Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అజంతా


ఈ చిత్రలేఖన మత్యుత్తమ వైజ్ఞానిక లక్షణములను కలిగి యుండుటేకాక మార్ధవ సౌందర్య చిహ్నితమైన పనితనమును గూడ ప్రదర్శించుచున్నది. ఈ గచ్చు చిత్రమున పసుపుపచ్చమన్ను, జేగురు మన్ను, ఆకుపచ్చ మన్ను(Terra Verta), దీపపు మసి మున్నగునవి రంగుల కుపయోగింప బడినవి. అధరోష్ఠమునకును, కంటి కొలుకులకును చిత్రకారు డెఱ్ఱమట్టినుండి (Red-ochre) తయారుచేయబడిన ఒకరక మైన కెంపు వన్నెను వాడియున్నాడు. వెలుతురు నీడలను సూచించుటకు ఒకటవ రెండవ గుహ లందలి తరువాతి గచ్చు బొమ్మలలో కనవచ్చు లేత ముదురురంగు లుపయోగింపబడి యుండలేదు. దేహముల బాహ్యరేఖలు ముదురు కెంపులో కాని, నలుపులో కాని వ్రాయబడినవి. చిత్రణము స్థిరమును లలితమునై యున్నది. శరీరములు నిశ్చల మృతవిన్యాసములతో కాక జీవకళతో నుట్టి పడుచున్నట్లుగా చిత్రింపబడియున్నవి.

క్రీ. పూ. మొదటి శతాబ్ది యందలి చిత్రలేఖనము :తొమ్మిదవ గుహయం దెడమభాగమున గల స్తంభములపై నున్న చిత్రములలో నొక్క చిత్రము మాత్రమే క్రీ. పూ. మొదటి శతాబ్దిలో చిత్రింపబడినట్లు తలపబడు చున్నది.

ఈ గచ్చుబొమ్మ భీమబలుడైన ఒక పౌరాణిక గోపాలుని కథను సూచించు చున్నది. అతడు కంఠములను, తోకలను పట్టుకొని క్రూరములైన వన్యమృగముల చలనములను గూడ అరికట్ట గలడు. ఆ గోపాలుడు మిక్కిలి సుందరాకారుడు. అతని విలాస ప్రవృత్తిలో మధురా బృందావన శాద్వలములందు గోవులను కాచిన గోపాలకృష్ణుని సాదృశ్యము కొంతవరకు కనవచ్చు చున్నది. ఈ సన్నివేశమే కుద (Kuda) నాసిక్ మున్నగు నితర స్థలములందు కూడ చెక్కబడి యుండుటచే ఆకాలవు బౌద్ధ చిత్రకారులయందు . అది బహుళ ప్రచారము నంది యున్నట్లు కానబడుచున్నది.

ఈ గచ్చుబొమ్మ చైత్యనిర్మాణముతో సమకాలికమై యుండుననుట స్పష్టమె. క్రీ. పూ. మొదటి శతాబ్దిలో కూడ అజంతా చిత్రకారులు తమ కళా ప్రతిభ భావింప జాలిన ఏ విన్యాసముతోనైనను బొమ్మలను చిత్రింప గలిగియుండుటయు, శారీరక చలనమును, సంఘర్షణమును సునాయాసముగా సూచింప గలిగియుండుటయు వింత కలిగించును.

వ్యవధానము  :- క్రీ. పూ. మొదటి శతాబ్దినుండి క్రీ. శ. 3వ శతాబ్ది వరకు భారతదేశ చిత్రకళా చరిత్రలో కొంత వ్యవధానమున్నది. తొమ్మిదవ పదవ గుహలలోని కొన్ని చిత్రములకు ఆధార రహితముగనే కొంత ప్రాచీనత నాపాదించుచు, కొందరు గ్రంథకర్త లీ వ్యవధానము లేదని చెప్పుటకు యత్నించినారు. శిల్ప వాస్తు కళా చరిత్రము లందు సైతము అట్టి వ్యవధాన ముండుటను పరికించి చూచినచో, అజంతాలో సుమారు నాలుగు శతాబ్దుల కాలము సృజనశక్తి లోపించియుండెనని నిశ్చయించుట యుచితముగా ఉండును. శాతవాహన సామ్రాజ్యము యొక్క కేంద్రము అమరావతికిని, ఆ సామ్రాజ్యమునకు సంబంధించిన ప్రాగ్భాగమునకును, మారుటయో క్షాత్రపులకును, ఆంధ్ర శాతవాహనులకును నిరంతర యుద్ధములు జరుగుచుండుటచే శాతవాహను లా భాగమున శ్రద్ధవహింపకపోవుటయో, క్షాత్రవులు సైతము స్థిరపడి లలితకళాదులను పోషించుటకు తగిన అధికారమును సంపాదింపజాలకపోవుటయో దానికి కారణమై యుండును.

క్రీ, శ. మూడవ శతాబ్దిలోని చిత్రలేఖనము  :- పదవ గుహలోని కుడిగోడ మీద చిత్రింపబడిన షడ్డంత జాతక ముతో ఒక శాసనము కూడ చిత్రితమై యున్నది. అది బహుళః మూడవ శతాబ్దిదని నిశ్చయింపబడిన ఆ చిత్రముతో సంబంధించినదేయై ఉండును. అందుచే ఈ చిత్రము భారతీయ చిత్రలేఖన చరిత్రలో తరువాతి గొప్ప ఘట్టముగా కానబడుచున్నది. దాని నిచ్చట కొంత సవివరముగా పరిశీలన చేయవచ్చును.

చిత్రకారుడు షడ్డంత జాతకములోని సర్వ సన్నివేశములను చిత్రించినాడు కాని వాని క్రమము కొంత మార్చినాడు. అతడు సక్రములతోను, అజగరములతోను(Pythons) గూడిన బురద నేలలు గల దుర్గమమైన అడవిలోని గజముల వన్యజీవితముతో ఆరంభించి, మానవమూర్తులతో నిండిన ప్రాసాద దృశ్యములతోను, ఒక స్తూపము తోడను, విహారముల తోడను గూడిన పవిత్రక్షేత్రమునకు పోవుచున్న రాజాంతఃపుర పరివారము