పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వి తీ య స్కం ధ ము.

111


తే.గీ. బ్రహ్మ వారల యిరుపుర పాటు చూచి | మిగులఁగోపించి పుట్టుండు మీదు భువిని
    పుణ్యవశమున దివికి రాఁ బొసఁగు మీకు | బొండుపొండని శపియింపఁ బొక్కి పొక్కి.66

క. మనసులు చెడి బ్రహ్మాంతిక | మును విడిచిరి వారు రాజు పుణ్యులు రిపుసూ
    దనులయిన నృపులఁ బురుకుల | జుని దన పితయౌ బ్రతీపుఁ జొప్పడఁ దలచెన్.67
 
క. ఆనమయంబున నిజభా | ర్యాసహితులగుచును వసువు లతిమోదమునన్
    భాసిలిరి వసిష్ణాశ్రమ | వాసులగుచు నిజమనోభివాంఛలకొలదిన్.68

సీ. వారిలో ద్యౌర్నామ వసువు నతనిభార్య - ప్రేమ నీక్షించి యో ప్రియుఁడ చూడు
    మా ధేను వెవ్వరి దది మనోహరరూప | మున నొప్పు చెప్పవే యనిన నతఁడు
    వనితరో యిది వసిష్ఠునియావు దీనిపాల్ | చవిగొన్న పురుషులు సతులును నయు
    తాయువులగుచు నిరంతర యౌవనాం గు లగుదురని చెప్పఁ గోమలాంగి

తే.గీ. ధరిణియందు శీనరు తరణి నాకు | సఖి యది శుభాంగి కావున సరగ నీవు
    దూడతోఁగూడ ధేనువు దూర్ణలీల  ! గొంచు రమ్మిక నా చెలికొఱకు ననిన.69
 
వ. పరమతపోనిధియును శాంతుఁడు నగు వశిష్ఠుని నందినీ ధేనువు నపహరించి పృథ్వాది
   వసువులంగూడి ద్యౌర్నామ వసువు చనిన నప్పరమతపస్వి యాశ్రమంబునకు వచ్చి
   ధేనువుం గానక చింతిల్లి యనేక దుర్గమారణ్యంబులు వెదకి వెదకి వేసారి దివ్యజ్ఞానంబున
   వసువు లపహరించిరని యెఱింగి కోపించి మీరు మానవజన్మంబు లెత్తుదురుగాత యని
   శపించిన నది విని వసువులు వసిష్ఠుకడకుం జని శరణుజొచ్చి శాపమోక్షంబు వేడిన
   నతండు దయార్ద్రహృదయుండై మీలో బృథ్వాదులగు నేడ్వురును గ్రమక్రమంబున
   నొక్కొక్కవత్సరంబున నొక్కరుగా నేడు వత్సరంబులలో శాపంబుఁ దొలంగిన వారగుదురు.
   నందినిం జేతులార దొంగిలించిన ద్యౌర్నాముండు దీర్ఘకాలంబు మానుష దేహంబున
   నుండునని నుడివిన విని పృథ్వాదులగు వసువులు మార్గంబునం బోవుచుండ
   నంతకుమున్న బ్రహ్మచే శప్తయై దుఃఖంబున భూలోకంబున కరుగుచున్న గంగం గాంచి
   తారును దీనాననులయి యిట్లనిరి.70

ఉ. గంగ దయారసంబు సెలగంగను మమ్ముల మానుషత్వమే
    గంగ నుపాయమొండు కలుగంగ దలంచితి మీవు భూమికే
    గం గని శంతనుం గలయం గని పుట్టుదు మేము నీకు పే
    గం గడుపాసఁ బుచ్చి తొలగంగ జలంబుల ద్రోయుమీ మమున్.71

క. అందున మేము కృతార్థత | నొంది సురాలయము మరల నొందుదు మనినన్
    మందాకిని యందునకు న | మందానందంబుఁ బొంచె మరలిరి వారల్.72