Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/502

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్ర జానపద గేయ వాఙ్మయము


కొంగపాట, గోపికా స్త్రీల జలక్రీడలు, రుక్మిణీకల్యాణము, చిలుక రాయబారము, సత్యభామ సరసము, రుక్మిణీదేవి ముచ్చట, రుక్మిణీదేవి సీమంతము, పొరుజాత పల్లవి, ఉషాస్వప్నము వంటివి ముఖ్యములు. కుచేలోపాఖ్యానము, భ్రమర గీతలు మున్నగు పాటలు అముద్రితములు.

సత్య హరిశ్చంద్ర, చంద్రమతీదేవి బ్రతుకమ్మపాట, గోవు పాట, దత్తాత్రేయ జననము, దక్షయజ్ఞము, గంగా వివాహము, గంగా గౌరీ సంవాదము, సవతుల కయ్యము,ఈశ్వర భృంగి వాదము, మేనకా పార్వతీ సంవాదము, లక్ష్మీ పార్వతుల సంవాదము, త్రిపురాసుర సంహారము, సురాభాండేశ్వరము, మార్కండేయ జననము, సిరియాళ మహారాజు చరిత్రము. భల్లాణరాయ కథ, కొమిరెల్లి మల్లన్నకథ. వరదరాజు పెండ్లి పాట, అండాళ్ చరిత్రము. శ్రీరంగ మహాత్మ్యము, తిరుమంత్రము పాట, దశావతారముల పాట, లక్ష్మీదేవి సొగటాలాట, లక్ష్మీ దేవి వర్ణనము, వేంకటేశ్వరుల వేట, చెంచెత కథ, ఏకాదశీ మాహాత్మ్యము, వరహావతార చరిత్రము, నూట యెనిమిది దివ్యస్థలములు, వేంక టేశ్వర మాహాత్మ్యము వంటివి ఇతర పురాణములకును మాహాత్మ్యములకును సంబంధించిన గేయములై యున్నవి. ఇట్టి గేయములందు అంతటను మనకు కన్పించునది జానపదుల తాదాత్మ్యము. మూలకథలకును గేయములందలి కల్పనలకును గల భేద మరసి దానిని జానపదుల జీవితముతో పోల్చిచూచిన జానపదుల చిత్తవృత్తులు వారికి ఆ యా పురాణపురుషులు యెడ గల అభిమానము భక్తి ప్రేమలు తెల్లమగును.

2. చారిత్రక గేయములు  :- జానపద గేయ వాఙ్మయమున చరిత్రకు సంబంధించిన గేయములకు ఒక విశిష్ట స్థానము కలదు. వస్తువునందును, శైలియందును, కథా కథన పద్ధతియందును, తక్కిన జానపద గేయములకన్న ఇవి భిన్నముగా నుండును, వీటినే వీరగీతము లందురు కూడ. చారిత్రక వీరగీతములు త త్తదుచిత వీరసంఘటన మేదియో జరిగిన వెంటనే ఉద్భవించును. ఆ సన్నివేశమును కన్నులార గాంచియో, చెవులార వినియో జానపదు డొకడు ఉద్వేగముతో గాన మొనరించును. ఆ పాట అంతటను ప్రాకిపోవును. ఇట్లు విస్తరించుటలో పాట యొక్క వస్తువు కాలక్రమమున మార్పుల నొందును. ఒక క్రొత్త పాటయందు అభివర్ణింపబడిన సంఘటనములకు ప్రాతకాలపు గాన ప్రవాహమందలి సంఘటనలు తోడై ఊహింపరాని మార్పులు కలుగును. ఎప్పుడో లిఖితమై పోయిన ఇట్టి చారిత్రక గేయములందు సిసలైన చరిత్రము లభించును. కానిచో ఇవి రానురాను మారిపోయి గుర్తించుటకు వీలుగాక అస్పష్ట చరిత్రములుగా పరిణమించి మరికొన్ని దినములకు పుక్కిటి పురాణములుగా కల్పిత కథలుగా మారిపోవును. చారిత్రక వీర గేయములకును తదితర జానపద గేయములకును ధ్యేయములు వేరు వేరు. ఉత్సాహోల్లాసములకు గాక వీరగీతములు అవబోధమునకై పాడబడును, ఆంధ్ర దేశము తొలినుండి వీరప్రసువు. తెలుగువారికి వీరాభిని వేళము మెండు. కనుకనే తెలుగునాట వీరపూజలు పాదుకొన్నవి. తదితర జానపద గేయములవలెనే తెలుగుదేశమున చారిత్రక గేయములు కూడ అసంఖ్యాకములుగా నున్నవి. "తెలంగాణ మందే మియాసాబ్, సోమనాద్రి, రామేశ్వరరావు, రాణి శంకరమ్మ, సవై వెంకట రెడ్డి, కుమారరాముడు, కర్నూలు నవాబు, మున్నగువారి కథ లున్న "వని కీ. శే. సురవరం ప్రతాపరెడ్డిగారు అనిరి. ఇవిగాకను సదాశివరెడ్డి, పర్వతాల మల్లా రెడ్డి, సర్వాయి పాపడు, బల్గూరి కొండల్రాయుడు ఇటువంటి తెలంగాణపువీరుల కథలును బహుళ ప్రచారమందిన గేయములే. చారిత్రకముగా పల్నాటి వీరుల కథలు ప్రాచీనములు. శ్రీనాథుని, బాలచంద్రుని యుద్ధ మొక్కటియే ఇప్పటికి ముద్రింపబడినది. ప్రాచ్య పుస్తక భాండాగారమున ఈ వీరుల కథలు అనేకములు మూలుగుచున్నవి. కోళ్ళ పోట్లాట గోపు యుద్ధము, రాయబారము, యుద్ధ సన్నాహము, గురజాల యుద్ధము పూర్వభాగము, కల్లు ప్రతిష్ఠ, బాలుని కథ, బాలుని యుద్ధము, కన్నమనేని యుద్ధము- గోవు సంస్కారము, కొమ్మరాజు యుద్ధము, బ్రహ్మనాయని విరుగు వంటి కథలు పాఠభేదములతో అందు కాననగును. వీటి తరువాత ప్రసిద్ధికెక్కినది కాటమరాజు కథ. ఎఱ్ఱగొల్లలు, మందుచ్ఛవారు ఈ కథలను చెప్పుదురు. శ్రీనాథుడు వ్రాసినట్లు ప్రతీతిగల కాటమరాజు కథ లభింపలేదు. 'కాని "పినయెల్ల యనువాడు ప్రియము దీపింప వలనొప్ప