Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/442

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అల్లూరి సీతారామరాజు


మందుగుండ్లుగల బండ్లను ఆపి అంతయు కాజేసెడివాడు.తలపడి యుద్ధము చేయవలసి వచ్చినప్పుడు విప్లవకారులు చాకచక్యమునకు సైనికులు విభ్రాంతులగుచుండిరి.విప్లవకారులు ఒక నిమిషమున కొండలమీద, మరు నిమిషమున సమతలముమీద కనబడుచుండిరి. పారిపోవు చున్నారని తరుముచుపోగా. వెనుకనుండి విప్లవకారుల పోటు దుర్భరము కాజొచ్చెను. ఇది రామరాజు యొక్క రణనీతి విధానము.

పెద్దగడ్డపాలెము యుద్ధములో ప్రభుత్వపు సైనికులు మారణ యంత్రములను, ఆగ్నిగోళములను విచ్చలవిడిగ ప్రయోగించిరి. విప్లవకారులు కొందరు మడిసిరి. లింగ పురము ఏటిదగ్గర రాత్రి యుద్ధము జరిగెను. చాలమంది విప్లవకారులు హతులైరి. తరువాత ఎవరిమార్గమున వారు పలాయితు లయిరి. ఇది ఆరవయుద్ధము.

గాయపడిన విప్లవకారులను గ్రామీణులు తమ ఇండ్లలో నుంచుకొని చికిత్సలు జరిపెడివారు. ఉపచర్యలు సల్పెడి వారును గ్రామీణులే. అందుచే ప్రభుత్వమువారు ప్రజలను వేధింప గడంగిరి. క్రూర శాసనములు గావించిరి.

రామరాజు అన్నవరము సత్యనారాయణస్వామి దర్శనార్థము కొండమీదికి వెళ్ళెను. ఈ వార్త పొక్కగానే జనులు గుంపులు గుంపులుగా వచ్చిరి. రాజును దర్శించి ప్రేమ, భక్తి, గౌరవములను ప్రకటించిరి. పూల మాలలు వేసిరి. మంగళ హారతులు పట్టిరి. కానుక లొసంగిరి. పాలు, పండ్లు సమర్పించిరి. అచట రాజు స్నానము చేసి, సంధ్య, జపము, తపము ఆచరించెను. శంఖవరము వెడలినపుడును ప్రజలు ఇట్లే అతనిని సమ్మానించిరి.

ఒకసారి రామరాజు తన ముఖమునకు మసిపూసి కొనెను. విప్లవకారులు మలబారు పోలీసు దుస్తులను ధరించియుండిరి. వీరిని చూచి తమవారే అని తెల్లదొర భ్రమవడి మోటారులు ఆపెను. వెంటనే తుపాకులు గురి పెట్టి అసంసిద్ధులైయున్న సైనికులపై విప్లవకారులు' విజృంభించిరి. తరువాత వారిని నిరాయుధులను చేసి, యుద్ధసామగ్రి నంతయు గ్రహించి పారిపోయిరి.

సర్కారువారు విప్లవకారులకు ఆహారపదార్థములు దొరకకుండ కట్టుదిట్టములు చేసిరి. నదీమార్గములు, భూ మార్గములు, రైలుమార్గములు కాపలా కాచి వర్తకులను నిర్బంధించిరి. కాని యెట్లో ఆహారపదార్థములు మాయమగుచునే యుండెను. ప్రభుత్వమువారు పన్నాగములు పన్ని జనులలో విభేదములు కలిగించుటకు ఆరంభించిరి.

రామరాజు యుద్ధములందు జయాపజయములను పొందినవాడు. ఓడినప్పుడు కొండల కెగబ్రాకి, అనువగు తావులను చేరి, మరల యుద్ధము ప్రకటించుచుండెను. గ్రామోద్యోగులను, సివిలు ఉద్యోగులను బాధించలేదు. వారికి జరిమానాలు మాత్రము విధించెడివాడు. వారు సంతోషముతో జరిమానాలు చెల్లించుచుండిరి. రాజు వదలి పెట్టిన వారిని ప్రభుత్వము వారు శిక్షించసాగిరి. ఎటు అయినను మనకు కష్టములు, అవమానములు తప్పవుగదా యని ప్రజలు విప్లవకారుల యెడ విముఖులైరి. ప్రజలలో నిరుత్సాహ మధికమయినది.

ఇట్లు పదునారు మాసములు యుద్ధభీతి ప్రవర్తిల్లెను. విప్లవ కారులసంఖ్య పలుచబడెను. అందుచే కొత్తబలగము సమకూర్చుకొనుటకై రాజు పర్లా కిమిడి పోయెను. గంటన్నదొర నాయకత్వమును వహించెను. గంటన్న దొర తప్పత్రాగి ఒక యుంపుడుకత్తె యింటికిపోయెను. ఆ యుంపుడుకత్తె మోసముచేసి వానిని సర్కారువారికి పట్టీయిచ్చెను. గంటన్నదొర పరమవిధేయు డయినబంటు. తాగుబోతు తన మొక్కటే వానియవగుణము. ఆయవ గుణమును మాన్చుటకు రామరాజు ఎంతో ప్రయత్నించెను. చివరకా గుణమే వానికి ముప్పు తెచ్చినది.

రామరాజు పర్లాకిమిడినుండి బలగముతో తిరిగివచ్చి శంఖమును పూరించెను. కాని అంతయు నిరాశాజనకముగా పరిస్థితులు మారియుండెను. అస్సాము రైఫిల్సు పటాలము రంగమున ప్రవేశించెను. లార్డు వెల్లింగ్ డన్ మద్రాసు గవర్నరుగా విచ్చేసెను.

రామరాజును పట్టియిచ్చువానికి పది వేలరూపాయల బహుమానమును ప్రభుత్వము ప్రకటించెను. మన్యము చుట్టును రాకపోకలు ఆపివై చిరి. వర్తకము స్తంభించెను. రాజు విప్లవము నాపివై చితినని ప్రకటించెను. రాజు ప్రజలను రక్షించుటకును, పితూరీచారులకు తిండి సంపాదించుటకును అశక్తుడయ్యెను. 1924 మే నెలలో రామరాజు అనుచరుల నెల్ల చేరబిలిచి వారికెల్లరకు వీరమర