అలంపురము
గణపతి - అలంపురము పురమును ఏలినాడు పిదప 19 వ. శతాబ్దమునషాయారుల్ ముల్కు అను జాగీరుదారు కొన్నాళ్ళు ఏలినాడని పార్సీ లేఖనములు తెలుపు చున్నవి.
శాసనములు : అలంపురము ఆలయములలో పెక్కు శాసనము లున్నవి. అవి దక్షిణాపథ చరిత్రకు ముఖ్యముగా పశ్చిమాంధ్ర చరిత్రకు మిగుల ప్రధానమైనవి. ఇంతవరకు లభించిన శాసనములలో వినయాదిత్యుని లేఖనలే ప్రాచీనమైనవి.
ఇచటబాదామీ చాళుక్యులు వినయాదిత్య, విజయాదిత్య, సత్యాశ్రయులు, రాష్ట్రకూట ప్రభూతవర్ష, ధారావర్ష మహారాజులు, కల్యాణీ చాళుక్యులగు త్రైలోక్యమల్ల, జగదేకమల్ల, భువనైక మల్ల, త్రిభువనమల్లుల కాలమున వారి పట్టమహిషులు, ప్రధానులు, సామంత మండలేశ్వరులైన తెలుగుచోడ, వైదుంబరాజులు, కలచురి భుజబల మల్లుని కాలమునందలి అయ్యావొళై మార్వర్ స్వాములు కాకతీయ ప్రతాపరుద్రదేవునికాలపు వీరబలంజ్యసమయ ధర్మ ప్రతిపాలకులు,అం తెంబరగండ పెర్మాడి రాయని ప్రధాని అయితరాజు, అంతెం బరగండ రాయి దేవమహారాజు, విజయనగర సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయలు మొదలయినవారు వేయించిన శిలాశాసనము లనేకము లున్నవి, వీటి వలన వాటి విద్యాపీఠములు, వ్యాపార శుల్కములు, అర్చావిశేషములు, రాజవంశ ప్రశస్తులు, మొదలయిన అపూర్వ చారిత్రకాంశములు తెలియవచ్చు చున్నవి. ఇచటి వీరగల్లుల పై విగ్రహములపై గూడ లేఖనములుండి చారిత్ర కాంశములను వెల్లడించుచున్నవి.
దేవాలయ శిల్పము - ఆలంపురము