పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/14

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

xiii

కొన్నాఁడు గదా. (27వ వచనము.) శ్రీవేంక టేశ్వర చరణారవింద మహిమను వర్ణింపఁ దలంచుచుండ 'నొక్కనాఁడు' అని మరల (శ్రీ పెరుంబూదూరు - ఇత్యాది వంటి వచనమునే ఇంక కొంతమార్చి పెంచి) వ్రాసినాడు. 'కర్ణాట తుండీర చోళ పాండ్య దేశాధీశముఖ నిఖిల ధరణీవరమణిదత్త మత్తేభ ఖత్తలాణిక పల్యాంకి కాందోళికాది చిరత్నరత్నఖచిత రుచిరాభరణగణ ప్రకాశిత విభవుండును, సద్గుణ ప్రభవుండును, కార్యఖడ్గ పటిమధురీణుండును చతుష్షష్టి విద్యా ప్రవీణుండును, సనక్షత్రా త్రినేత్రోద్భవోపమానాచ్చ ముక్తా గుళుచ్చచ్ఛవి సంకీర్ణ కర్ణ భూషా విశేష వదనుండును, దిగంతాయాత విద్వత్కవి వ్రాతబంధు జనావన సదనుండును.........ప్రభుసందేశ సకల లోకోపకార కృత్ర్పచారుండును, ......... అసాధారణ మేధా ఘటిత మంత్ర తంత్ర సంధానా బంధన గంధవాహ బాంధవ నిర్గంధిత గంధాంధ దండనాథ యూధ స్కంధాపార పారా వారుండును, ...... [1]పరస్త్రీ, పరధన పరాఙ్ముఖశీలుండును, ......నగునేను బహువిధభోజ నామూల్య జాంబూనదాంబర సార గంధసార రుచిర విచికిల ఘన సార తాంబూల ప్రియకామినీ సంగీత గోష్ఠీ సుమశయ్యాష్ట భోగాభోగ సంగతుండనై, హంసతూలికా తల్పంబున వేకువఁ దేకువ సుఖసుప్తి నున్న సమయంబున” ఇదంతయు రాజాశ్రయము చేతను “నరస్తుతి’ వలనను వచ్చినదే.

అట్లనుటచేత దైవభ క్తిలో ఎవరికిని తీసి పోయినవారు కారు కవులైన రాజామాత్యులు. ఈ వెంకటకవియు వేంకటేశ భక్తుఁడు. పైన చెప్పుకొన్న విధముగా నీతఁడు “సుఖసుప్తి నున్న సమయంబున వేకువజామువేళ బాలవేంకట శౌరి ప్రత్యక్షమై’ ప్రబంధరాజమును అంకితము కోరినట్లును ఈతఁడు పరమానందభరితుఁడై ఆట్లే యొనరించినట్లును కలదు. తిక్కన మొదలు నేటివరకు కూడ మన యాంధ్రకవులకు ఇట్టి స్వప్నములు క్రొత్తకాదు. దీనిపై వ్యాఖ్య యనవసరము. మన కవులలో భక్తులు లేరాయేమి ?

  1. ముందు 'కామినీజన పంచ బాణుఁడ'ని చెప్పు కొన్నాఁడేయన్న , ఆకామినులు ఇందుచేత కులస్త్రీలు కారనియు, భోగకాంతలనియు, ఈయన ధూర్జటివంటి వాఁడనియు, వేశ్యా సంపర్కము శ్రోత్రియునికి నిషిద్ధమే గాని అమాత్యునికి కాఁదనియు ఒక రహస్యము తోఁచుచున్నది.