Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/440

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అల్లూరి సీతారామరాజు


కొంపలను తగులబెట్టిరి. సీతారామరాజును, నూరుగురు సవర ముఖ్యులను పట్టుకొనిపోయి, విచారణతంతు నడిపి, జెయిలుకు పంపిరి. కాని సీతారామరాజు జెయిలునుండి విచిత్రముగా అంతర్ధాన మయ్యెను. పర్లాకిమిడి, జయపూరు, గోదావరి అరణ్యములు అప్పుడాతనికి ఆటపట్టు లయ్యెను. సవరలకును, ఖాండులకునుతప్ప సీతారామరా జెక్కడ నున్నాడో ఎవ్వరికిని తెలియకుండెను. నమ్మిన బంట్లగు సవరలు, ఖాండులు రహస్యమును కాపాడిరి.

ఆటవికులు సాయుధ, నిరాయుధ వర్గములుగా నేర్పడిరి. సాయుధ వర్గము ప్రభుత్వముతో పోరాడునట్టిది. నిరాయుధ వర్గములో కార్మికులు, కర్షకులు ఉండుచుండిరి. నిరాయుధవర్గమువారు సమ్మెలుకట్టి, పన్నులు ఎగ బెట్టి విధి నిర్వహించెడు వారుగా ఉండిరి. ఈ విధముగా విప్లవము సిద్ధమయ్యెను. సీతారామరాజు ఈ విప్లవమునకు అధినాయకుడు.

ఈ విప్లవ సేన విండ్లు, బాణములు, కత్తులు, బల్లెములు ధరించి 1922 లో చింతపల్లి గ్రామమునకు పోయి పోలీసు స్టేషనును ముట్టడించెను. పోలీసువారు గడగడ వడకిరి. రాజు ఒక కుర్చీలో కూర్చుండి, అచ్చట ఎట్టి ఆయుధము లున్నవో ఇన స్పెక్టరు నడిగి తెలిసికొనెను. సీతారామరాజునకు కుడి, ఎడమ భుజములుగానున్న గాము గంటందొర, గాము మల్లుదొర అను గ్రాము సోదరులు పోలీసు ఠాణా యంతయు గాలించి, ఆయుధ సామగ్రి తెచ్చి, రాజు సమక్షమున ప్రోగుపరచిరి. రాజు వాటిని వివరముగా రికార్డు పుస్తకములో వ్రాసి, దస్కతు చేసి, తప్పుడు రికార్డులను చించిపారవై చెను. అచ్చట దొరకిన ఆయుధ సామగ్రితో సపరివారముగా రాజు వెడలిపోయెను. ఎవరిని హింసించలేదు, గ్రామజనము గుమిగూడి తమాషాగా చూచుచు నిలుచుండిరి. పోలీసులు గండము గడచిన దని, ప్రాణములతో బయటపడ్డామని ఊపిరిపీల్చిరి. తరువాత రాజు కృష్ణదేవిపేటలో పోలీసులను చెట్లకు బంధించి, స్టేషనులోని తుపాకులను గై కొని వెడలిపోయెను.

మొట్టాడం వీరయ్యదొర ఒక ధీరుడు. ఇతనిని “లాగ రాయి" పితూరీ జరిగినప్పుడు పట్టుకొనిపోయి నానాకష్టముల పాల్చేసిరి. వీరయ్యదొర తప్పించుకొనిపోయి అరణ్యములలో సవరల రక్షణలో రహస్యముగా నుండగా ప్రభుత్వమువారు వేగులవారిద్వారా గాలించి పట్టుకొని "రాజవొమ్మంగి" ఠాణాలో నిర్బంధించిరి. వెంటనే సవర నాయకులు ఠాణాపై దాడి సలిపి, కొట్టు పగులకొట్టి, వీరయ్యదొరను విడిపించిరి. అచ్చటి ఆయుధము లన్నియు దోచుకొనబడెను. వీరయ్యదొర విప్లవ సైన్యమునకు ఉపనాయకు డయ్యెను (1922). ఈ విధముగా 26 తుపాకులు, 2500 రౌండ్ల మందుగుండ్లు, 10 కత్తులు, 10 మందుసంచులు, 12 పెద్దగొలుసులు, 28 బయొనెట్లు, 9 ఖడ్డీలు - ఇంకను పోలీసుదుస్తులు, ఇతర వస్తువులు సీతారామరాజు వశమయినట్లు సర్కారు లెక్కలలో వ్రాయబడియున్నది.

విప్లవకారులు చర్యలు దొరతనము వారికి తెలియగనే వందలకొలది పోలీసులు అచ్చటికి పంపబడిరి. తెల్ల అధికారులు గూడ వచ్చిపడిరి. ఒక వైపున విప్లవ సైన్యము వీర మర్యాదలు పొందుచుండగా, వేరొకచోట ప్రభుత్వదళము ప్రజలను భయ పెట్టసాగెను. విప్లవకారుల గుంపుజాడ దొరతనమువారికి తెలుపువారు ఎవ్వరును కనబడకపోయిరి. పైగా తప్పుత్రోవ చూపుచుండిరి.

ఒకసారి రామరాజు నిరాయుధుడుగా నున్నప్పుడు సై నికుల కెదురయ్యెను. వారతనిని గుర్తింపజాలరైరి. తమ మూటలను మోయుమని రాజున కాజ్ఞాపించిరి. రా జొకమూటను నెత్తిపై పెట్టుకొనేను. ఆతని యనుచరులును మూటల నెత్తుకొనిరి. వారందరును అరణ్య మధ్యములో ఒకచోట విశ్రమించిరి. నడిరాత్రివేళ సైనికులు గాఢనిద్రలో నుండగా, వికృత కోలాహల మొనర్చుచు, ఆ మూటల నెత్తుకొని అనుచరులతో సీతారామరాజు అంధకారబంధుర మగు మనారణ్యమధ్యము చొచ్చెను. సైనికులు వితాకుపడిపోయిరి.

ఒకసారి 'ట్రెమన్ హోరు' అనువాని నాయకత్వమున సర్కారు సైన్యదళము అరణ్యములో పితూరీదారులను వెదకు చుండెను. విప్లవకారులు “రామరాజునకు జై" అని కేకలు వేసిరి. సైనికులు తుపాకులు సరి పెట్టుకొనునంతలో కూలీలు పరుగిడిపోయిరి. సైనికులు తుపాకులు కాల్చిరి. అయినను భయపడక విప్లవకారులు తుపాకులు కాల్చుచు ముందుకు వచ్చిరి. బాణవర్షము గురియించిరి. -