తా. జగమనెడు మహాసభకుగల ఏడు కక్ష్యలను ఏడు గుఱ్ఱములచే దాటించి, చీకటిని తరుముచు, ఏడు కులపర్వతములను లోకమునకు కన్పింప జేయుచు, కసగోల యనెడు బెత్తముతో సూర్యునిరాక తెలుపు ప్రతిహారియైన యనూరుడు మీ యఘముల దొలగించుత.[57]
ఉ. పగ్గము లొ నటం చరుణ వారుణపాశము లంటఁబోకుమా
యెగ్గిడి యేకచక్రమని కృష్ణునిచక్రము ముట్టఁబోకుమా
దిగ్గున నెన్మిదౌ తగును దేవహయం బనఁబోకుమా యటం
చగ్గముగాఁ బరోపకృతి కర్కుఁడు దిద్దినవాఁడు మీ కగున్.
తా. తనకు రథము తోలుటకు తగిన సాధనసామగ్రి యితరులనుండి గ్రహింపకుండ సూర్యుడు తన సారథియైన యరుణుని వారించుచున్నాడు. పగ్గములు సరిగా లేవని వరుణుని పాఠములను గ్రహింపకుము. నీ రథమున కొకటే చక్రము గలదని విష్ణుమూర్తి చక్రము నడుగకుము. నీ రథమున కేడు గుఱ్ఱములున్నవని ఎనిమిదవ గుఱ్ఱముకొఱకు ఇంద్రుని యుచ్ఛైశ్వవము కోరకుము" అని వారించు సూర్యుడు మీకు శుభముల నొసగుగాక.[58]
మ. పురుహూతా! కనుదమ్ము లొప్పే శిఖిదీప్తుల్లేవె యిచ్చోటఁ గా
సరము న్నిల్పుము తాతపాదనతికై సౌరీసరే నిరృతీః
వరుణా ! చూడుము, మారుతాఝడితి తెల్పంబడ్డదో శ్రీదయీ
శ్వరమీళే యని వైపుణేండ్ల నను భాస్వత్సూతుఁ డేలున్ మిమున్.
తా. ఇంద్రుడా! నీ వేయికనుదమ్ములు క్షణమాత్రము వికసింపగలవు. అగ్నీ! నీ కాంతి యిక తగ్గును. యముడా! నీవు నీ వాహనమును కొంచెము మరల్పుము. నైరుతీ! నీ వట్లే చూచుచుండుము. వరుణుడా! ఈ గుఱ్ఱములను నీటిచే తడుపుము. వాయుదేవుడా! గుఱ్ఱమునకు జవసత్వముల నిమ్ము. కుబేరా శివునకు నమస్కరింపుము-అని అష్టదిక్పాలకులను హెచ్చరించు అనూరుడు మీకు మేలు చేకూర్చుగాక.[59]