పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

9

లాడుచు మెల్లమెల్లనంబ్రాకు బెంజేరుగున్నలకు బెదరి కేకలువైవఁ జేలదాపు పుంతవెంటం బోవుచు మంచెకుం గట్టిన యంచెదుడ్ల విరగలాగి పలుదెబ్బలం జావంగొట్టి చేలగట్ల కీడ్చిన యుపకారంబునకుం బ్రత్యుపకారంబుగా నిచ్చిన కంకులం గొని నలిపి వడిగట్టి యిండ్లకుంజను బాటసారుల నయ్యా! యేమి తెచ్చితివని యొడిబట్టి విడలాగు పసిబిడ్డలును

పసిబిడ్డ లేపుమీరి గుంపులుఁగూడి మెట్ట పుట్ట చెట్టు చేమ లనక చిఱుగోచులు వ్రేలాడ సన్నపాటి యూటికఱ్ఱలం జిఱుతబిళ్ళలం జేతులంబూని యాటలాడ జొచ్చి యలసి నడిప్రొద్దుల కిసుకబొందలకుం జేరి డిగ్గి జలకంబులాడి మేనులు సూర్యాతపవశంబులు చేసియు విడువని మంటిచారికలు వీపుల గాన్పింప నిండ్లకు జేరిన బండ్లు గొఱకుచు వెఱపించి కొట్టంబోపు తల్లుల కడ్డపై వంగివంగి కఱ్ఱబట్టుకొనుచు చిన్నబిడ్డల కేమి తెలియు నూరుకొమ్మని వెడవెడ ముసలి మాటలఁ గోడండ్ర జంకించు ముసలమ్మలును

ముసలమ్మల యొద్దంజేరి నీతు లుపన్యసించుచు కావడిపెట్టెలం గాజుకుప్పెల నించిన కాలువ నీరు గంగోదకంబని నమ్మించి నెత్తింజల్లి బొమ్మలపటంబు విప్పి యేలపాటలు పాడుచు యెలుంగెత్తి యర్థంబులు సెప్పుచు మగనిప్రక్క రామహరే యను పల్లవి ననుసంధించుచుఁ బైటకొంగునం గట్టి వీపులం దగిలించుకొనిన పసిబిడ్డనుం జూసి ముద్దీయడుగ కాశికావిళ్ళ ముద్దరాండ్రకుం జేటలెత్తి కాపెతలు చాటుగా దివిచి యిచ్చు చోడె కొఱ్ఱ చామ సజ్జ వరిధాన్యంబులును

వరిధాన్యంబుల నూర్చి రాసిచేసి కొల్పించి సంచులం బోసి కుట్టి ఎద్దు దున్న వీపునం గత్తళంబులు పన్నిగంతవైచి శెలగడంబులు బిగించి యెత్తి కదాడంపు దుడ్లం బుజాలనిడి పెరికాటంబుసేసి యిండ్లకుం గొంపోపు నెడ పునాస వ్యవధి గడచిపోయినదని కాపుల నడ్డగించి కలహంబులు వెట్టుకొను పెట్టుబడి కోమటులును

కోమటియింటికిం బనుపు కొమ్ముల్లిపాయ మెఱపకాయ చింతపండుప్పుగల్లనుచు వచ్చి ధాన్యంబులు దెచ్చి క్రుమ్మరింప వెల్లకాయ పొల్లు గుల్లయని చెఱగి చెఱగి సోలంబోసి చూడు తలగీతయని కాని దుగ్గాని వి లువకట్టు గట్టువాయి కోమటికొమ్ములతో బలు గతులఁ బోరాటములు సేయు కాపు గొల్ల గవల ఈడిగ మాల జవరాండ్ర దొలంగు తొలంగుమని బోకరించి గొణిగికొనుచు దారింబోవు జలాహరణవతులగు స్మార్త వితంతువులు గుడ్డ గుల్ల చిళ్ళ పెల్ల పెంకులం ద్రొక్కి వానిం దిట్టితిట్టి పునస్నాన ప్రయత్నంబులు సేసి నూతి కేగి తోడు భాండశతంబునకుం బట్టు కాలంబువలన మధ్యాహ్నంబు దాటినంగని వంటలు కాలేదని కోపించి యుఱికి చీవాట్లుపెట్టు గృహమేధులును