Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/414

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అలంకారశాస్త్ర చరిత్ర


ఆవశ్యకము లనిరి. కొందరి మతమున అలంకారములు అత్యంతావశ్యకములు కావు. “వనితాముఖము కాంత మయినప్పటికిని నిరలం కారమగుచో భాసిల్లదు. అటులనే కావ్యముకూడ రమ్యమయినను అలంకారముల నపేక్షించును" అని భామహుని మతము. గుణప్రాధాన్య వాధియు రీత్యాచారుడును అగు వామనునకు ఇది రుచింపలేదు. "కావ్యము యువతి యొక్క రూపమువంటిది. అది కేవల గుణాత్మకమయినను రసికులకు మనోజ్ఞమే. అలంకార యుక్తమగుచో మిక్కిలి రుచికరము. గుణహీన మగు కావ్యము యౌవనము గడచిన అంగన యొక్క శరీరము వంటిది. అలంకారములు మాత్రమే శోభాకరములు కావు" అని అతడు వాదించెను. అర్వాచీనాలం కారికులు కావ్య శరీరమునకు అలంకారములు అంగద - కుండల హారాదులవంటివే యను నభిప్రాయమును వ్యక్తికరించిరి.

అలంకారములను గుణములనుండి పృథక్కరించి భామహుడు భావికము అను నాలంకారమును గుణముగా పరిగణించెను. గుణములను మొదట చూపినవాడు వామనుడు. దండి దళగుణములను కూడ అలంకారములుగా పరిగణించెను. “కాశ్చిన్మార్గ విభాగార్థ ముక్తాః ప్రాగవ్య లంక్రియాః' వామనుని మతమున "కావ్యము యొక్క శోభాకరములగు శబ్దార్థ ధర్మములు గుణములనబడును. అవి ఓజః ప్రసాదాదులు, యమకోపమాదులు కావ్య శోభను అతిశయింప జేయును, కేవలాలంకారములు శోభాకరములు కావు. గుణములు నిత్యములు. అవి లేనిచో కావ్యశోభయే లేదు. అలంకారములు అనిత్యములు, అలంకార వాదము మిగుల ప్రాచీనమైనది. భామహుడు, ఉద్భటుడు, దండి, రుద్రటుడు మొదలగు వారు అలంకారప్రాధాన్యమును అంగీకరించిరి.

అలంకారములకును రసమునకును గల సంబంధము ప్రాచీనకాలముననే గుర్తింపబడినది. భామహుడు మహా కావ్యము సకల రసయుక్తము కావలెను" అనెను. భామహాదులు రసవత్, ప్రేయ, ఊర్జస్వి - ప్రభృతులను అలంకారములనుగా పరిగణించిరి. రసవదలంకారమును "దర్శిత స్పృష్ట శృంగారాది రసమ్" అని భామహుడు నిర్వచించెను. అర్వాచీనాలం కారికులలో పెక్కురు వీటిని అలంకారములుగా గణింపలేదు. వీరికి అలంకారములే కావ్యములో ప్రధానముగా గోచరించెను. వీరికి సునిశ్చితమగు ధ్వని సిద్ధాంతము (ప్రతీయమానార్థవాదః) సువిశదముకాకపోయినను, ధ్వనిమాత్రము వీరికి విదితమే. వీరి మతమున అలంకారములే ప్రధానములు.

భరతుని నాట్యశాస్త్రములో ఉపమ, రూపకము, దీపకము, యమకము, అను నాలుగు అలంకారములు పేర్కొనబడినను, అలంకారముల సంఖ్య క్రమముగా పెరుగుచు వచ్చెను. దండి 35 అర్థాలంకారములను పేర్కొనెను, యమకమును గూడ వివరించెను. మమ్మటుడు 61 అర్థాలంకారములను విశదీకరించెను. అర్వాచీనాలంకారికులలో కొందరు అలంకారముల సంఖ్య రెండు వందలకుపైగా నుండవచ్చును అనిరి. అలంకారమనగా ఉక్తి వైచిత్య్రము. ఈవై చిత్య్రము అనంతముగాన అలంకారములుగూడ ననంతములే యనుచో నతిశయోక్తి కాదు.

భామహుడు, దండి మొదలగువారు వక్రోక్తి అతిశయోక్తి అను నీరెండును అలంకారములకు మూలములని నుడివిరి. భామహుని మతమున “వాక్కు యొక్క వక్రార్థ శద్దోక్తి అలంకారోత్పాదకము. అలంకృతి యనగా వక్రాభిధేయ శబ్దాక్తి యగును." శబ్దార్థముల వక్రత యనగా లోకోత్తర రూపముగా వాటి అవస్థానమే. భామహుడు వక్రోక్తికి ప్రాధాన్య మిచ్చెను. "వక్రోక్తియే సర్వస్వము. వక్రోక్తి మూలముననే అర్థము విభావింపబడును. కవి వక్రోక్తికొరకు యత్నము చేయవలెను. వక్రోక్తిలేనిచో అలంకారమే లేదు.” అందుననే ఈయన స్వభావోక్తిని అలంకారముగా పరిగణింప లేదు. "స్వభావోక్తి రలంకార ఇతి కేచిత్ ప్రచక్షతే"' అని మాత్రము పేర్కొనెను. దండి అతిశయోక్తి సర్వాలంకార పరాయణమని వచించెను. "అలంకారాంతరాణా మష్యేకమాహుః పరాయణమ్ | వాగీశ మర్హ తాముక్తి మిమామతిశయాహ్వయామ్.” అలంకారములను వైజ్ఞానిక పద్ధతిచే విభజించిన ప్రథమ అలంకారికుడు రుద్రటుడు. ఈయన అలంకారములను వాస్తవ, ఔవమ్య అతిశయ,,శ్లేషమూలకములుగ విభజించెను. కొన్ని అలంకారములు రెండు వర్గములకు చెందును. ఉదా: ఉత్ప్రేక్షాలం కారము