ఆంధ్ర జానపద గేయ వాఙ్మయము
జన్యము. పాశ్చాత్య దేశములందు సాహిత్యాభిమానులును, మానవ శాస్త్రవేత్తలును కడచిన రెండు శతాబ్దములనుండి ఇట్టి గేయములను, వాఙ్మయమును సేకరించి పరిశోధనములు చేయుచున్నారు. ఆయా జాతుల సంస్కృతులకును, భాషా సాహిత్యములకును ఇట్టి గేయములే మూలకందము లని వారలు అభిప్రాయపడి యున్నారు.
జానపద గేయమునకు ముఖ్యలక్షణములు 1. అజ్ఞాత కర్తృకత్వము లేదా సామూహిక కర్తృకత్వము 2. స్థిరరూప రాహిత్యము. 3. రచనా కాలము తెలియక పోవుట, 4. మౌఖిక ప్రచారము, 5. అకృతక శైలి, 6. గేయత్వము, 7. ఆశురచన, 8. పునరావృత్తి, 9. జన సామాన్య పరిచిత వస్తువు. ప్రతి గేయమునందును ఈ లక్షణము లన్నియు ఉండనవసరము లేదు. కాని ఈ లక్షణము లన్నింటికి కూడలియగు ప్రధాన తత్త్వము---అజ్ఞాత శిల్పము, సార్వజనీనత ఉన్న చాలును. కనుక ప్రాక్తనమానవుని మనోగత భావ వ్యక్తీకరణములును లయాన్వితములునగు నుడుగులును, అఖండపాండితీమండితుల జనామోదముగల పదకవితలును, జానపద గేయములే అగును. ఒక్కొక్క లక్షణమునుబట్టి ఏది జానపద గేయమో, ఏది కాదో నిర్ణయించుటకన్న సాహిత్యతత్త్వము ననుసరించి కవిత్వము నంతటిని రెండు పెద్ద విభాగములుగా చేయవచ్చును. ఒక దాని తత్త్వము జ్ఞాత శిల్పము. మరియొకదాని తత్త్వము అజ్ఞాత శిల్పము. మొదటిది భావుకుడయిన కళాకారుని ప్రయత్నమున తీర్చి దిద్దబడినది. రెండవది జానపదుని సృష్టి, మరియు అప్రయత్నముగా ఒకనోటినుండి ఇంకొక నోటి కెక్కి ఒక ప్రాంతమునుండి ఇంకొక ప్రాంతమునకు ప్రాకి తనకు తానే రూపు దిద్దుకొన్నట్టిది. 'మొదటిది ఏక కర్తృకము. రెండవది అజ్ఞాత కర్తృకము లేదా అనేకకర్తృకము, మొదటిది నాగరకతా మందార, సౌరభ్య సంవాసితము. రెండవది ప్రాకృతత్వ పృథ్వీ గంధ బంధురము. మొదటిది రెండవదాని క్రమపరిణామ వికాసరూపమని విజ్ఞుల అభిప్రాయము. ఆంధ్రకవిత్వము కూడ ఇట్టి క్రమపరిణామమునకు వెలియైనది కాదు. జానపద గేయములే దేశ కవితగా పరిణమించినట్లు మనకు అనేకాధారములున్నవి. సీసము, గీతము, రగడ, ద్విపద, మధ్యాక్కర, తరువోజ మున్నగు దేశీయచ్ఛందములు కొన్ని జానపద గేయముల నుండియే కొలది మార్పులతో ఏర్పడినట్లు భావింపనగును.
జానపద సాహిత్యమునకు నిత్యజీవితమును అలముకొను శక్తి హెచ్చు. ఈ వాఙ్మయము కేవలము ప్రజానీక మిచ్చిన కేలూతవలననే కాలు నిలద్రొక్కుకొన్నది. నిత్యజీవితమందు వాడుకొనెడు వ్యావహారిక భాష యందు సులభ శైలిలో సాధారణరీతిలో మనో భావములు వెలార్చునట్టి ఈ గేయములు జానపదులకు ప్రీతిపాత్రము లయినవి. ఇదిగాక, జానపద గేయములు ఆయా దేశము లందలి మతపరిణామములను, మనస్తత్వములను, వీరుల ఉదంతములను, పతివ్రతల కథలను, అత్యాచారములకు గురియైనవారి గాధలను, ఆచార వ్యవహారములను, విశ్వాసములను, వినోదములను, విందులను, వేడుకలను, అన్యోన్యానురాగములను, సంయోగ వియోగములను, సౌందర్య సౌభాగ్యములను, సుఖ దుఃఖములను, జాతీయతను ప్రతిబింబించుటచే ఈ జానపద గేయములు నిసర్గమనోహరములుగా నుండును. జాతీయత నింతగా పుంజికొన్నవి కనుకనే ఈ పదకవితలు దేశికవితలుగా పరిణతి నొందినవి. దేశీయులగు కవులు మార్గకవిత్వము పై తిరుగుబాటొనర్చి దేశీయేతివృత్తములను తీసికొని దేశీ చ్ఛందములందు దేశీయులకు అనువైనట్లు కవితను చెప్పిరి.
గేయసాహిత్యము చిరకాలమునుండి తెలుగునాట వృద్ధియైనదనుటకు శిష్టకవులు పేర్కొన్న సమకాలిక గేయములే గొప్పసాక్ష్యము. గేయములన్నియు మాత్రా ఛందమున నుండును. నన్నయకు పూర్వపు శాసనములందే మనకు దేశికవితారీతులు కాన్పించును. నన్నయ భట్టు స్వయముగా తరువోజ, మధ్యాక్కర, అక్కర, మధురాక్కర అను వాటిని వాడెను. అంకమాలికలు, ఊయెలపాటలు, ఆలతులు, గౌడు గీతములు, రోకటి పాటలు మున్నగునవి నన్నెచోడుడు పేర్కొనెను. ఈ గేయముల జాడ మన కధికముగా కనబడునది పాల్కురికి సోమనాథుని రచనలయందు. సోమనాథుని కవిత్వమునకు ఆధారము లానాడు ప్రజలు భక్త్యుద్రేకములతో పాడుకొన్న గేయములేనట. “ఆతత బసవపురాతన భక్త గీతార్థ సమితియే మాతృక" గాగ ఆతడు కవిత్వరచనకు