పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/481

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

474

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


తే.

నిలిచినది గాక నే నిందు నిలువ వెఱతు
ననిన దరహాసతాస్యుఁడై యన్నమోము
గాంచి కృష్ణుండు పల్కె నోకామపాల
చూడ సిరియందుఁ గొదువలెంచుటను దగునె?

205


సీ.

వైకుంఠపురమందు వరమృదుతల్పమై
        యున్నతాకృతిని నీ వుండినపుడు
హరిఁ గూడి నీమీఁద నానందముగ నుండు
        నంతియ కాని ని న్నన్యుఁడంచుఁ
దలఁచునె లక్ష్మి సీతాదేవి యైనప్పు
        డిలను లక్ష్మణుఁడవై యెల్లయెడలఁ
జరియించునపుడైనఁ బరుఁడంచు నీమీఁద
        నరమర నుంచెనె యనిన సీరి


తే.

నవ్వి యిట్లని పల్కె నానాఁడు సీత
యన్న మాటలు మఱపురాకున్న విపుడు
సిరి రజోగుణమును దలంచిన భయంబు
నామదిని బుట్టుచుండునో నందతనయ.

206


క.

అని తాలాంకుఁడు పల్కఁగ
విని కృష్ణుం డిట్టులనియె విశ్రవసునిపు
త్త్రుని రామునిచేఁ జంపిం
పను బని గలుగంగ నట్లు పలికెఁ గదన్నా.

207


క.

ఆమాటలు మఱువక యిపు
డీమాడ్కిని లక్ష్మితప్పు లెన్నుచు మదిలోఁ
బ్రేమయు నుంచక యరుగఁగ
నీమహితాశ్రమము విడువ నేమిటి కనఘా.

208