Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/458

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అష్టోత్తర శతతాళములు

నిచో తిత్తిరీగతి యందురు. నాలుగు పాదములు సమముగా వైచుచు తొట్రువడని లలితగమనమును చతుష్క గతి యందురు. మరియు అమరకోశానుసారము -

'ఆస్కందితం ధోరితకం రేచితం వల్గితం ప్లుతం
గతయో౽ మూః పంచధారాః ....

అని అశ్వధారలు ఐదుగలవు. (1) ఆస్కందితము = అతివేగమును, అతి మందమును గాక నడితరముగా పరుగెత్తుట. (2) ధోరితకము = ఆస్కందితము కంటె అధికమై చతురమైన అశ్వగతి. (3) రేచితము =వంకర లేక తిన్నగా మిక్కిలి వేగముతో పరుగుదీయుట. (4) వల్గితము = మీదికి కాళ్ళెత్తి వేగముగా పరు గెత్తుట.(5) ప్లుతము =పరువెత్తినంత మేరయు సమమైన వేగముతో పోవుట.

అశ్వశాల  : అశ్వరక్షణ విషయమున నతిజాగరూకులై యుండవలెను. వాస్తు శాస్త్రానుసారముగా అశ్వశాలను నిర్మింపవలెను. అశ్వపాలకులు తమ యశ్వశాలలు సురక్షితములై యుండునట్లును, పరిశుద్ధములై యుండునట్లును చూచుకొనవలసి యుందురు. నెమిలి, హంస, కోడి, తొండ, మేక, పిల్లి, ఎద్దు మొదలయిన కొన్నింటిని అశ్వశాలకడకు రానీయకూడదు. అశ్వములకు దృష్టి దోషము తగులకుండుటకును, కొన్ని రోగములు సంక్రమింపకుండుటకును అశ్వశాలలలో ఒండు రెండు కోతులను పెంచుట హితమని చెప్పబడినది.

అశ్వవైద్యము  : అశ్వములకు రోగములు రాకుండ కాపాడుట యశ్వపాలకుని విధియై యున్నది. ఒక వేళ ఏకారణమువలన నైనను రోగములు సంభవించినచో వాటికి తగిన యౌషధములు ప్రయోగించి చికిత్సోవచారములు గావించుటయు వాని కర్తవ్యము. కావుననే వివిధములైన యశ్వరోగములను, తత్తచ్చికిత్సలను వివరించు వైద్యగ్రంథములు పుట్టినవి. అశ్వశాస్త్రమును రచించిన శాలిహోత్రుడు మేటివైద్యు డనియు తెలియుచున్నది. అశ్వవైద్యశాస్త్ర గ్రంథములలో గణపండితుని అశ్వయుర్వేదము, జయదత్తుని అశ్వవైద్యకము, దీపంకరుని అశ్వవైద్యము, వర్ధమానుని యోగమంజరి, నకులుని అశ్వచికిత్సితము గ్రంథస్థములై గన్పట్టుచున్నవి. సిద్ధ యోగ సంగ్రహమను వైద్యగ్రంథమును పేర్కొనుచు సుప్రసిద్ధ వ్యాఖ్యాత కొలచెలమ మల్లినాథసూరి'- పూర్వాహ్లికాలే చాశ్వానాం ప్రాయశో లవణం హితం ! శూలమోహ విబంధఘ్నం లవణం సైంధవం పరమ్——' అను శ్లోకము నాగ్రంథమునుండి యుదాహరించి అశ్వములకు పూర్వాహ్లవేళ కొంత ఉప్పును ఆహారముగా పెట్టుట హితమని రఘువంశ కావ్యమున పంచమ సర్గమునందు డెబ్బదిమూడవ శ్లోక వ్యాఖ్యానావసరమున వివరించియుండెను.

అశ్వప్రశస్తి  : సర్వలక్షణ సంపన్నములగు అశ్వములు పుణ్యవిశేషమునగాని లభించవని విజ్ఞులందురు. మత్త మాతంగములు, సుందరాశ్వములు గృహద్వారములకడనిల్చుట మంగళకరము. అశ్వలక్షణసారములో అశ్వ ప్రశస్తి కనిపించుచున్నది.

చ. రం.


అష్టోత్తర శతతాళములు  :- భారతదేశమునందు సంగీతము సమగ్రముగా విలసిల్లినది. సంగీతమునందు గేయ వాఙ్మయము, వర్ణగణబద్ధమును, మాత్రాగణమూలకమునై యున్నది. పెక్కురీతుల గణములకు పెక్కు విధము లయిన తాళము లుండును. మనదేశమున వివిధ గేయములకు గల తాళములు ఇతరదేశములందు కానము. ఇతరదేశములవారికి మన తాళములు ఆశ్చర్యకరములును, ఆదర్శప్రాయములును అగును. ప్రాచీన కాలముననే మన సంగీతశాస్త్రమునందలి · అష్టోత్తర శత తాళములు బహువ్యాప్తినొంది, ఇప్పుడు అజ్ఞాతవాసమున నున్నవి. అట్లయ్యు నివి క్లిష్టములు, అసాధ్యములు, అగ్రాహ్యము లనదగదు. ప్రజ్ఞావంతులగు సంగీత విద్వాంసులకు ఇవి కొట్టిన పిండివలె నుండును.

సంగీతమందలి రాగములు, గమకరీతులు మున్నగు వాటివలె తాళములు ఒక్కరీతిగ నుండక దేశ కాల పరిస్థితుల ననుసరించి మారుచుండుట విదితము. ప్రాచీనము లయిన భరతుని నాట్యశాస్త్రమునందలి చచ్చత్పుటాదులు తరువాత శార్జదేవుని కాలమున (1210-1247) మార్గ తాళములుగ చెప్పబడెను. వీటిని పాలకుర్కి సోమనాథుడు శుద్ధము లనెను. శార్గదేవుడు తన సంగీత రత్నాకరమున వింశత్యధికళతతాళములను పేర్కొనగా సోమనాథుడును, తక్కినవారును అష్టోత్తరశతతాళములను మాత్రమే