పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/428

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠాశ్వాసము

421


మ.

విను పద్మావతి యొంటికాఁపురము నీవే చేయుచు న్వేడ్కఁగా
నను నర్ధక్షణమైనఁ బాయక సదానందాత్మవై యుంటి వా
వనజాతాలయ నచ్చి సంతతము నావక్షస్థలం బందు ని
ల్చిన నీ వప్పుడు చూచి యోర్వఁగలవే చింత న్మదిం బొందకన్.

24


క.

నీ విచ్చట ననుఁ గూడుట
కై వననిధితనయ వచ్చినప్పుడు తిరుగా
నావక్షస్థలి నిడుకొన
కావేళనె పంచి తచటి కబ్జదళాక్షీ.

25


సీ.

అన విని చింతించి యపుడు పద్మావతి
        పలికె నిమ్మెయి రమాభామ యిటకు
వచ్చియున్నపుడు మీవక్షస్థలంబునం
        దిడికొన్న కొదువ నా కేలగల్గు
నాలక్ష్మి మీకు నా కన్యోన్యముగఁ జేసి
        యంతటికిని గర్త యగుచు నుండు
శ్రీరమాకాంతయై సీతయై ననుఁ బెండ్లి
        యాడు మటంచు నీ కాప్తముగను


తే.

జెప్పినందుననే కదా చిత్తగించి
నన్ను జేఁబట్టిరి సదానంద మొదవె
సింత భాగ్యంబు కృపను నా కిచ్చినట్టి
సిరికిఁ బ్రత్యుపకృతి నేను జేయఁగలనె.

26


క.

ఏరీతిగ నిచ్చటికిని
గూరిమిలో సిరిని దోడుకొని వచ్చిన నే
నారామామణిపదములు
గౌరవమునఁ గొల్చియుందుఁ గమలదళాక్షా.

27