Jump to content

పుట:శ్రీసూర్య శతకము.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరస్తు

శ్రీ సూర్యనారాయణ పరబ్రహ్మణే నమః.

శ్రీ సూర్యశతకము

::అవతారిక::

ఉ. శ్రీపతి శాంకరీపతి శచీపతి వాక్పతి నాకలోక సే
నాపతి సుస్వరాపతి వనాటపతి ప్రతికూలకార్య వా
ర్తాపతి గూఢపాత్పతి పతంగపతి ప్రముఖాభిలైకర
క్షాపతుల న్మదిం గని త్విషాంపతిఁ బ్రస్తుతి సేయఁబూనితిన్. [1]

చ. కలుగు తెలుంగుకబ్బములు కట్టడిమందలు మంద లిన్ని వం
దలను గణింప శక్య మగునా? యిక నందుల కేమి యందులో
లలితపదార్థ విస్ఫురణలం దనియించు పరోపకార మా
న్యులు పదివేల కొక్కఁడుగ నుండును పాత్రులు వారు ప్రస్తుతిన్. [2]

శా. ఔరా ! నోరు రసంబు లూరు పద మాహా ! కోటికిన్ తీరు మ
జ్ఞారే! రచ్చలఁ జేరుఁ జేరనుచు నిచ్చ ల్పామరు ల్మెచ్చఁగాఁ
దా రింతేనియు సిగ్గులేక గణికాతండంబులం బోలె పల్
దారుల్ ద్రొక్కి పదార్థముల్ గొను కపుల్ పాత్రుల్ గదా నిందకున్. [3]

చ. విలసిత సాహితీ విమలవృక్షముకొమ్మ మయూరనామ సం
కులసరఘాళి శుద్ధపదగుంభ సుమాసవ మేఱ్చుు చేర్చినన్
కలయఁగఁ గట్టు సూర్యశతకం బను కండెను దాసు రాముఁడన్
తెలుఁగునఁ గొట్టి కమ్మనగు తేనియఁ దీసితి దీనిఁ గ్రోలుఁడి! [4]

చ. మును భువి నెంద ఱెందఱు కవుల్ విపులార్థము లెన్ని యెన్ని క
ల్వనములు నాఁట నాఁట నిరపాయమతిన్ రచియించి మించి ర
య్యనుపమ పాండితీచతురులం దొకసాటికిఁ బేటి కంచుఁ గా
కనియెద నే నిహార్ధమ పరార్థము భాస్వదనుగ్రహార్థమున్. [5]