పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/103

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

70

శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము


అని చెప్పిన విని యుమాదేవి దేవా: కోటీశ్వరుండు విష్ణు బ్రహ్మ శిఖ రంబుల పాప వినాశన నూతన కోటీశ్వర లింగరూపంబుల నుండుట కేమి కతం బనిన శివుం డిట్లను - మున్ను దక్షాధ్వరంబున కరిగిన మునీంద్రులు కొందఱు సనకాదులంగూడి త్రికూటాద్రి కేతెంచి కోటీశ్వర ప్రసాదంబున విగతదోషులగుట విని నిలింపులు దక్షాధ్వరంబునందు హవిర్భాగంబులు గొనిన స్వకీయ దురితంబు నపనయింప నా త్రికూటాద్రి కరిగి యందు విష్ణు శిఖరాగ్రంబునందుండు మహావిష్ణు దర్శించి పూజించి యిట్లనిరి.131

దేవదేవ : సరోజాక్ష : దీనసులభ :
భక్తమందార ! యిందిరాప్రాణనాథ :
దక్షమఖమున మును హవిర్భక్షణంబు
సేయ మముఁ జెందు దురితంబు పాయుబెట్లు ?132

పాపవినాశన స్థలమహిమ


అని నుతుల్గావించు నమరుల వీక్షించి
         పద్మాక్షుఁ డిట్లనుఁ బ్రాజ్ఞులార :
పంచాక్షరీమంత్ర పఠనమ్ముఁ జేయుచు
         ఘన విరజోదీక్ష గలిగి మీరు
కోటీశు హృత్పద్మ కోశంబునను నిల్పి
         తపము సేయంగఁ బ్రత్యక్షమగుచు
త్య్రక్షుండు మీదోష మక్షయంబైనను
         క్షమియించి రక్షించుఁ గరుణతోడ
ననుచు నుపదేశ మొసఁగిన నమరసంఘ
మమితభక్తిని విష్ణుకూటాగ్రమందు
తపముగావింప నంత దదగ్రసీమ
నెలమిఁ బ్రత్యక్షమయ్యెఁ గోటీశ్వరుండు.133