పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/160

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

125


ధరణి మనుష్యానందము
తరియైనన్‌ దివిని దేవతానందంబున్‌
గురుఁడై బ్రహ్మానందము
పరగన్‌ గోటీశుఁ డిచ్చు భక్తుల కెపుడున్‌. 193

వరకోటీశ్వర సత్కృపోన్నతి సుదృగ్భావంబు గల్గున్‌ మనో
హర కాంతాసుత పుత్త్రికాధన మృదువ్యాహార బాహ్యార్థ వి
స్తర శాస్త్రాగమ వేదతర్క కవితాస్వారస్య విద్యావళీ
గరిమల్‌ దీర్ఘతరాయువుల్గలుగు సాకల్యంబుగా నెంతయున్‌. 194

మూర్తిత్రయ శిఖరంబై
కీర్తింపఁగఁ దగినయట్టి గిరివరు మీఁదన్
మూర్తిత్రయ మయుఁడై శివు
డార్తిచ్ఛిత్కోటి లింగమై విలసిల్లున్‌. 195

ఇల మూర్తిత్రయ మూలమై దనరు కోటీశాను సేవింపఁగా
నల మూర్తిత్రితయంబు వశ్యమగు నెట్లన్నన్ ధరిత్రిన్ విని
శ్చల భూజస్ఫుట మూలమున్ బెరుకఁ దచ్ఛాఖావళుల్‌ వెంబడిన్‌
చలనంబొందుచు వచ్చురీతిని మహా సౌభాగ్యమూలాంబునన్‌. 196

ఇట్టి కోటీశుఁ గొల్వక యితర దైవ
వితతి సేవించుటెల్లను వెఱ్ఱితనము
నికట భాగీరథీనదీనీర ముడిగి
మరుమరీచిక సేవించు మనుజునట్ల. 197

తరువు పుష్పఫలమ్మిచ్చు తఱి యెఱింగి
యమర భూజంబు ఫలమిచ్చు నడిగి నపుడె
యమరు విత్తులు ఫలము దేహాంతరమున
విన్నివిధముల నిచ్చుఁ గోటీశ్వరుండు. 198