పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

10

గృహమేధులు తమతమ ముంజాపడుల నీనకఱ్ఱబద్దలు చీరుచు మామిడి జీడిమామిడి మఱ్ఱి జువ్వి రావి మొదలగు వృక్షంబుల పర్ణంబులం దెచ్చి భోజనభాజనంబులుగాఁ గుట్టుచుండ మడిసంచులు వీపుల వ్రేల బుడిచెంబులమూతుల కంగవస్త్రంబులు గట్టి మొలల బిగించి తల నొక ప్రాతశాలువ జుట్టి యొంటి పొరయట్టచెప్పులం దొడిగి దర్భాసనంబులు వీపుల కడ్డంబుగా జొప్పడ నేతెంచి పరదేశులమని మహావినయంబుఁ దోపం జెప్పి యల్లనొకచో గూర్చుండి యాశీర్వచనవసనం దొడగుకొనినం జూచి మాయింట భోజనంబు సేకూరదని యెన్ని విధంబులం జెప్పిన వినక నానాప్రకారంబులం బ్రార్థింప నెట్టకేని యంగీకరించిన తోడవఁదమ కత్తెసరని మెల్లమెల్లగా జారవిడిచి చెప్పి స్నానంబు సేసి మడికట్టుకొని సంధ్యావందనాదికృత్యంబులు నిర్వర్తించి దేవతార్చన చేసి ప్రొయిమీదనున్న తప్పెల దింపుకొని పచ్చడి మజ్జిగలతో గడుపునిండ సాపడి యెద్దే నరుగుమీదం బండికొని గుఱవెట్టు పాంథవైదికశిఖామణులునుంగల్గి యత్యంతసౌఖ్యాస్పదంబయి నా బాల్యదశ ననేక వినోదంబు లనుభవించిన పల్లెటూరగు అల్లూరగ్రహారంబు స్మరింపక నామనం బన్యంబు గ్రహింపనేరదది యెట్లనిన.

శా . శ్రీలం జెన్నగు నాలమందలును దత్క్షీరంబులున్ వెన్నలున్
     జాలన్ మీగడలున్ భుజించి పరమైశ్వర్యంబు వేఱొక్క టీ
     భూలోకంబున గాన కెప్డును మహాభూతప్రభావంబులన్
     లోలోనం గడు మెచ్చి రంజిలితి నల్లూ రగ్రహారంబునన్.

ఉ . పచ్చలఁ బోలు వర్ణముల • పై పయి నిండుగ గాచి గొల్గుపం
     డ్లొచ్చెములేక చిట్టడవి • నొక్కమొగిన్ బగడాలు నిండుగా
     గ్రుచ్చినయట్ల తోప నదిగోయని యెచ్చటలేని సంతసం
     బచ్చుపడంగఁ గోసిన సుఖాతిశయంబు గణింప శక్యమే.

మ. అహహా నామది నేటికి స్మఱపు రాదాయావు లా లేగ లా
    మహిషీవ్రాతము సజ్జచేల నడుమన్ • మంచెల్ దదారోహణ
    స్పృహలున్ గూయనుచున్ గడున్ వడిసెలన్ • జేయార్చి యేయన్ క్రియా
    మహిమం జిల్కలు లేచి కూయుచు నభోమార్గంబునం బాఱుటల్.

ఉ. వేసగి నెండతాకునకు • వేసర నీయక లేగదూడలన్
    బీసగి డొంకలం దిడిన వేళ గనుంగొని పోయి యాత్మ ను
    ల్లాసముమీర నందుఁ బదిలంబుగ మేపగ లేతపచ్చికన్
    గోసిన నాటి తుష్టికిని • గోటిధనంబు సమంబె యారయన్.