పుట:శ్రీ రాణా ప్రతాపసింహ చరిత్ర.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చివరకు ప్రతాపుఁడు దేశమే వదలిపెట్టి పోఁదలఁచెను.- భామాసాహి వచ్చెను. ధనమిచ్చెను. ప్రతాపుఁడు మఱల సైన్యము సమకూర్చెను. మఱల తన రాజ్యమంతయు గెలుచుకొనెను.

అంతయు నైనది. కాని, ఓయి ప్రతాపా శ్రీనృపలోక జగద్గురూ! మాయప్పా!

సీ॥ అక్బరు విశ్వంభరాధీశ మౌళిది
             ధనసేవ నీయది దైవసేవ
    యాతని దెల్లప్పు డాత్మవైభవము నీ
             యది నిరంతరము నాత్మావ బోధ
    మతని కుండినదెల్ల నైహిక బలము ని
             న్నాశ్రయించినదెల్ల నాత్మబలము
    నతని దందఱ కన్ను లలరించు భోగంబు
             నీది జగముమెచ్చు నిండుత్యాగ
             
గీ॥ మతఁడు జగము గెలిచె నాత్మ గెల్చితివి నీ
    వాతఁ డితర జనుల నాశ్రయించు
    నీవు స్వాశ్రయుఁడపు నీకు నాతని కెన
    లేదు జగము క్రిందు మీఁదులైన.

ఇంక నొకమాట. ఈరసప్రవాహములో ప్రవాహము వెంటనే పోయి విమర్శించితిని. వేరొక గతిలేదు. కాని ప్రవాహము నడుమను, తీరము వెంటను, నంగుళ మంగుళమును గల దామరపూలు, కలువపూలు, నీటి బెగ్గురులు మొదలైన శోభలు పాఠకులే చూచుకొనుచు చదువుకొన వలయును. ఇది పరమోత్తమ గ్రంధములలో నొకటి.

—♦♦♦♦§§♦♦♦♦—