పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

110

శ్రీ దేవీ భాగవతము



వ. మఱియు వ్యాసునొద్ద నధ్యయసంబు సేసిన వారిలో ముఖ్యులయినవారు సుమంతుండును,
    జైమినియును, పైలుండును, వైశంపాయనుండును, నసితుండును, దేవలుండును,
    నిజకుమారుండగు శుకుండును నై యుండిరని సూతుండు మఱియు ఋషుల కిట్లనియె.54

సీ. వ్యాసుండు దా సత్యవతికి జన్మించిన విధమెల్ల మీరలు వింటిరీకద
    సంభవంబును మీరు సంశయింపఁగరాదు గొప్పవారలయందు గుణము లెన్న
    వలయును దోషముల్ వర్ణించుట యఘంబు మొదల పరాశరు ముట్టినట్టి
    బోఁటి శంతనుభార్య యౌటను ధర్మంబుకానట్లు తోఁచినగాని దైవ

తే.గీ. యోగమందదుగా మన యూహలకును | కాన నీ పుణ్యచరితంబు పూని విన్న
    సకలపాపంబులు దొలంగు సౌఖ్యమొదవు | దుర్గతులుదూలు బుణ్యంబు తోడదిరుగు.55

-: గం గా శా ప ప్రా ప్త్యా ది కథనము. -


వ. అని చెప్పిన సూతుం గొంచి ఋషు లిట్లనిరి.56

ఆ.వె. అమితతేజుడైన వ్యాసుని పుట్టువు | సత్యపతి చరిత్ర సత్యఫణితి
    వింటి మేము మిగుల వీనులు దనియఁగా | సయిన నొక్క సందియంబు గలదు.57
 
వ. అది యెద్ది యనిన.58

క. ఏ పేరుగలది సత్యవ తీపుణ్యవతికినిఁ దల్లి తెలుపు మెటుల న
   య్యాపగ శంతనుఁ గూడెన్ | బాపరహిత భీష్ము డెట్లు వసుసుతుఁడాయెన్.59
 
క. శంతనుని. మొదటఁ గలసిన | కాంత యెవతె భీష్ముఁ డేల కాంక్షలుడిగె భూ
   కాంతల పై జ్యేష్టుండై | సంతతసముదారకీర్తిశాలియు నయ్యెన్.60

క. మృతుఁగు విచిత్రవీర్యుని | సతి ధర్మవిదుండు వేదసారజ్ఞుడు స
   న్మతి యెట్టుల గూడెన్ ఫ | ల్గుత నెట్టుల గుండ గోళకులఁ గల్గించెన్.61

తే.గీ. తెలుపుమిది మెల్ల మునినాథ తేటపడఁగ | ననిన విని సూతుఁ డిట్లను నయ్యలార
   కలఁడు తొల్లిమహాభిషుం డలఘు కీర్తి | పరమధర్మాత్ముఁ డిక్ష్వాకువంశజుండు.62

క. వేయశ్వమేధములు సు | మ్మీ యాతఁడు నూరు వాజపేయంబులు సు
   మ్మీ యొనరించెను సురగణ | నాయకు నలరించి యేగె నాకంబునకున్.63

క. ప్రకటయశుండగు నాతం | డొకనాడు వెసం బితామహుని పురికేగెన్
   సకల సురవరులు తత్సే వకుఁ జని రత్త రిని గంగ వచ్చె నచటికిన్.64

తే.గీ. ప్రబలవాతంబు పొడమి యా బ్రహ్మయిల్లు దూగియాడంగ విబుధు లధోముఖులయి
   యుండ నిశ్శంకత మహాభీషుండు గంగ | వలచె గంగయు నాతని వలచి చూచె.65