పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

120

శ్రీ దేవీ భాగవతము


సీ. అంతట భీష్ముని యనుమతిఁ బాండురా | జేలె రాష్ట్రంబు నిరీతికముగ
    వినుడు మేధావియౌ విదురుండు మంత్రిత్వ | మెనసి మంత్రము నిర్వహించుచుండె
    ధృతరాష్ట్రుఁక నువాని కిద్దరు భార్యలు | గాంధారి సౌబలి క్రమముమీర
    భామ రెండవయది కోమటి చిన్నది గార్హస్యధర్మముల్ గడుపుచుండె

తే.గీ. పాండునకు భార్యలిరువురు పరగఁ గుంతి | మాద్రియు ననంగ గాంధారి మహితులైన
    సుతుల నూర్వుర గనే యుయుత్సుండనంగ , గడుపు పంటాయెఁ గోమటిపడుచునకును.160

ఆ.వె.పెండ్లిగాకమున్నె పితృగేహమున గుంతి | సూర్యునంశ మెనయ సుతునిగాంచె,
    బిడ్డ కర్ణుఁ డనుచు బిలిచిరి , భూప్రజల్ పిదపఁ బాండురాజుఁ బెండిలాడె.161

వ. అనిన విని ఋషులు సూతున కిట్లనిరి.162

క. భువిపైఁ గుంతికి దివిపై | రవికిన్ సంయోగమెట్లు రహి గర్ణుని సం
   భవమెట్లు కన్యయై యెటు | ప్రవిమలతం దండ్రి యింట బాల వసించెన్.163

వ. మహానుభావుండవైన నీకుం దెలియనిది లే దిది మాకుం దెలిపి కటాక్షించవే యనిన
    సూతుండిట్లనియె.164

ఆ.వె. శూరసేనరాజుసుతఁ గుంతిఁ గుంతిభోజుందు పెంచుచుండి సుకృతులయిన
    వారిఁబూజసేయఁ బంచిన నల్ల కా ! నించుచుండెఁ గన్య విధులెఱింగి.165

క. ఈసరణి నుండఁగా దుర్వాసుండను జటిల విధుఁడు వచ్చినం గని పూ
    జాసామర్థ్యము జూపిన | దా సంతోషించి మిగుల దయదైవారన్.166

క. కన్నియ నీకొకమంత్రము | చెన్నుగఁ చెప్పెదను దానిఁ జేకొని జపమున్
   గ్రన్నవ జేసిన నీకుఁ బ్రసన్నుండగుఁ గాంక్షితాభ్రచరుఁడని పలికెన్.167

చ. అతఁ డది సెప్పి యేగిన యనంతర మా కలవాణి మంత్రశు
    ద్ధతఁ గనుగొందునంచు నొక దైవము నారసి యప్పుడే ప్రపూ
    ర్ణత నుదయించియున్న దిననాధుఁ దలంచి జపింప మానుషా
    కృత రవి భూమికం దిగియె రివ్వునఁ గన్యకయున్న చోటికిన్.168

తే.గీ. ఆ మహోనిధి నీక్షించి యబలమిగుల | సిగ్గుపడి యొక్క టనలేక చెదరిబెదరి
    మూలమూలల కొదుగుచు ముఖమువాంచి | యెట్టకేలకు ధృతబూని యిట్టులనియె.169

ఆ.వె. మానకేను మంత్రమహిమంబు పరికింవ | నిను జపించినంత నీవు గరుణఁ
    జేసి తింతెచాలు నా సేయు పుణ్యంబు | సఫలమాయె పొమ్ము సత్యచరిత.170

వ. అనిన విని దివాకరుఁడు.171

క. క్రన్నన మంత్రముచేతన్ ! నన్నేటికిఁ గోరితీపు నళినదళాక్షీ
   నిన్నుం గలయఁగఁ గోరిక | యున్నది తీర్చెదవొ లేదో యువిదా చెపుమా.172