Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/517

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్రదేశ చరిత్రము - I


కొంతకాలమున కొక కుమారుని కనెను. ఇత డే విష్ణువర్ధన నామమును వహించి పల్లవుల నోడించి చాళుక్య రాజ్యము స్థాపించెనని చెప్పబడుచున్నది.

బృహత్పలాయనులు  : ఈవంశము వారు కూడూరు హారమును అనగా కృష్ణానదీ ముఖప్రాంతమును మూడవ శతాబ్దిలో పాలించినట్లు కన్పట్టును. క్రీ.శ.270 నుండి 285 వరకు వీరి కాలమని తెలియుచున్నది. కొండముది తామ్ర శాసనమువలన జయవర్మ మహారాజు 'పాంటూరు' గ్రామమును దానము చేసెనని తెలియుచున్నది. పాంటూరు వీరి రాజధాని యని కొందరి మతము. కాని కొండముది శాసనమున అట్లు లేదు. మహారాజ జయవర్మ పల్లవరాజగు మహారాజు శివస్కందవర్మకు సమకాలికుడు. ఇతడు పల్లవులబారిని పడకుండ తన రాజ్యమును కట్టుదిట్టము చేసికొనెను. ఇతడు 'మహేశ్వరపాద పరిగృహీతు' డని ఇతని శాసనము తెలుపుచున్నది. శాతవాహనుల యొక్కయు, ఇక్ష్వాకుల యొక్కయు పద్దతులనే ఇతడు అనుసరించెను.

శాలంకాయనులు  : క్రీ. శ. 4, 5 శతాబ్దములలో కృష్ణా గోదావరీనదుల నడిమి ప్రదేశమును పాలన చేసిన వారు శాలంకాయనులు. వీరినే వైంగేయకు లందురు. వేంగి రాజధానిగాగలవారగుటచే వైంగేయకులనియు, శాలంకాయన గోత్రీయులుగాన శాలంకాయనులనియు వీరు పేర్కొనబడుచున్నారు. ఏలూరు శాసనము, పెద వేగి శాసనము మొదలగు తామ్రశాసనములవలన వీరినిగూర్చి తెలియుచున్నది. దేవవర్మ అనునాతడు మనకు తెలిసిన మొదటిరాజు. ఇతడు అశ్వమేధయాగము చేసి 'అశ్వమేధయాజి' అనబడెను. ఇతడు శాసనములలో 'పరమ మాహేశ్వర', 'బప్పభట్టారక పాదభక్త' అనబడెను. ఇతని తరువాత హస్తివర్మ అను రాజు 'సమరావాపవిజయీ' అను బిరుదు పొందెను. ఇతని కాలముననే సముద్రగుప్తుడు వేంగిపై కెత్తివచ్చెను. అతడు తిరిగిపోయిన తరువాత యథాప్రకారము ఇతడు తన రాజ్యమును పాలించెను. పిదవ కృష్ణానదివరకు రాజ్యమును వ్యాపింపజేసినవాడు నందివర్మ. ఇంకను చండవర్మ, రెండవ నందివర్మ, స్కంద వర్మ, అను రాజులు తదుపరి పాలించిరి. నందివర్మ మహారాజు ' వివిధ ధర్మ ప్రధానుడు' అని ప్రశంసింపబడెను. ఈతడు వైదికమతమును బౌద్ధమతమును సమదృష్టితో చూచి ఆదరించెను.

ఈ వైంగేయకులు చిత్రరథ స్వామిని కొల్చెడువారు. వీరు ఆస్వామి దేవాలయమును వేంగిలో కట్టించిరి. జైన మతము, బౌద్ధ మతము కూడ ఈ రాజుల మత సహనమువలన ప్రోత్సాహము పొందినవి. బర్మానుండి వచ్చిన బౌద్ధ యాత్రీకులు సత్కరింపబడిరి. బుద్ధదత్తుడను పండితుడు సింహళమునుండి వేంగి ఆస్థానమునకు ఆహ్వానింపబడెను. ఈ వంశము నందలి విజయనందివర్మ పరమ భాగవతుడు. ప్రాలూరు నందలి విష్ణుగ్రహస్వామికి ఈతడు భూదానము చేసెను.

కందార వంశపు రాజులు, ఆనందగోత్రులు : బృహత్పలాయనులు పాలించుచుండిన సమయమున కందార వంశపురాజులు గుంటూరు, తెనాలి, ఒంగోలు తాలూకాల ప్రాంతమును, కందరపురమును రాజధానిగా జేసికొని పాలించిరి. చేజెర్ల, మట్టేపాడు, గోరంట్ల శాసనములవలన వీరినిగూర్చి తెలియుచున్నది. కందరుడు వంశమునకు మూలపురుషుడు. కంతేరు అనునదే కందరపురము. వీరు ఆనంద గోత్రీకులు. కాబట్టి ఆనందగోత్ర రాజు లనబడిరి. దామోదరవర్మ. అత్తివర్మ అను రాజులు ఈ వంశమున ముఖ్యులు. దామోదరవర్మ బౌద్ధమతాభిమాని. రాజులు బ్రాహ్మణులకు దానములు చేసెడివారు. శివభక్తులు. వంకేశ్వరస్వామిని కొల్చెడివారు. రాజులు పరమత సహిష్ణుతాయుతులగుటచే బౌద్ధ నిర్మాణములు ఆంధ్ర దేశమున వెలిసి క్రీ. శ. 7వ శతాబ్దమున యువాన్ చువంగు అను చీనా బౌద్ధ యాత్రికుడు ఆంధ్రదేశమున గలవానిని గూర్చి వ్రాయుటకు అవకాశమిచ్చినవి.

విష్ణుకుండినులు  :- వైంగేయకుల ఆధిపత్యము అంతరించినపిమ్మట విష్ణుకుండిన రాజులు పాలించిరి. వీరి రాజధాని వేంగికి సమీపముననున్న లెందులూరు అను ఇప్పటి దెందులూరు. చిక్కుళ్ళ, ఈపూరు, రామతీర్థము శాసనముల మూలమున వీరిని గురించి తెలియుచున్నది. వీరు శ్రీ పర్వతస్వామిని కొల్చెడివారు. క్రీ. శ. 5, 6 శతాబ్దులలో వీరు పాలించిరి. మాధవవర్మ అను రాజు యాగములు చేసెను. మొదటి మాధవవర్మ వాకాటక రాజు కుమార్తెను వివాహమాడెను. కావున ఈతడు