Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/412

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అలంకారశాస్త్ర చరిత్ర

ప్రఖ్యాతము, ఉత్పాద్యము, మిశ్రము అనికూడ విభజింపబడినది.

4 శబ్దార్థములు, శబ్దశక్తులు: శబ్దములు వస్తువులను, భావములను బోధించును. అర్ధమును తెలుపగల సామర్థ్య మునే శక్తి యనుచున్నారు. శబ్దమునకు మూడుశక్తులు కలవు. అవి అభిధ, లక్షణ, వ్యంజన అనబడుచున్నవి. అభిధాశక్తి చే తెల్పబడు అర్థము వాచ్యార్థము అనబడును. దీనికే ముఖ్యార్థము, సంకేతికార్ధము అనికూడ పేళ్లు. లక్షణా శక్తి చే తెలుపబడు అర్ధము లక్ష్యార్థము. వ్యంజనా శక్తిచే బోధింపబడు అర్థము వ్యంగ్యార్థము. శబ్దము లన్నియు ప్రధానముగా వాచ్యార్ధమును తెల్పును. కొన్ని వాక్యములందు శబ్దమునకు వాచ్యార్థము మాత్రము చెప్పి కొన్నచో, అర్థము కుదరదు. అనుపపత్తి ఏర్పడును. అప్పుడు ఆ శబ్దమునకు సంబంధించిన మరియొక అర్ధము రూఢిప్రయోజనములనుబట్టి చెప్పబడును. ఇదియే లక్ష్యార్థము. వ్యంగ్యార్ధమనబడునది వాచ్య లక్ష్యార్థములకంటె భిన్న మైనది. వాక్యమునందలి పదములు తమతమ ముఖ్యార్థములను బోధించి విరతవ్యాపారము లయిన తరువాత ఏ శబ్దశక్తి చే రమణీయమయిన మరొక అర్థము వాటినుండి స్ఫురించునో అట్టి శబ్దశక్తి వ్యంజనావృత్తి యనబడును. శబ్దశక్తులనే శబ్దవృత్తు లనియు వ్యవహరించుచున్నారు.

5. కావ్యలక్షణములు : ప్రాచీనాలంకారికులు కావ్య లక్షణములను అనేక విధములుగా నిర్వచించిరి. శబ్దార్థములు రెండును కలిసి కావ్యమని భామహ, వామన, రుద్రట, వక్రోక్తి జీవిత కార, మమ్మట, హేమచంద్ర, విద్యానాథాదులు నిర్వచించిరి. శబ్దమే కావ్యమని దండి, అగ్నిపురాణకర్త, జగన్నాథ పండిత, చంద్రాలోకకారాదులు నుడివిరి, 'రసాత్మకమయిన వాక్యమే కావ్యమని అలంకార శేఖర కార, విశ్వనాథ, సరస్వతీ కంఠాభరణ కారాదులు చెప్పిరి.

కావ్యాత్మనుగూర్చి భిన్నాభిప్రాయములు కలవు. భరతుడు రసమును, వామనుడు రీతిని, ఆనందవర్ధనుడు ధ్వనిని, వక్రో క్తి జీవిత కారుడు వక్రోక్తిని, క్షేమేంద్రుడు వక్రోక్తి ఔచిత్యమును కావ్యాత్మగా వర్ణించిరి. మహిమభట్టు అను ఉద్దండ తర్కపండితుడు ధ్వనిని ఖండించి దాని స్థానములో అనుమానమును సిద్ధాంతీకరించెను. అతని ననుసరించు వారెవరును లేనందున అతనిది ఒక మతమని చెప్పుటకు వీలులేదు, వక్రోక్తి జీవిత కారుడు గూడ గణములో చేరిన వాడే.

రస సిద్ధాంతము: ఈ వాదమును ప్రప్రథమముగా ప్రతిపాదించినవాడు నాట్యశాస్త్రకర్త అయిన భరతుడు.అయితే అంతకు పూర్వము ఈ వాదము లేదని తలచ కూడదు. నాట్యశాస్త్రము ప్రధానముగా నాటక లక్షణమును తెలుపుచున్నది. ధ్వన్యాలోకమునకు, నాట్యశాస్త్రమునకు, వ్యాఖ్య రచించిన అభినవగుప్తుడు, నాట్యమే రసమని, రసమే నాట్యమని' వచించినాడు. కావ్యము దశరూపకాత్మక మే అనికూడ అతడనినాడు.ధ్వన్యాలోక రచన జరుగువరకు కూడ కావ్యమునకు రసముతో గల సంబంధము ఒక పద్దతి ప్రకారము వివరింపబడలేదు. ప్రాచీనాలంకార శాస్త్రకర్తలు రస ప్రాముఖ్యమును గూర్చి 'ఎరుగరు' అని చెప్పుటకు వీలులేదు.'సర్వాలంకారములు రసములోనే పర్యాప్తములు' అని దండి తన కావ్యాదర్శములో చెప్పినాడు. అతడు రసములను, స్థాయి భావములను బాగుగా ఎరిగినవాడు. భామహుడు రసతత్త్వమును సమగ్రముగ ఎరిగినవాడే కానిఅతడు కావ్యములో రసములకు ప్రాధాన్యమును ఈయలేదు. మొదటిసారిగా తన కావ్యాలంకార గ్రంథములో రసప్రశంస చేసినవాడు రుద్రుడు. రుద్రటునికి దాదాపు ఒక శతాబ్ది పూర్వపువాడైన మాఘుడు 'శిశుపాలవధ' కావ్యములో రసములను గూర్చి నాటక సందర్భములో వర్ణించెను. నాటకముతో. రసమునకు సంబంధము కలదు గనుక భరతుడు నాట్యశాస్త్రములో రసమును గూర్చి చర్చించెను. నాటకము చతుర్విధాభినయముల ద్వారమున రసాభివ్యక్తిని సామాజికునకు కలిగించును అని భరతుడు చెప్పెను.

నాట్యశాస్త్రము, దానిపై అభినవగుప్తుడు వ్రాసిన వ్యాఖ్యానము, సరస్వతీ కంఠాభరణము, శృంగార ప్రకాశము, దశరూపకము, శృంగార తిలకము, థావ ప్రకాశము, రసతరంగిణి - ఈ మొదలైన గ్రంథములు రసవాదమును సిద్ధాంతీకరించినవి. ఈ గ్రంథము లన్నింటిలోను రససిద్ధాంతమును గూర్చి కొలది భేదము చూచింబడినది. అన్నిటికన్న ప్రాచీనమైన నాట్య శాస్త్రములో