పుట:శ్రీసూర్య శతకము.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చ. బడలఁడు డప్పి లే దలఁత బట్టదు మై మఱువండు పాంథుడై
మిడిమిడి యెండ బగ్గుమని మీఁదఁబడం జగమెల్లఁ గ్రుమ్మఱన్
సడలఁడు పచ్చగుఱ్ఱముల చాలను రమ్యవనంబు పట్టి యీ
తఁడు రవిసూతుఁ డీప్సిత పదార్థములం గృప మీకునిచ్చుతన్.

తా.తీవ్రములైన సూర్యకిరణములు దాకియు నెవడు బాటసారివలె మూర్చ జెందడో, ఎవడు డస్సినను తన దేహము సరిగా నుంచుకొనునో, ఎవడు వాడికిగణములచేత నోరెండకుండ నుండునో, అట్టి సూర్య సారథి మిమ్మ బ్రోచుగాత.(సూర్యకిరణముల వేడికి మానవులకు పై యనుభవములు గలుగును)[60]

ఉ.తీరిన గంగలో నిసుకతిన్నెల దూరిన డెక్కెలాడ క
మ్మేరుపుకందరంబు లను మెట్టుల మ్రొగ్గినఁ గాళ్లు తొట్రిలన్
మీరిన పచ్చరాగరిక మేయఁగ సూర్యుగుఱాలు నిల్వ సాం
పూనఁ జలోచలోజవిది హుమ్మను నగ్రగుఁ డేలు మిమ్ములన్.

తా. ఆకాశ గంగాతీరపుటిసుకలో గుఱ్ఱముల డెక్కులు కూరుకుపోవుచున్నవి. మేరుపర్వత శిఖరముల కాళ్లు జాఱుచున్నవి. దూర్వాంకురములు గల స్థలములోయని మరకతములుగల స్థలముల నాగుచున్నవి. అట్లు గుఱ్ఱముల వేగపు నడకను నదలించుచు, హుంకారము సేయు ననూరుడు మీకు శ్రేయము చేయుగాత. [61]

రథ వర్ణనము

ఉ. ఠీకుగఁ బ్రాగ్గిరి న్వెనుక డెక్కలయంచుల నిల్వ ఱొమ్ములన్
జౌకుమొయిళ్లు మేనులను సాచక యెత్తిన శబ్దహీనమై
ప్రాకెడి చక్రముం గలిగి పాఱ ననూరుఁడు లేచి మ్రొక్కినన్
వీకున సంతరిక్షమున వే జను సూర్యునితేరు మీకగున్

తా. బలిసిన ఱొమ్ములచే మేఘములను గ్రుమ్ముచు, గొరిజ లాధారముగా నిలువబడియున్న యశ్వము లొక్కమారు రథము కదలించుటచేత అనూరుడు వెల్లకిలబడి సూర్యునికి నమస్కారము గావించుచున్నాడు. అట్టి రథము మీకు మేలు చేయుగాత.[62]