పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

118

శ్రీ దేవీ భాగవతము


క. మాతండ్రి సమ్మతించినఁ | బ్రీతిన్ గళ్యాణ మొడవు పిత యొప్పనిచో
   భూతలనాథ స్వయంవర | భాతిన్ సమకూర్చుకొనుము పాణిగ్రహమున్.138

క. విని రాజు దాశునింటికిఁ | జనిన నతఁడు మ్రొక్కిపలికె జననాయక దా
   సుని నన్ను ధన్యుఁజేయఁగఁ | జనుదెంచితి వేది సెలవు సరగఁ దెలువుమీ.139

వ. అనిన జనవల్లభుండు.140

ఆ.వె. దాశవర్య నీదు తనయను నే ధర్మ | పత్నిఁ జేసికొనఁ బ్రయత్నపడితి
   నందు కియ్యకొను మనం దాశు డారాజుఁ | జూచి యిట్టు లను నయోచితముగ.141

ఆ.వె. చేయఁ దగిన పనిన చేయవలయుఁ గాక ! చేయరానిదెట్లు చేయవచ్చు
   నొక్కమాటయున్న దొప్పెదవా నీకు | గూతు నిచ్చుటకును కొఱత లేదు.142

వ. అతి యెద్దియనిన.143

క. ఈరమణికి జనియించు కుమారునకున్ రాజ్యమిచ్చి మన్నింపఁ దగున్
   వేఱొక్క కుమారకునకు | నీరా దీ సత్యమునకు నియ్యకొనియెదో.144

వ. అనిన విని రాజు గాంగేయు మనంబునం దలంచుకొని యిదియెట్లు సిద్ధింపఁ గలదని
   చింతాక్రాంతుఁడై గృహంబునకుఁజని నిద్రాహారస్నానపానాదులు వర్జించి కుందు
   చున్న నది యెఱింగి గాంగేయుడు తండ్రికడ కరిగి. 145

ఆ.వె. నిదురలేక కుంద నీకేల నాతండ్రి | ప్రబలుఁడైన యొక్క పగతు చేత
   గెలువఁ బడితె వేగఁ దెలుపు మే నిపుడేగి | గడియలోన వాని గర్వమడఁతు.146

క. తనయుఁడు పుట్టుట తండ్రిం | దనియించుట కొఱకుగాదె ధర్మజ్ఞులు చె
   ప్పినదది తప్పదు ప్రాగ్భవ మునఁజేసిన ఋణముదీర్ప బుత్రుఁడుపుట్టున్.147

సీ. తండ్రివాక్యమును సత్యముసేయనేకాదె రాముండు సనియె నరణ్యములకు
   తండ్రివాక్యమును దాఁ దలమ్రోచియేకాదె పరశురాముఁడు తల్లి నఱికివైచె
   తండ్రివాక్యము యథార్థముసేయనేకాదె వృథివి రోహితుఁడు దాఁ గ్రీతుఁడయ్యె
   తండ్రిమాటను దప్ప దగదనికా శునశ్శేపుండు యూపంబు సేరఁబోయె

తే.గీ. నాదికా దీ శరీరంబు నీది సుమ్ము | ఎందుఁ బంచిన బోయెద నేదిసేయు
   మనిన జేసెదనింక నీ మనమునందుఁ దాప మేటికి శోకింప దగదు తండ్రి.148

ఆ.వె. దేహమస్థికంబు దేహి దాఁజేసిన ! పనులు నిలిచియుండు జనవరేణ్య
   చింత దెలువుమయ్య చేత విల్లమ్ములు | పూని నిర్వహింతు భూమి మెచ్చ.149

ప. అని పలికిన కొడుకుమాటలు విని రాజు లజ్జపడి నాయనా నే నేమనిచెప్పెద నాకు
   నీవొక్కరుండవ కుమారుండవై తివి నా జీవితంబు వ్యర్థంబుగదా నీకుఁ గీడుకల్గెనేని