Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/328

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అమెరికను ఇండియనులు

ములో ఆమె ఉపయోగించిన ఆలేఖ్య పుస్తకములను (Sketch Books) తిలకించినచో అచట ఆమె కావించి యున్న చిత్రాఖ్యానమునందలి విశేష పరిశ్రమ తెల్ల మగును.

ఇట్లు ప్యారిస్ కు పిల్లగా వెళ్ళియున్న 'అమృత' చిత్ర కళయం దారితేరిన పడుచై భారతదేశమునకు 1934 సంవత్సరములో తిరిగివచ్చెను. ఇచ్చటికి రాక పూర్వము ప్యారిసునగరమందుగల భారతదేశ విషయకమైన ప్రచార ప్రభావమునుబట్టి ఆమె తన మాతృదేశమును తిలకింప నెంచి దానినిగురించియు, దాని సౌందర్యాతిశయమును గురించియు నానావిధములగు తియ్యని కలలు గాంచెడిది. కాని ఆమె భారతదేశమునకు తిరిగి వచ్చిన తరువాత ఇక్కడ ఆమెకు కనుపించిన దృశ్యములు నెత్తురులేని దేహాలు, సత్తువలేని జీవాలు. ఈ దృశ్యములే అమృత ఇచ్చట రచించిన చిత్రములలో ప్రస్ఫుటముగా ప్రతి బింబితము లయ్యెను. ఆమె జీవించియున్న కాలమందు ఆమె కళ యెంతమాత్రము మన్ననగాంచలేదు. పైగా నది అనేక విమర్శనలకును, పరిహాసములకును గురి యయ్యెను. వంగీయ కళావిమర్శకులు గూడ ఈమె శైలి పై దుమ్మెత్తి పోసిరి. ఐన నామె తన పట్టుదలను విడువక గట్టిగా తన శైలిలోనే చిత్రాలు చిత్రింపసాను. ఫ్రాన్సులో నున్నపుడు 'సిజాన్' 'గాగిన్' అను నిరుపురు ఆమెకు సమకాలికులు గాకున్నను వారి ప్రభావ మామె చిత్రములయందు ముద్రిత మయ్యెను.

షేర్ గిల్ 29 వ యేట డిసెంబరు 1941 లో మృతినొందెను. ఆమె మరణానంతరమే ఆమె చిత్రకళకు విమర్శకుల పొగడ్తలచే అధిక ప్రాశస్త్యము లభించెను. ఆమె కళ బొంబాయి మున్నగు ముఖ్యపట్టణాలలోని చిత్రకారుల ప్రశంసలకు పాత్రమయ్యెను. ఆమె భారత చిత్రకళారంగములో నొక ఉత్తమ నారీరత్నముగా వెలు గొందెను.

ఎల్లోరా అజంతా గుహల యొక్కయు, కొచ్చిన్ భిత్తి చిత్రముల యొక్కయు, తదితర ప్రాచీన భారత శిల్పముల యొక్కయు ప్రభావము షేర్ గిల్ చిత్రకళపై విశేషముగా ప్రసరించెనని కాథల్ ఖండల్వాలా అను నతడు ఆమె జీవితచరిత్రలో పేర్కొనియున్నాడు. ఆమె దాదాపు అన్ని చిత్రములను తైలవర్ణములలోనే తప్ప, టెంపరా మీడియంలో చిత్రించినట్లు తెలియుట లేదు. ఆమెయొక్క చిత్రములు వర్ణప్రాధాన్యముకలిగి ఒకానొక విధమయిన మాధుర్యమును వ్యక్తీకరించును. ఆమె వ్రాసిన అన్ని చిత్రాలలో ప్రధానముగా నామెకు ప్రఖ్యాతి తెచ్చినవి 30 చిత్రము లనవచ్చును. వాటిలో (1) విశ్రాంతి, (2) ఏనుగుల ఈత, (3) 'బ్రహ్మచారులు,(4) కథలు చెప్పుట, (5) పండ్ల నమ్మువారు, (6) ముగ్గురక్క చెల్లెండ్రు. నవవధ్వలంకరణము అనునవి ముఖ్యముగ పేర్కొనదగినవి. ఆకృతిలోని వివరములను కుంచిం చుటలో ఈమె గడించిన నేర్పు ఎన్నదగినది. అమృత షేర్ గిలు తన ప్రత్యేక శైలినిబట్టి భారత చిత్రకారశ్రేణిలో "అమృత"త్వము నొందియున్నదని ఆమెకుగల అఖండ ప్రఖ్యాతియే సాక్ష్య మిచ్చుచున్నది.

కొం.శే.

అమెరికను ఇండియనులు  :- కొలంబసు అమెరికాను కని పెట్టినప్పుడు, తాను ఆసియాలో నొక భాగమునుగాని, హిందూదేశమునుగాని చేరుకొనినట్లు విశ్వసించెను. కనుకనే 1493, ఫిబ్రవరిలో అతడు వ్రాసిన "లేఖలో ‘నాతో నున్న ఇండియనులు'అని వ్రాసియున్నాడు. ఈ విధముగా నూతన ప్రపంచమునందలి ఆదిమ నివాసులు 'ఇండియనులు' అనియు హిందూ దేశస్థులకంటె వీరు భిన్నులని తెలుపుటకై 'అమెరికను ఇండియనులు' అనియు పిలువబడుచుండిరి. 'అమెరికను ఇండియనులు' అను పదము పెద్దదిగా నుండుటచే ఒక ప్రసిద్ధ అమెరికా నిఘంటుకారుడు ‘అమెరిండ్సు' అను పదమును సూచించెను. కొందరు అమెరికా దేశస్థులును, ఐరోపాలోని మానవజాతిశాస్త్రజ్ఞులును, మధ్య అమెరికా, మెక్సికో, పెరూ మొదలగు దేశముల నాగరకతను నిర్మించిన ప్రజలను, ఇండియనులనుండి ఇప్పటికిని వేరు చేయు చున్నారు. మరికొందరు ఎస్కిమోలను భిన్న జాతివారినిగా భావించు చున్నారు, కాని, శారీరక, సాంస్కృతిక, భాషా విషయక దృష్టితో చూచినయెడల, అమెరికా దేశపు ఆదిమనివాసులను, వారి సన్నిహిత అనాగరక జాతులవారిని కలిపి, 'అమెరికాదేశపు ఇండియనులు' అను పేరుతో, పోవెలు, బ్రిస్టను అను వారు వ్యవహరించుట ఉచితముగా నే