పుట:శ్రీ రాణా ప్రతాపసింహ చరిత్ర దుర్భాక.pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారి సమీక్ష.

(భారతి నవంబరు 1943.)

రాణాప్రతాపసింహ చరిత్ర తలమానికమువంటి గ్రంథము. ఆహృదయ మీ రాణాప్రతాపచరిత్రయందు మహాభారతమునం దెంత యున్నదో యంత యున్నది. భారతము పూర్వకాలము కథనే చెప్పును. అందులోనున్న ధర్మము మాత్రమే మనజాతిది. అవిషయము ద్వాపరయుగమునాఁటిది. మనపరిస్థితులతో సంబంధము లేనిది. ప్రతాపసింహచరిత్ర మనధర్మమునేగాక మన పరిస్థితులను గూడ చెప్పును. ప్రతాపసింహునికన్న ధర్మరాజాదు లేమియు నెక్కువవారు కారు. వస్తురమ్యతకుగాని, కథాచచుత్కారమునకుగాని, ఇందలి భిన్న పాత్రల భిన్న తావిశిష్టతకుగాని భారతమున కీ గ్రంథము తీసిపోదు. వస్తు విటువంటిది. కవి యెటువంటివాఁడు? వ్యాసునకు తిక్కన్నకు నెంత వీరరసావేశ మున్నదో యంత వీరరసావేశము గలవాఁడు. న న్నెవరైన భారతములోని యుద్ధ పంచ కము తిక్కన్నగారు వ్రాయకయుండుచో మఱియెవరు వాయగల్గుదురని ప్రశ్నించినచో నేను “రాజ శేఖరశతావధానిగా” రని సమాధానము చెప్పెద. యుద్ధవర్ణన యెచ్చటచూచినను, తిక్కన్న గారి రచనతో దులదూగుచున్నది. ఈగ్రంథము అస్వతంత్య్రజాతి కొక స్మృతిగ్రంథము వంటిది.

రాణాప్రతాపునకు మహాత్మునకు గల సామ్యము భారతజాతికి గల యస్వతంత్రత. మహాత్మునిది కత్తిలేని సాత్వికపు పోరు. ప్రతాపునిది కత్తి గల సాత్త్వికపు పోరు. నేఁటి సత్యాగ్రహమునకు అనాఁటి ప్రతాపుని యుద్ధ ధర్మమునకు భేదమే లేదు. ఈ రచన భారతమును దలపించుచున్నది. ఈకవి చాల చోట్ల నన్నయ్య గారిని పోలినట్లు వ్రాయును . ప్రతాపునిశౌర్యాగ్ని రాజి నుండి యత్యుగ్రమై పాతికయేడ్లు తగుల బెట్టిన ఘట్టము. ఆశౌర్యము, ఆయుద్ధములు, ఆప్రతిజ్ఞలు అవి యన్నియు వ్రాసినచో పట్టరానంత గ్రంథ మగును. ఈకవిసార్వభౌముఁడు ఈఘట్టము చిత్రచిత్రములుగా వ్రాసెను. మొదటనే చెప్పితినిగదా ఈగ్రంథము యుద్ధ పంచకమువలె నున్నదని.