Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/501

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్ర జానపద గేయ వాఙ్మయము


నొక పాశ్చాత్య పండితుడు తొలిసారిగా జానపద గేయములను సేకరించెను. ఆయన జె. ఎ. బాయ్ ల్ గారు. తరువాత ఇరువదియవ శతాబ్ది ప్రారంభమున ఉత్సాహవంతులగు పండితులును, ప్రచురణ కర్తలును ఈ గేయములను సేకరించి ప్రకటించిరి.

ఇప్పటికి లభించిన ముద్రితా ముద్రిత జానపద గేయముల నన్నింటిని విమర్శన సౌలభ్యమునకై కొన్నిభాగములుగా విభజించుకొనవచ్చును.

పౌరాణిక గేయములు  : జానపద గేయములుకూడ మన శిష్టసాహిత్యమువలెనే వివిధ పురాణేతివృత్తములు కలవి, బహుళ ప్రచారమందున్నవి. అనువాదములగు రామాయణ భారతాది గ్రంథములందు మూలమున లేని కథలు పెక్కులున్నవి. అట్టివి జానపద గేయములందుకూడ నుండుటచే ఇట్టి కూర్పులు సంస్కృతమునుండి ఆంధ్రానువాద మొనర్చిన శిష్టులు చేసిన తరువాత ఆ గాథలు వినిన జానపదులు వాటిని స్వీకరించిరో లేక జానపదులలో ప్రచార మందున్న ఈ మూలాతిశాయి విషయములు తమకు రుచించుటచే పండితులు చేపట్టిరో ఇదమిత్థముగా చెప్పజాలము. జానపద గేయములలో మనము శిష్ట సాహిత్యమందున్న ప్రసిద్ధ పౌరాణిక గాథలన్నియు చూడగలము. పౌరాణిక గాథలపై జానపదులకు అమితమైన భక్తి కలదు. రామాయణ భారత భాగవతాదులందలి కథలును, అష్టాదశ పురాణములందలి ప్రసిద్ధ కథలును జానపదుల చిత్తవృత్తి ననుసరించి మలచబడినవి. కూచకొండ రామాయణము, శారద రామాయణము, ధర్మపురి రామాయణము, రామాయణకథాసుధార్ణవము, మోక్షగుండ రామాయణము, సూక్ష్మ రామాయణము, సంక్షేప రామాయణము, గుత్తెనదీవి రామాయణము, చిట్టి రామాయణము, శ్రీరామదండములు, రామాయణ గొబ్బిపాట, శ్రీరామ జావిలి, అడవి, శాంత, పెండ్లి, సేతు- గోవింద నామములవంటివి రామాయణగాథా పాధః ప్రపూరములు, ఇంకను “విద్దికూచి రామాయణ మారుకాండముల నచ్యుత జాగర వేళ బాడి" నట్టి వెన్ని మృగ్యమైపోయెనో తెలియదు. ఇక రామాయణము నందలి కొన్ని కొన్ని భాగములనే తెలుపునవి శాంతా కల్యాణము, పుత్రకామేష్టి, కౌసల్య బైకలు, శ్రీరాముల ఉగ్గుపాట, రాఘవ కల్యాణము, రాములవారి అలుక, సుందర కాండపదము, ఋషులు ఆశ్రమము, సుగ్రీవ విజయము, కోవెల రాయబారము, అంగద రాయబారము, లక్ష్మణమూర్ఛ, లంకాయాగము, గుహ భరతుల అగ్నిప్రవేశము, శ్రీరామ పట్టాభిషేకము, లక్ష్మణదేవర నవ్వు, ఊర్మిళాదేవి నిద్ర, కుళలాయకము, కుశలవకుచ్చెల కథ, కుశలవ యుద్ధము, వేపూరి బ్రతుకమ్మ కుశలవ పాట, పాతాళహోమము, శతకంఠ రామాయణము వంటివి అసంఖ్యాకములు కలవు.ఒక్క నీతాదేవిని గురించియే - సీతపుట్టుక, సీతాకల్యాణము సీత నత్తవారింటి కంపుట, సీత సమర్త, సీత శుభగోష్ఠి, సీత గడియ, సీత వామనగుంటలు, సీతామ్మవారి అలుక, సీత వసంతము, సీత దాగిలిమూతలు, సీత సురటి, సీత ముద్రికలు, సీత ఆనవాలు, సీత అగ్నిప్రవేశం, సీత వేవిళ్ళు మున్నగు పాటలు ఎన్ని యో కలవు. సీతమ్మ చెర, మాయ లేడి పాట మున్నగునవి అముద్రితములుగా నున్నవి. ఈ పాటలయందలి భాష, భావము, కల్పనలు జానపద వాసనను వెలార్చుచుండును.

రామాయణగాథల తరువాత భారతగాథలు లెక్కింప దగినవి. నలచరిత్ర, దేవయాని చరిత్ర, సుభద్రా కల్యాణము, సుభద్ర సారె, ధర్మరాజు జూదము, ద్రౌపది వలువలు, పండుపాట, విరాటపర్వము, పద్మవ్యూహము, విశ్వరూపము, భగవద్గీత కథాగీతము, సావిత్రి బ్రతుకమ్మ పాట, శశిరేఖా పరిణయము, గయోపాఖ్యానము, పరాశర మత్స్యగంధి సంవాదము వంటివి జానపదుల నోళ్ళ యందు బ్రతికియున్న భారత గాథలును, విరాట, కర్ణ శల్య, పర్వములును, ఉత్తర, దక్షిణ గోగ్రహణములును పెద్ద పదములు.

ఇటులే అనేకములయిన భాగవత గాథలను కూడ జానపదులు పాడుకొందురు. భక్తి శృంగారములవలె జానపదులను శ్రీకృష్ణుని చిలిపి చేష్టలు మరింత పరవళులను చేసినవి, భాగవతమునకు సంబంధించిన కథలందు ప్రహ్లాద చరిత్ర పదము, వామన విజయము, వామన చరిత్రము, అంబరీషోపాఖ్యానము, గజేంద్ర మోక్షము, శ్రీకృష్ణ జననము, కాళింగమడుగు పాట, శ్రీకృష్ణుని చల్దులు, బాలకృష్ణ లీలలు, గుమ్మడు పాట, యశోద