Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/521

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్రదేశ చరిత్రము . II


మును వాడుట ఇదియే మొదలు. తన పేరున రెండు ఈశ్వరాలయములు కట్టించెను. ఈతని శిలాశాసన మొకటి బెజవాడ ఇంద్రకీల పర్వతముమీద గోవింద మఠమునొద్ద కలదు. అది ఆతని 17వ రాజ్య సంవత్సము నాటిది. అందు ప్రాచీన తెలుగుపదములు కలవు. దానివలన పార్థివేశ్వరుని ప్రతిష్ఠ జరిపినట్లు తెలియును. ఈతని తరువాత ఈతని పెద్దకుమారుడు విజయాదిత్యుడు 6 మాసములు రాజ్యమేలెను. పిమ్మట అతని పెద్దకుమారుడు అమ్మరాజు రాజ్యమునకు వచ్చి 921 నుండి 927 వరకు పాలించెను. ఈతడు తనకు సహాయ మొనర్చిన సేనాధిపతులకు పెక్కు దానశాసనముల నిచ్చెను. ఎడేరు శాసనమున ఇతనికి గల 'రాజమహేంద్ర' బిరుదమును బట్టి ఇతడే గోదావరికి ఉత్తరపు టొడ్డుననున్న రాజమహేంద్రవరమున కా పేరు పెట్టెనని తెలియును. అమ్మరాజు తరువాత అతని కొడుకు విజయాదిత్యుడు చిన్న వాడగుటచే తాడప (తాళరాజు) రాజ్యమును గ్రహించెను. కాని ఆతని నోడించి చాళుక్య భీముని రెండవకుమారుడు విక్ర మాదిత్యుడు రాజ్యమును గ్రహించి, రమారమి ఒక సంవత్సరము రాజ్యమేలెను. తరువాత తాడపుని కొడుకు యుద్ధమల్లు రాజ్యమును పట్టుకొని 928 నుండి 934' వరకు పరిపాలించెను. ఈతని బెజవాడ శాసనమునుబట్టి కుమారస్వామికి గుడి కట్టించె ననియు, శాసనమున ప్రాచీన తెలుగుపద్యములుగల వనియు తెలియును. అమ్మరాజు సోదరుడు రెండవ భీముడు యుద్ధమల్లుని పారద్రోలి 934 నుండి 945 వరకు రాజ్యమేలెను. ఈతడు అనేక దానములు చేసెను. ద్రాక్షారామ భీమేశ్వరాలయములు ఈతనిచే ప్రతిష్ఠితములు, ఈతని తరువాత ఈతని రెండవ కుమారుడు రెండవ అమ్మరాజు 945 నుండి 970 వరకు పరిపాలించెను. ఈతని దానములు తెలుపు శాసనములు పెక్కులు గలవు. మలయంపూడి శాసనమున పాండురంగని మునిమనుమడు దుర్గరాజు కట్టించిన జైనాలయమునకు చేసిన ధర్మము కలదు, తాడికొండ శాసనము (958) దేవాలయమున కిచ్చిన 4గ్రామముల ధర్మమును తెలుపును, ఎలవీపర్రు శాసనము స్వర్ణభాండాగార అధ్యక్షునికి చేసిన గ్రామదానము తెలుపును. కలుచుంబర్రు శాసనము అత్తిలివాడు విషయమందలి గ్రామము జైనాలయము బాగు చేయించుటకు జైనగురువు అర్హ నందికిచ్చిన ధర్మము తెలుపును. వేములపాడు శాసనము దుర్గ రాజుకోరికపై వేద సంపన్నుని కిచ్చిన అగ్రహార దానము తెలుపును. పాములవాక శాసనము ఎలమంచి కళింగ విషయమున చేసిన భూదానమును తెలుపును. రెండవ అమ్మరాజు ఇట్లనేక దానధర్మములను చేసెను. అతనికి యుద్ధమల్లుని కొడుకు బాడపునితో యుద్ధము ప్రాప్తించగా ఓడిపోయి కళింగమున తలదాచుకొనెను. తరువాత తనసోదరుడు దానార్ణవునకు బాడపతాళపులకు 970-973 మధ్య అనేక యుద్ధములు జరిగెను. ఇదే సమయమున పశ్చిమమున రాష్ట్రకూటులు ఓడిపోవుట, తిరిగి పశ్చిమ చాళుక్యులు తమ రాజ్యమును సంపాదించి పరిపాలించుట జరిగెను. అయినను తూర్పు ఆంధ్రదేశము బాడప మహారాజు పాలనమున 999 వరకు ఉండెను. కాని దేశమున శాంతిలేకుండెను. ఈ సమయ మున చోళచక్రవర్తి రాజరాజు వేంగిపై దండెత్తెను.

క్రీ. శ. 973-1000 మధ్య అనగా 27 సంవత్సరములు తూర్పు తెలుగుదేశము అరాజకముగా నుండెను. బాడపునకు తరువాత తాళపునకును, అమ్మరాజు సంతతివారికినిజరిగిన అనేక యుద్ధములవలన దేశము అధోగతి పాలయ్యెను. చోళ దేశమున రాజరాజచోళుడు 985 లో సింహాసన మెక్కెను. క్రీ. 999 లో రాజరాజు వేంగిదేశముపై దండెత్తి జయించెను. ఈతడు దానార్ణవుని పెద్దకుమారుడగు శక్తివర్మకు రాజ్య మిచ్చి తన కూతురు కుండవాంబను శక్తివర్మ తమ్ముడు విమలాదిత్యునికిచ్చి వివాహ మొనర్చి చోళ-చాళుక్య సంబంధమును దిట్టపరచెను. శక్తివర్మ పభుపర్రు గ్రామమున శివాలయములకు భూములను ఒసంగెను. ఆతడు 12 సం.లు పరిపాలించిన తరువాత విమలాదిత్యుడు రాజ్యమునకు వచ్చెను. ఈతని రణస్థిపూడి దానశాసనమునుబట్టి క్రీ. శ. 1011 మే నెలలో తాను పట్టాభిషి క్తుడయినట్లును ఆ గ్రామమును తన మంత్రియగు వజ్రకు దానమిచ్చి నట్లును తెలియుచున్నది. క్రీ.శ. 1013 లో తంజావూరు జిల్లాలోని తిరువైయ్యారు గ్రామమున పంచనదేశ్వరస్వామికి వెండిచెంబులు సమర్పించెను. 1012 లో తంజావూరున తన మామగారిత పాటు తన బావమరది రాజేంద్రచోళుడు సింహాసన'మెక్కు సందర్భమున ఆ మహోత్సవము చూచుటకై