పుట:శ్రీ రాణా ప్రతాపసింహ చరిత్ర.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

13


క॥ ఉత్తమ మితివృత్తము సము
    దాత్తము చిత్తూరుపురి ప్రతాపుఁడు ధీరో
    దాత్తుఁడు కైతము మెత్తని
    దిత్తఱి మెత్తురని తలఁతు నెల్లబుధేంద్రుల్.
    
శా॥ నా ధారాళ కవిత్వమందుఁ గల విన్నాణంబు లట్లుండ, నీ
    గాధల్ కర్ణయుగంబుఁ బట్టుకొని యాకర్షించు లోకంబు; వి
    ద్యాధుర్యుల్ విని చిఱ్ఱు బుస్సనక యాహ్లాదింత్రు; విశ్వైక కీ
    ర్త్యాధారంబులు రాజపుత్రనృప శౌర్యావార్య హేలాకళల్.
    
శా॥ ఈపొత్తంబునఁ గొంచెమేనియు గుణంబెందేనిఁ బెంపొంద శ్లా
    మాపీరంబది ‘జేమ్సుటాడ్డుదని లోకంబెంచి హర్షించుఁగా
    దేపట్లైన వికాసమూడి రసమెంతేఁ దక్కువై యున్న నా
    లోపంబంతయు నాదిగాఁ దలఁప గేలు మోడ్చి ప్రార్థించెదన్.
    
మ॥ వినమే మున్ను ప్రతాపుడంతటి మహావీరుండు లోకంబునన్
    గనుపింపండని పూజ్వులెల్లఁ బలుకంగా; నట్టి రాణా ప్రతా
    పుని గీర్తించెడుపట్ల నెట్లు కవనంబు సాఁగఁగాఁ జేతువో
    నిను సేవింతు విరించిరాణి' సుమపాణీ' వాణి! నన్నోమవే.
    
సీ॥ రచియించియుంటి వీరమతీచరిత్రంబుఁ
              దిరుపతి వేంకటేశ్వరులు మెచ్చఁ
    గృతి యొనర్చితిఁ జండనృపమౌళికధ దేశ
              చరితమున్ శోధించి సరసు లలర
    దగఁగూర్చియుంటిఁ బద్మావతీవిజయంబు
              వీరంబు హాస్యంబు వెల్లి విరియ
    వ్రాసియుంటి సమగ్ర రామాయణము నాట
              కములుగా విబుధలోకములు పొగడ
              
గీ॥ నిన్ని యొకయెత్తు మఱి ప్రతాపేంద్రుచరిత
   మొక్కయెత్తు సుధారసంబొలుకుచుండ
   నొక్కచూ పెక్కుడుగాఁ జూచి యుద్ధరింపు
   శైలరాజేంద్రకన్య' సౌజన్యధన్య!