పుట:శృంగారశాకుంతలము.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

56

శృంగారశాకుంతలము

     నిక్కడి కొంటి వచ్చుటకు నెయ్యది కారణ[1]మంతవట్టు నీ
     నిక్కముఁ జెప్పమన్న ధరణిపతి సత్యచరిత్రుఁ డాత్మలోన్.81
క. వారక యసత్యవచనము
     నారకహేతు వనఁగను [2]వినంబడెడుం బు
     ణ్యారణ్యములోపల ముని
     దారికలకుఁ బొంక నేల ధర్మచ్యుతిగన్.82
వ. అని విచారించి వారలతో నేను దుష్యంతుఁడ గాంతారంబున దుష్ట
     మృగంబుల మర్దించుటకై వేఁటవచ్చి మాలినీతీరంబునం బరివారంబు
     నిలిపి కణ్వమహాముని న్నమస్కరించి పోవుతలంపున వచ్చి యిచ్చట నొక్క
     కలువకంటి యొంటి నాక్రోశింప మీయార్తనాదంబు విని యరుగుదెంచు
     నప్పటికి మీసరససల్లాపంబులై యున్నయవి యని యల్లనల్లన శకుంతలం
     గనుంగొనుచుండ నచ్చట.83
శా. ఆకాంతాతిలకంబు చన్నుఁగవపై నందంద రోమాంచ మ
     స్తోకంబై పొడకట్ట నుత్కలికచేతోభీతి సంధిల్ల నా
     క్ష్మాకాంతామణి మంజుభాషణము లాకర్ణించుచుం దోన తా
     నాకర్ణించె మనోజచాపగుణసాహంకారఠంకారముల్.84
క. భావభవవుష్పచాప
     జ్యావల్లీరవము తన్మయత్వముఁ దెలుపం
     దేవేంద్రతనయసన్నిభు
     నావిభుఁ గనుఁగొనుచునుండె ననిమిషదృష్టిన్.85
చ. కొలఁదికి మీఱు కోర్కుల శకుంతల చూడ నృపాలుడెందము
     న్నలుపును దెల్పునైన నలినచ్ఛదలోచన లోచనచ్ఛవు
     ల్శలలము లట్ల నాటుకొన సౌరభలోభమున న్మధువ్రతం
     బులు పగులంగా నాటుకొనెఁ బుష్పధనుర్ధరుఁ డేయు తూపులున్.86

  1. మింతపట్టు
  2. వినంబడునీ