Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/407

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అలంకరణ కళ


ప్రసాధక రూపము (Decorative Form) : ఏ రూపమైనను ప్రధమదర్శనములో సంక్షిప్తముగ గోచరించును. అనగా గుండ్రముగానో, త్రిభుజముగానో, చతుష్కోణము గానో ఫలకములుగానో కనబడును. ఇదియే సంక్షిప్తరూపము, కాని దీనినే తదేకదీక్షతో తిలకించినదో అపుడు అనేకవివరములు గోచరించును. దానితోబాటు అనేక వంకలును, వికృతులును కనబడును. ఒక కమలమును చూడుడు. చూచినచో దాని సంక్షిప్త రూపము 'గుండ్రముగా కాన్పించును. కాని ప్రకృతిలోని విరోధశక్తుల వలన దాని దళములు మాడియో, ఊడియో, క్రమరహితముగా కనబడును.

చిత్రకారుడు ఒకానొక వస్తువు యొక్క ఆకృతి యందలి వికారమును తొలగించుటకై, ఒక సులభపద్ధతి నాశ్రయించును. దానికై మూల రేఖలను, రూపములను బోలు ఆకృతులను మలచును. దీనిచే సంగ్రహరూపములు సృష్టి యగును. కమలమును చిత్రించుటకు దానిరూపములు బోలిన వలయమును చిత్రకారుడు వ్రాసియందు రేకులు క్రమబంధమును చిత్రించును. దీనిచే శ్రమలేకయే దాని రూపము సులభగ్రాహ్యమగును. ఇదియే ప్రసాధక రూప మనబడును.

భూమికా బంధము ' : చిత్రించవలసిన భూమిని నిర్దేశించిన తర్వాత దానిలో చిన్నవియు పెద్దవియునైన అనేక అలంకార ఖండికలను కూర్చుటకు అవలంబింపవలసిన పద్ధతి బంధ మనబడును.

1. అన్నిటికంటె ప్రధానరూపము మొదట సాధారణముగా మధ్య భాగములోనైనను దానికి సమీపమునందైనను చిత్రింపబడును. పిమ్మట అంతకంటే తక్కువ ప్రాధాన్యముగల రూపము చిత్రించబడును. తుదియందు చుక్కలు మొదలగు అల్పాకృతులు అవసరమైనచో ఖాళీ స్థలములలో నింపబడును.

2. అలంకరణ చిత్రములో ప్రమాణములు (Proportions) పరిగణనీయములు కావు.

3. చిత్రితమైన భాగము ఎక్కువ స్థలమును ఆక్రమించి యుండవలయును. (కొన్ని చోట్ల చిత్రిత భాగము ఖాళీ భాగముతో సమానముగా నుండ వచ్చును.)

4. రంగులు, రేఖలు, ఛాయలవ్యత్యాసములు, పరస్పరముగా సుసంగతిలో నుండవలయును.

5. చిత్రములో స్థాయి ఉండవలయును.

పరి ప్రేక్ష ణము (perspective) సాధారణముగా అలంకార చిత్రములలో తక్కువ, అలంకారఖండములు ఒక దాని పై నొకటి చేరి కలిసిపోకుండుటకై ఖండిక లమధ్య భాగమున కొంత ఎడముంచవలయును.


6. అలంకరణ చిత్రములో చేయబడు వస్తువులను యథాతథముగ చిత్రించక అతిశయ రూపములు (Exaggerated forms) గా మార్చవలయును.

7. చిత్రకారుడు చిత్రకళాసూత్రములను పాటించుటతోబాటు స్వప్రతిభను ప్రయోజనానుసారముగా ఉపయోగించ వలయును.

అలంకరణములో సందేశముకన్న సౌందర్యమే ప్రధానమైనది. కావున వస్తు ప్రమాణముల నెట్లు మార్చినను చిక్కులేదు. అవి క్రమగతములైన చాలును. వస్తు ప్రమాణములందును, రంగులయందును, భావమందును కారణ మీమాంస తగదు. ఇది చిత్రకారుడు కన్న 'కల',