాడు, తొండమండలముపై రాజ్యమేలిరి. కంచిని స్వాధీనపరచుకొని కప్పము వసూలు చేసిరి. 1183-1192 మధ్య స్వతంత్రు లయిరి.

ఎర్రసిద్ధ 1195-1217 మధ్య పాలించేను. గండగోపాలాది బిరుదములను పొందెను. ఈతడు మూడవ కులోత్తుంగుని సామంతుడు. ఈతని కుమారులు మనుమ, బెట్ట, తమ్ము సిద్దుల సహాయముతో రాజ్యము విస్తరింప జేయగలిగెను. మనుమసిద్ధి (1198-1210) అనేక దానములను అగ్రహారములను దేవబ్రాహ్మణులు కొసంగెను. ఈతడు మూడవ కులోత్తుంగుని సామంతుడుగా నుండి ఆతని చివరికాలమున స్వతంత్రుడయ్యెను (1204). తమ్ముసిద్ధి (1205-1209) శాసనములు చోళదేశమున గలవు. కంచి నెల్లూరు పట్టణముల మధ్యస్థదేశముకూడ ఈతని కైవస మయ్యెను. అయినను ఈతడు కులోత్తుంగుని సామంతుడుగా నుండెను. అతనితో ఓరుగల్లు కోటపై దండెత్తి గణపతి నోడించెను (1208), నల్లసిద్ధి రాజుగా పట్టాభిషిక్తు డయినను అతని తమ్ముడు తమ్ముసిద్ధి అతని కటాక్షమున రాజ్యమేలెను. యాదవరాయ వంశముతో వీరికి బంధుత్వ మేర్పడెను. ఈతని తరువాత మనుమసిద్ధి కుమారుడు తిక్క (1209–1248) రాజ్యమేలెను, ఈతనికి 'తేంకనాదిత్య', 'జగదొబ్బగండ', అను బిరుదము లుండెను.ఈతడు కూడ మూడవ కులోత్తుంగుని సామంతుడుగా రాజ్యమేలెను. ఈత డనేక దానశాసనములు నిచ్చెను. మూడవ రాజరాజు కాలమున కంచిలోని దేవాలయములకు ఈతడు, ఈతని సామంతులు పెక్కు దానములు చేసిరి. మూడవ రాజ రాజు 13 వ రాజ్యకాలమున ఉత్తర ఆర్కాటు జిల్లాలోని గుడి మల్లందేవునికి గండగోపాల మాడలు దానమిచ్చుటచేత ఆ ప్రదేశము తిక్కరసకు లోబడినదని తోచును. ఈతని శాసనములు కంచి దేవాలయములలో నున్నవి. ఈతనికి చోళ తిక్కయను బిరుదము కలదు. చోళ రాజరాజునకు సామంతుడుగానుండి అతనితో కలిసి హోయసల రాజులను ఓడించెను. ఈతని అల్లుడు అల్లుతిక్క కంచినుండి పాలించుచు ఆత్మకూరున దేవుని ప్రతిష్ఠించి చాల ధర్మములు చేసెను (1246). శ్రీ వరద రాజస్వామి భక్తులమని వ్రాసికొనిరి. 1257 లో తిక్కభూపతి కంచిని పట్టుకొనెను. ఈతడు గొప్ప వీరుడేగాక పరిపాలనా కౌశలము కలవాడు. ఈతడు తన పేరుతో చాల నాణెములను ముద్రింపించెను. ఆ కాలపు రాజవంశము లన్నింటితోను సంబంధము కలిగి మంచి పేరును, కీర్తిని సంపాదించెను. నెల్లూరు, చెంగల్పట్టు, ఉత్తర ఆర్కాటు, కడపజిల్లాలు అతని పాలనములో నుండెను. తిక్కనకవి తన నిర్వచనోత్తర రామాయణమున తిక్కభూపతి కర్ణాట సోమేశ్వరుని, శంభురాజుని, ఇంకా ఇతర రాజులను ఓడించెననియు చోళ రాజరాజును సింహాసనాసీనుని చేసెననియు (పాండ్యరాజు బారినుండి తప్పించి), తాను కూడ కంచినుండి పరిపాలన సాగించెననియు వ్రాసెను. కేతనకవి తిన దశకుమార చరిత్రలో తిక్కభూపతి పాండ్యరాజువద్ద (మారీవర్మ సుందరపాండ్య) కప్పము గైకొనె ననియు వ్రాసెను. తిక్క సమర్థులైన సేనాధిపతులు, మంత్రులు గలవాడు. తెలుగు చోళుల సైన్యములు ధైర్య శూరత్వములు కలిగి గొప్ప అనుభవముతోను, నేర్పుతోను యుద్దము చేయుచుండెను. కనుక దక్షిణ దేశ మునందంతటను తెలుగువారి కీర్తి ప్రతిభలు