పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీరస్తు

శ్రీవేంకటాచలమాహాత్మ్యము

తృతీయాశ్వాసము

క.

శ్రీకర! నిర్జరమౌనివ
శీకర! సద్భక్తహృదయశృంఖలయభవా !
రాకేందువదన! శుభకర!
ప్రాకటతఱికుండనృహరి! పాపవిదారీ!

1


సీ.

ఓసూత మేము బ్రహోత్సవక్రమము న
        త్యాశ్చర్యముగ వింటి మపుడు విష్ణు
చక్రంబు బహుచోరసంఘంబులను నిగ్ర
        హించె నంటివి వారి నెట్లు ద్రుంచె
నారీతి విన వేడుకైనది దెల్పు నీ
        వనిన సూతుండు సంయములఁ జూచి
మునులార వినుఁ డక్కథను వివరించెద
        నాచక్రమహిమ విఖ్యాతిఁగాను


తే.

చక్రరాజంబు మాధవాజ్ఞను వహించి
సంతసము మీఱ రాజవేషంబు దాల్చి
యరిగి జగములు భయమంద నమితశౌర్య
మును గడంగి దిశ ల్కీర్తి దనర నపుడు.

2