పుట:శ్రీ రాణా ప్రతాపసింహ చరిత్ర.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8

భారతము పూర్వకాలము కధనే చెప్పును. అందులో నున్న ధర్మముమాత్రమే మనజాతిది. ఆ విషయము ద్వాపరయుగము నాఁటిది. మన పరిస్థితులతో సంబంధము లేనిది. ప్రతాపసింహచరిత్ర మన ధర్మమునే గాక మనపరిస్థితులుగూడ చెప్పును. అగ్బరు చక్రవర్తితో పాతికయేండ్లు హోరాహోరి పోరాడి-స్వదేశము వదలి-కొండలలో గుట్టలలో నివసించి తిండిలేక గడ్డిరొట్టెలు తిని దైవవశమున మఱల స్వాతంత్య్రము సంపాదించిన మహాపురుషుఁడు, రాణాప్రతాపుఁడు. ఆయనకన్న ధర్మరాజాదు లేమియు నెక్కువవారు కారు. వస్తురమ్యతకుఁగాని, కథా చమత్కారమునకు గాని, ఇందలి భిన్నపాత్రల భిన్నతా విశిష్టతకుఁగాని భారతమునకీ గ్రంధము తీసిపోదు.

వస్తు విటువంటిది. కవి-యెటువంటివాఁడు? వ్యాసునకు తిక్కన్నకు నెంత వీరరసావేశ మున్నదో యంత వీరరసావేశము గలవాఁడు. వెనుకటికి బ్ర॥ శ్రీ॥ చెళ్లపిళ్ల - వెంకటశాస్త్రిగారిని ఎవరో ప్రశ్నించిరట "భాగవతము పోతన్నగారు వ్రాయనిచో, మఱి వ్రాయుటకు సమర్ధు లెవరని, కాసుల పురుషోత్తమ కవియని వారే సమాధానము చెప్పిరట నన్నెవరైన భారతము లోని యుద్ధపంచకము తిక్కన్న గారు వ్రాయకయుండుచో మఱియెవరు వ్రాయఁగలుగుదురని ప్రశ్నించినచో నేను “రాజశేఖర శతావధానిగారని సమాధానము చెప్పెద. ఈ గ్రంధములో చివరి నాల్గశ్వాసములు యుద్ధము తప్ప వేఱే లేదు. యుద్ధవర్ణన మెచ్చటచూచినను తిక్కన్న గారి రచనతోఁ దులదూగుచున్నది.

ఈ గ్రంధము అస్వతంత్ర జాతికొక స్మృతిగ్రంథము వంటిది. రాణా ప్రతాపుని భద్రాకరణ ప్రతిజ్ఞ చూడుఁడు............ఈ ఘట్టము ద్వితీయాశ్వాసములో నున్నది. ఈ ఘట్టము చదివినచో పారతంత్య్రజాతికి ఇది స్మృతిగ్రంధ మన్నమాట కర్ధము తెలియును.

రాణాప్రతాపునకును, మహాత్మునకు గల సామ్యము భారత జాతికి గల యస్వతంత్రత, మహాత్మునిది కత్తిలేని సాత్త్వికపుపోరు - ప్రతా పునిది కత్తిగల సాత్త్వికపుపోరు. ప్రతాపసింహుఁడు అక్బరును జయింప